Showing posts with label Tell me dad. Show all posts
Showing posts with label Tell me dad. Show all posts

Friday, April 12, 2013

సూక్ష్మజీవులు... మహాగట్టివి!

ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఇప్పటికీ రకరకాల వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి. దీనికి కారణం పలురకాల వ్యాధులకు కారణమ య్యే సూక్ష్మజీవులు... మనం వాడే మందులకు అలవాటుపడి మొండిగా తయారయ్యాయి! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా.. మలేరియా వంటి వ్యాధులు బాగా ప్రబలడానికి గత కొన్ని దశాబ్దాలుగా మానవసమాజం వివిధ మందులను దుర్వినియోగం చేయడమేనని నిపుణులు అంటున్నారు.

అవసరం లేకున్నా మందులను వాడటం, అవసరాన్ని మించి మందులను వాడటం, వాడాల్సిన పద్ధతిలో వాడాల్సినన్ని రోజులు వాడకపోవడంతో పాటు కల్తీమందులు లేదా నాసిరకం మందులు కూడా వివిధ సూక్ష్మజీవులు తిరిగి శక్తి పుంజుకోవడానికి కారణమవుతున్నాయి.

ప్రస్తుతం టీబీ వల్ల ప్రపంచంలో ఏటా 20 లక్షలమంది చనిపోతున్నారు. ప్రతి ఏటా కొత్తగా 30 నుంచి 50 కోట్ల మందికి కొత్తగా మలేరియా వస్తోంది. ఈ వ్యాధికి గురైనవారిలో ఏడాదికి 27లక్షలమంది చనిపోతున్నారు. ఇక ఫ్లూ జ్వరం వంటివ్యాధుల బారిన పడే వారి సంఖ్య లెక్కలేదు. ఇలాంటి వాటన్నింటికీ వ్యాధికారక సూక్ష్మజీవుల మందులను వాడే విషయంలో మనందరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Tuesday, February 26, 2013

టీవీని ఎంతదూరం నుంచి చూడాలి?

టీవీని ఆన్ చేయగానే పిల్లలు ముందు ముందుకు వచ్చి చూస్తుంటారు. అది ఆ కార్యక్రమాల పట్ల ఆసక్తి కావచ్చు. టీవీని తగిన దూరం నుంచి చూడాలని డాక్టర్లు చెబుతుంటారు. అంటే ఎంత దూరం అనే ప్రశ్న వస్తుంది. మీ ఇంట్లో టీవీ స్క్రీన్ సైజు ఎంతో గమనించి, దానికి నాలుగింతల దూరంలో కూర్చుని చూడటం మంచిదంటున్నారు డాక్టర్లు. ఏ టీవీ అయినా కనీసం 8 అడుగుల దూరం నుంచి చూడటం మంచిది.

టీవీకి సంబంధించిన రెజల్యూషన్ ఎంత ఎక్కువగా వుంటే అందులో కనిపించే చిత్రం నాణ్యత కూడా అంత మెరుగ్గా వుంటుంది. టీవీ తెరమీద మనకు కనిపించే ప్రతి చిత్రం అనేక వేల చిన్న చిన్న రంగురంగుల చుక్కలతో రూపొందుతుంది. వీటినే పిక్సెల్స్ అంటారు. మనకు సరిగా లేదని, గదిలో వెలుగు తక్కువగా ఉందని టీవీ లైటింగ్ పెంచుతుంటారు. ఇది కళ్లకు ఏమాత్రం మంచిది కాదు.

విద్యుత్ ఎలా ప్రవహిస్తుంది?

ఏదైనా విద్యుత్ పరికరం పనిచేయాలంటే అందులో కీలకమైన విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్ వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి.

నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ ఉన్నట్టే విద్యుత్ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర, ఎలక్ట్రాన్లు పోయే చివర అంటూ రెండు ధ్రువాలు ఉండాలి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక ధ్రువాన్ని భూమికి కలిపి రెండవదానిని విద్యుద్వాహినిగా చేస్తారు. భూమికి కలిపిన చివరను న్యూట్రల్‌గాను, విద్యుత్ ప్రవహించే తీగను ఫేజ్ లేదా లైన్ గానూ వ్యవహరిస్తారు.

ప్రతిసారీ మనం ఇళ్లలో గొయ్యితవ్వి భూమికి ఒక వైరును తగిలించలేం కనుక ఇళ్లకు వచ్చే సరఫరాలోనే భూమిని కలిపే సదుపాయమే న్యూట్రల్. ఇక బ్యాటరీల విషయానికి వస్తే విధిగా రెండు తీగలు ఉండాలి. ఇక్కడ ఒక తీగ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీలోనే విద్యుత్ ప్రవాహం ఆరంభమవుతుంది గనుక తిరిగి ఎలక్ట్రాన్లు అక్కడికే చేరాలి. లేకపోతే వలయం తెగిపోతుంది.

ప్రెషర్ కుకర్ ఎలా పనిచేస్తుంది?

అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించే వంటింటి పరికరం ప్రెషర్ కుకర్. దీనిలో వండటం వల్ల వంట త్వరగా అవుతుంది. ఇందులో పలురకాలు కూడా ఉంటాయి. కేవలం అన్నం మాత్రమే ఉడికించేది రైస్ కుకర్.

సాధారణంగా వంటింటి వేడి వాతావరణ పీడనం దగ్గర 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి మించి ఉష్ణోగ్రత అందించడం కష్టం. ఎందుకంటే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి దగ్గరకు వచ్చేసరికి నీరు ఆవిరై పోతుంది. అయితే అధిక పీడనంలో ఉంచితే నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద ఆవిరికాదు. దాని బాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే నీరు ఆవిరి కాకుండానే 110 లేదా 120 డిగ్రీల సెంటీగ్రేడు వరకూ అధిక ఉష్ణోగ్రతను అందించగలుగుతాం. ప్రెషర్ కుకర్‌లో జరిగేదిదే ఎక్కువ వేడి అందుతుంది. కనుక త్వరగా అన్నం ఉడుకుతుంది.

ఇనుముకి తుప్పు ఎలా పడుతుంది?

మన ఇళ్లల్లోని ఐరన్‌బాక్స్, సైకిళ్లకి తుప్పు పట్టడం చూసే ఉంటారు. ఇనుము తప్పు పట్టేందుకు ముఖ్యకారణం ఆక్సిజన్. నీటిలో తడిసినప్పుడు, గాలిలోని నీటి ఆవిరి చుట్టూ పేరుకున్నప్పుడు ఇనుము నీటితో చర్య జరుపుతుంది. అంటే ఇనుము నీటిలోని ఆక్సిజన్‌ను తీసేసుకుని హైడ్రోజన్‌ను వదిలేస్తుంది. ఇనుము, ఆక్సిజన్ రెండూ కలిసి ఫై ఆక్సైడ్(తుప్పు) తయారై ఇనుముపై పేరుకుపోతుంది. తుప్పు పొడిపొడిగా ఉండి మిగిలిన ఇనుముతో సంబంధం కలిగి ఉండదు. దాంతో రాలి కిందపడిపోతుంది.

తుప్పుపట్టిన వస్తువు బరువు క్రమేపీ తగ్గుతూ కొన్ని రోజులకు అది మొత్తం విడిపోతుంది. దీనివల్లనే ఇనుప వస్తువులకు తుప్పు పట్టకుండా పెయింట్, నూనె, గ్రీజు వంటివి పూస్తారు. ఇవి ఇనుముకు, నీరు, నీటి ఆవిరికి మధ్యన ఉండి ఇనుము ఆక్సిజన్ కలవకుండా చేస్తాయి.

రసాయనాలను గాజుపాత్రలోనే ఎందుకు ఉంచాలి?

గాజుసీసాల్లో రసాయ నాలను ఉంచేందుకు రెండు కారణాలుఉన్నాయి. ఒకటి గాజు రసాయనికంగా స్థిరమైనది. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రియ పదార్థాలు ఏవీ గాజుతో చర్య చెందవు. రెండోది... గాజు పారదర్శకత వల్ల లోపల ఏముందో, ఎలాఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాంతి సమక్షంలో చర్యలకు లోనయ్యే కొన్ని రసాయనాలను రంగు గాజు పాత్రలలో ఉంచుతారు.

ఉదాహరణకు హైడ్రోజన్ పెరాక్సైడ్, అసిటోన్, బెంజిన్ వంటి ద్రవాలను గోధుమరంగు పారదర్శక గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు. ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం(హెచ్‌ఎఫ్)ను గాజు పాత్రలలో ఉంచకూడదు. గాజులోని సిలికెట్లతో అది రసాయనికచర్య జరపడమే అందుకు కారణం. చటుక్కున మండే దహన శీలత ఉన్న పదార్థాలను కూడా గాజు పాత్రల్లో ఉంచరు. పొరపాటున పగిలితే ప్రమాదం.

70 ఎం.ఎం. అంటే ఏమిటి?

మామూలు ప్రొజెక్టర్‌లో రీళ్లు తిరిగే ఫిల్మును 35 ఎం.ఎం.ఫిల్మ్ అంటారు. దీని అడ్డం 35 మిల్లీమీటర్లు (లెన్స్‌లో), నిలువు సుమారు 26 మిల్లీ మీటర్లు(లెన్స్‌లో) ఉంటుంది. పెద్ద థియేటర్లలో వాడే ఫిల్ము అడ్డం కొలత 70 ఎం.ఎం. ఉంటుంది. సాధారణంగా ఎడమ నుంచి కుడికి ఎక్కువ విస్తారాన్ని, పైనుంచి కిందికి తక్కువ విస్తారాన్ని చూస్తుం టాం. అందుకే థియేటర్లలో తెర ఎడమ కుడి దిశల్లో ఎక్కువగా, పైనుంచి కిందికి తక్కువగా ఉంటుంది. ఇలా అడ్డానికి, నిలువుకి ఉన్న నిష్పత్తిని ఆస్పెక్ట్ నిష్పత్తి అంటారు.

చాలాకాలం పాటు ఇది 4:3 నిష్పత్తిలో ఉండేది. సినిమా స్కోపు ప్రక్రియలో ఇది 16:9 లేదా 37:20 లేదా 47:20 నిష్పత్తిలో ఉంటుంది. ఆ విధంగా క్రమేపీ నిలువుకంటే అడ్డం పెరుగుతూ వచ్చింది. తద్వారా కుడినుంచి ఎడమకి ఎక్కువ విస్తారంలో దృశ్యాల్ని తెరమీద చూసే అవకాశం ఏర్పడింది. అంటే 4:3 నిష్పత్తి ఉన్న తెరమీద కంటే సినిమా స్కోపు తెరమీద ఎక్కువ పాత్రలను, దృశ్యాలను మొహరించవచ్చు. సాధారణ తెర అయినా, సినిమా స్కోపు తెర అయినా, బొమ్మను పంపే ఫిల్మ్‌లో దృశ్యం పొడవు, వెడల్పుల నిష్పత్తి మాత్రం మారదు.

Monday, February 18, 2013

చంద్రుడిపై వాసం మంచిది కాదా?

చంద్రుడి దగ్గరకు వెళితే ప్రమాదమా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడిమీద ఉండే ధూళికణాలు కేన్సర్‌కు కారణమవుతాయని అంటున్నారు. చల్లని వెన్నెల నెలరాజు అనారోగ్యాన్ని కూడా అంతే బాగా అంటగడతాడట. కోట్లాది సంవత్సరాలుగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ధార్మికతకు లోనైన అక్కడి మట్టి చంద్రశిలలుగా గడ్డకట్టుకుపోయింది. ఈ చంద్రశిల నుంచి వచ్చే ధూళి కేన్సర్ కారకమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఎంతో మెత్తగా ఉండే ఈ ధూళి ఊపిరితిత్తుల్లోకి సులభంగా చేరుతుంది.

ఈ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతోపాటు కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయట. గుండెజబ్బులకు కారణమయ్యే అవకాశాలూ ఉన్నాయట. చందమామ మీదకు వెళ్లి వచ్చిన వ్యోమగాములు శ్వాససంబంధమైన సమస్యలు ఎదుర్కొన్నారని శాస్త్రవేత్తలు ఉదహరిస్తున్నారు. వారి దుస్తులకు అంటుకొన్న చంద్రధూళి అంతరిక్షనౌకలో చేరడం ఇందుకు కారణమంటున్నారు. అందుకే చందమామపై ఉండటం, అక్కడి గాలి పీల్చడం చాలా ప్రమాదకరమట!

Sunday, February 10, 2013

హిప్నాటిజం అంటే ఏమిటి?

మనిషి మానసిక స్థితిని మార్చడం లేదా నియంత్రించగలగటం. ఇది చేసేవారిని హిప్నాటిస్ట్ అంటారు. అనాదిగా మనిషి ఊహించని శక్తిసామర్థ్యాలు చేసిచూపడంలో ఈ కళను ఉపయోగిస్తున్నాడు. దీన్ని గురించి వియన్నాలో డాక్టర్ మెస్మర్ తొలిసారిగా శాస్త్రీయపరిశోధన చేపట్టాడు. చాలాకాలం ఈ కళను మెస్మరిజం అనే వారు. ఇది డాక్టర్ మెస్మర్ పేరున వచ్చింది. 1840లో స్కాట్లాండ్‌కి చెందిన సర్జన్ జేమ్స్ బ్రైడ్ తొలిసారిగా దీన్ని ‘హిప్నాటిజం’ అని పేరుపెట్టి ప్రచారం చేశాడు.

గ్రీక్‌లో హిప్నోస్ అంటే నిద్రాస్థితి అని అర్ధం. దీన్నించే వచ్చింది హిప్నాటిజం అనే పదం. హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి హిప్నాటిస్ట్ అధీనంలోకి వస్తాడు. అతను ఏది చెబితే అది చేస్తాడు. అయితే అలా హిప్నటైజ్ అయేందుకు పూర్తిగా అంగీకరిస్తేనే వీలుపడుతుంది. హిప్నటిస్ట్ ఆ వ్యక్తిని తన అధీనంలోకి తీసుకుని తాను చెప్పినట్టు వింటాడు, ప్రశ్నలకు సమాధానాలూ చెబుతాడు. ఏదైనా అంశాన్ని గురించి అడిగినపుడు దానికి సంబంధించిన వివరాలు తెలియజేయగ ల్గుతాడు. హిప్నటైజ్ అయిన వ్యక్తి ఆ స్థితి నుంచి బయటపడిన తర్వాత అప్పటి వరకూ ఉన్న తన పరిస్థితిని గుర్తుంచుకోలేడు.

చంద్రుడు ఎందుకు అలా కనపడతాడు?

భూమిచుట్టూ చంద్రగోళం తనచుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఈ తిరగడంలోనూ చిత్రమేమంటే చంద్ర గోళం తనచుట్టూ తాను తిరగడానికి ఎంతకాలం పడుతుందో, ఇంచుమించు అంతే కాలంలో భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనకనే మనకు ఎప్పుడూ చంద్రుడిలో ఒక వైపే కనపడుతుంది. అయితే ఇలా తిరగడంలో భూమి ఆకర్షణ శక్తి లక్షల సంవత్సరాలుగా పనిచేస్తూ ఈ రకమైన ఏర్పాటుకు దారితీసిందంటారు శాస్త్రవేత్తలు.

భూమి నుంచి చూసేవారికి చంద్రబింబం కొంచెం వెనక్కి, ముందుకు ఊగిసలాడుతున్నట్టు ఉంటుంది. అందుకే చంద్రుడు కనిపించేది ఒకే భాగమయినా, అందులోనే ఒకింత తేడా కనపడుతుంది. దీనికి రెండుకారణాలున్నాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం ఒక సరయిన వృత్తాకార మార్గంలో కాదు. అంటే కొంచెం సాగదీసిన వలయాకారంగా ఉంటుంది. కనుకనే తిరిగే వేగం, దూరాన్ని బట్టి, చుట్టూ తిరిగే వేగం కంటే కొంచెం ముందుకు, వెనక్కీ ఉంటుంది.

Tuesday, February 5, 2013

సముద్రాలు తీరాలను తినేస్తాయా?

భూవాతావరణం వేడెక్కడం వల్ల కిలోమీటర్ల మేర తీర ప్రాంతం సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. దాంతో సముద్రం ఇసుక తిన్నెలను తనలో కలిపేసుకుంటూ మరింత ముందుకు వచ్చేస్తుంటుంది. ఇది పర్యావరణ నిపుణులను సామాన్య ప్రజానీకాన్ని కూడా ఎంతో ఆందోళనకు గురిచేస్తోంది. సముద్రతీరం కోతకు గురై మట్టంలో వచ్చే తేడావల్ల క్రమంగా కొన్ని తీరాలే కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇలా మునిగిపోయిన మూడు సముద్ర తీర ప్రాంతాలు ఒరిస్సా, విశాఖపట్నం తీరాల మధ్య ఉన్నట్టుగా గుర్తించారు. విశాఖపట్నం వద్ద తీరం గతంలో కంటే 25 కిలోమీటర్లు కోల్పోయిందని అంటున్నారు. ఎకోసౌండర్, సిస్మిక్ పరికరాలతో చేట్టిన సర్వేలో వారు ఈ సంగతి గుర్తించారు. ఈ తీరాల వెంట కొన్ని నదీపాయలు కూడా ఉన్నట్టు వారి పరిశోధనలలో తేలింది. అంటే నదులు కూడా సాగరగర్భంలో అంతరించిపోతున్నాయని గ్రహించాలి.

Friday, February 1, 2013

మోటార్ వాహనాల్లో ఇంజన్ ఆయిల్ ఎందుకు వాడతారు?

ఏదైనా ఒక వస్తువుని మరొక వస్తువుపై ఉంచి లాగినా, పక్కకు నెట్టినా ఒక దానితో మరొక దాన్ని రుద్దినా ఆ రెండు వస్తువులు ఒకదానికొకటి తాకుతూ వాటి ఉపరితలాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఘర్షణబలం ఎప్పుడూ వస్తువు గమనాన్ని వ్యతిరేకిస్తుంటుంది. అందువల్ల మోటార్ వాహనాల్లో లేదా సైకిల్ చక్రం ఇరుసు వద్ద బేరింగ్స్ వాడతారు. దీనికి కారణం వాటిలోని లోహపు గుండ్లు దొర్లటంవల్ల ఘర్షణ వీలైనంత తగ్గడమే.

కదిలే చక్రాల్లో లేదా ఇంజన్‌లో, పిస్టన్ వద్ద చలనంలో ఉన్న రెండు తలాల మధ్య రాపిడి వల్ల ఘర్షణ పుట్టి ఇంజన్ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి యంత్రాల కదిలే భాగాల్లో, వాహనాల ఇంజన్‌లలో, చక్రాల్లో కందెనగా గ్రీజ్, ఆముదం వంటి నూనెలను వాడతారు. పిస్టన్ కదులుతున్నప్పుడు ఆ కందెన సన్నని పొరగా ఏర్పడి ఘర్షణని తగ్గిస్తుంది. దాంతో ఇంజన్ సామర్థ్యం పెరిగి ఎక్కువకాలం పనిచేయగలదు.

Tuesday, January 29, 2013

వర్షపు నీరు బిందువులుగానే పడుతుంది ఎందుకు?

ఆకాశంలో మేఘాలు వ్యాకోచించటం వల్ల వాతావరణం చల్లబడుతుంది. మేఘాలలోని నీటి ఆవిరి ద్రవీకరణ చెంది చిన్న చిన్న బిందువులుగా మారుతుంది. దాన్నే మనం వర్షం అంటాం. అయితే వ్యాకోచం చెందే మేఘాలు సెకనుకు 1నుంచి 10 మీటర్ల వేగంతో పైకి పోతూ ఉంటాయి. ఇలా పైకి పోయే మేఘాలతోపాటు చిన్న చిన్న బిందువులు కూడా పైకి వెళ్తున్నప్పుడు వాటికి మరికొన్ని నీటి బిందువులు తోడయి పెద్ద బిందువుగా మారుతుంది.

ఇలా బరువెక్కిన నీటి బిందువు పైకి వెళ్లలేక భూమ్యాకర్షణ శక్తి కారణంగా కిందికి పడుతుంది. అంతేకాక స్వల్ప పరిమాణంలోని నీటి బిందువు గోళాకార రూపాన్ని పొందుతుంది. గాలిలోని నీటి ఆవిరి నీటి బిందువుగా మారే ప్రక్రియ నెమ్మదిగా జరిగేది కాబట్టి వర్షం బిందువులుగానే పడుతుంది. అయితే అల్ప పీడనం ఏర్పడినప్పుడు ఎక్కువ మొత్తంలో ఎక్కువ నీటి ఆవిరి ద్రవీకరణ చెందడం వలన నీటి బిందువులు ఒక దాని వెంట మరొకటి పడుతూ వర్షం ధారలాగా కన్పిస్తుంది. దీనినే మనం కుండ పోత వర్షం అంటాం.

అత్యంత బద్దకంగా ఉండే జంతువు ఏది?

మనుషుల్లో బద్దకస్తులు ఉంటారని తెలుసు. కానీ జంతువుల్లో కూడా బద్దకంగా ఉండే జంతువులు ఉన్నాయట. స్లోత్స్ అనే జంతువులు రోజుకి దాదాపు 23 గంటలు నిద్ర పోతాయి. అందుకే వీటిని అత్యంత బద్దకం ఉన్న జంతువులుగా పరిగణిస్తున్నారు. స్లోత్స్ అనే ఈ క్షీరదాలు ఎక్కువగా చెట్లపై నివసిస్తాయి. ఇవి మధ్య, దక్షిణ అమెరికాలో ఉంటాయి. చిన్న కుక్క పిల్ల సైజులో ఉండే స్లోత్స్ జీవితకాలం దాదాపు 30 సంవత్సరాలు.

స్లోత్స్ రాత్రిపూట చురుకుగా ఉంటాయి. స్లోత్స్ చెట్ల మీదే నిద్రపోతాయి. నిద్రపోయేటప్పుడు రెండు కాళ్లను దగ్గరగా చేసి చేతుల మీద తలను పెట్టుకుంటాయి. ఇవి చూడడానికి చెట్టులో భాగంగానే కన్పిస్తాయి. ఇవి సాధారణంగా చెట్టు మీద నుంచి దిగవు. ఎప్పుడైనా చెట్టు మీద నుంచి కిందికి దిగితే కాళ్లు ఉన్నా నడవకుండా పాకుతూ ఉంటాయి. వరదలు వచ్చిన సందర్భాల్లో ఈత కొడతాయి. వీటికి జీర్ణాశయం పెద్దది. అయినప్పటికీ జీర్ణక్రియ చాలా మందకొడిగా జరుగుతుంది. ఒక్కొక్కసారి జీర్ణక్రియ పూర్తి కావటానికి నెల రోజులు కూడా పడుతుంది. అందుకే ఇవి ఎక్కువ సమయం నిద్రపోతుంటాయి.

చీమంత బరువును మోయగలమా?

చీమలను ఐకమత్యానికి గుర్తుగా పేర్కొంటాం. క్రమశిక్షణలో కూడా వాటికి ప్రత్యేకత ఉంది. ఒకే పుట్టలో చాలా చీమలు కలిసి ఉండటమే కాదు, విపత్కర పరిస్థితిలో అన్ని చీమలూ కలిసి పోరాడతాయి. వీటి శరీర నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

చీమలు పది కోట్ల సంవత్సరాల క్రితం కందిరీగల నుంచి విడిపోయి ఒక ప్రత్యేక జీవులుగా రూపాంతరం చెందాయి. సుమారు 22 వేల రకాలు చీమలు ఉన్నాయని అంటారు. చీమలకు మానవుని శరీరంలో లాగా ఊపిరితిత్తులు, గుండె ఉండవు, వీటికుండే రక్తానికి కూడా రంగు ఉండదు. వీటి శరీరం పైకవచానికి ఉండే సన్నటి రంధ్రాల ద్వారా చీమలు ఊపిరి పీల్చుకుంటాయి. వీటికి బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా వాటి తలలో చిన్నచిన్న కళ్లు అనేకం ఉంటాయట.

చీమలు ఆహారసేకరణలో ముందుచూపుతో ఉంటాయని కూడా మనకు తెలిసిందే. అయితే ఈ చీమలు వాటి బరువు కంటే ఇరవై రెట్లు బరువును మోయగలవు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇది నిజం. కొన్ని రకాల చీమలైతే వాటి బరువు కంటే 25 నుంచి 50 రెట్ల బరువును కూడా లాక్కొని వెళ్లగలవట.

చీమలతో పోలిస్తే మనం అవి మోసినంత బరువులో పదోవంతు కూడా మోయలేమేమో! పెద్ద పెద్ద వస్తాదులు, వెయిట్‌లిఫ్టర్లు కూడా మహా అయితే వారి బరువుకన్నా నాలుగైదు రెట్లు బరువును మాత్రమే మోస్తారు! దీనినిబట్టి మనం చీమ మోసిన స్థాయిలో బరువును మోయలేమని రుజువైనట్లే కదా!

చంద్రుడు చల్లగా ఎందుకు ఉంటాడు?

పౌర్ణమిరోజు ఆకాశంలో కనిపించే వెన్నెల, చంద్రుని చల్లదనం గురించి చెప్పాలంటే కవులు చెప్పాల్సిందే. ఆ చల్లదనాన్ని మన మాటల్లో చెప్పలేం. అంత హాయిగా ఉండే పౌర్ణమి చంద్రుడి చల్లదనం గురించి శాస్త్ర విజ్ఞానం ఏం చెబుతుందో చూద్దాం. భూమికి లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడికి స్వయంప్రకాశక శక్తి లేదు. తన మీద పడిన సూర్యకాంతిని శోషించుకున్న చంద్రుడు మిగిలిన కాంతినే పరావర్తనం చెందిస్తాడు. ఆ కాంతిలో ఉండే వేడిశక్తిని కూడా భూమి

వాతావరణంలోని గాలి అణువులు పంచుకుంటాయి. కాబట్టి అంత వేడి అనిపించదు. అందుకే చంద్రుడి కాంతి నుంచి వచ్చే వెన్నెల అంత చల్లగా ఉంటుంది. కాంతిని గ్రహించిన పస్తువులలోని పరమాణువుల చలనాలకు సంబంధించిన యాంత్రికశక్తిని వేడి అంటారు. ఆ వేడి వస్తువుపై పడిన కాంతి తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. సూర్యకాంతి ఉత్పత్తి స్థానంలోనే అధికమైన శక్తితో విడుదల అవుతుంది. అందుకే సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న భూమిపై కూడా వేడి పుట్టిస్తున్నాడు.

Monday, January 28, 2013

చేపలు ఎలా నిద్రపోతాయి?

చేపలు మనలా కదలకుండా కళ్లు మూసు కుని విశ్రాంతి తీసు కోవు. చేపల కు కనురెప్పలు ఉండవు. చేపల శరీర కదలికలు తక్కువగా ఉండి విశ్రాంతి తీసుకునే స్థితి కనపడుతుంది. చేపలకు సంబంధించి ఇదే నిద్ర అనుకోవాలి. విశ్రాంతి దశలో చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోవు.

అక్వేరియంలో ఉండే చేపలు విశ్రాంతి తీసుకునేటపుడు ఆహారం వేస్తే చాలా ఆలస్యంగా స్పందిస్తాయి. కొన్నిరకాల చేపలు రాత్రులు విశ్రాంతి తీసుకుని పగలు చురుగ్గా ఉంటే, మరికొన్ని పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి చురుగ్గా ఉంటాయి. కొన్నిరకాల షార్క్‌లు నిద్రలో కూడా ఈత కొడతాయి. కార్ప్ చేపలు బురదలో నిద్రపోతాయి. ఆఫ్రికన్ లాంగ్‌ఫిష్ శ్వాస తీసుకోవడానికి చిన్నరంధ్రం ఉంచుకుంది.

కారం తింటే ముక్కు నుంచి నీరెందుకు వస్తుంది?

వంటలో కాస్తంత కారం ఎక్కువైనా నోరు మండడంతోబాటు ముక్కులోంచి నీళ్లు వస్తాయి. కారం లేదా ఇతర మసాలా దినుసుల్లో ఉండే కాప్సైసిస్ అనే రసాయనం దీనికి కారణం. మెదడు నాడీ వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. అందువల్ల ముక్కులోంచి నీరు వస్తుంది.

మనం మంచినీరు తాగినా మంట తగగకపోవడానికి కారణం ఈ రసాయనం నీటిలో కరగకపోవటమే. ఈ లక్షణం మిరియాల్లో కూడా ఉంటుంది. జలుబు చేసినపుడు చాలా ఇళ్లల్లో మిరియాలు వాడడం చూస్తూనే ఉంటాం. దీని ప్రభావంతో ముక్కులో గడ్డకట్టిన చీమిడి లాంటి పదార్థం కరిగి నీరుగా కారిపోతుంది.

కప్పలు నీళ్లు తాగుతాయా?

కప్పలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయన్నది తెలిసిందే. అందువల్ల అవి నీళ్లు ఎక్కువ తాగుతాయని అనుకుంటూంటాం. నిజానికి కప్పలు మనుషుల్లా నీళ్లు తాగవు. కానీ అవసరమయిన నీటిని శరీరం ద్వారా శోషించుకుంటాయి. అలాగే చర్మం ద్వారా కావలసిన ఆక్సిజన్‌ను శోషించుకుంటాయి.

అయితే పెద్దకప్పల్లో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కప్పపిల్లలు మొప్పల ద్వారా శ్వాస పీల్చుకుంటాయి. కప్పలు ఎక్కువుంటే వర్షాలు పడతాయన్న భావన చాలా దేశాల్లో ఉంది. వర్షాలకోసం కప్పల పెళ్లిళ్లు కూడా చేస్తుంటారు!

మోటార్ వాహనాల్లో ఇంజన్ ఆయిల్ ఎందుకు వాడతారు?

ఏదైనా ఒక వస్తువుని మరొక వస్తువుపై ఉంచి లాగినా, పక్కకు నెట్టినా ఒక దానితో మరొక దాన్ని రుద్దినా ఆ రెండు వస్తువులు ఒకదానికొకటి తాకుతూ వాటి ఉపరితలాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఘర్షణబలం ఎప్పుడూ వస్తువు గమనాన్ని వ్యతిరేకిస్తుంటుంది. అందువల్ల మోటార్ వాహనాల్లో లేదా సైకిల్ చక్రం ఇరుసు వద్ద బేరింగ్స్ వాడతారు. దీనికి కారణం వాటిలోని లోహపు గుండ్లు దొర్లటంవల్ల ఘర్షణ వీలైనంత తగ్గడమే.

కదిలే చక్రాల్లో లేదా ఇంజన్‌లో, పిస్టన్ వద్ద చలనంలో ఉన్న రెండు తలాల మధ్య రాపిడి వల్ల ఘర్షణ పుట్టి ఇంజన్ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి యంత్రాల కదిలే భాగాల్లో, వాహనాల ఇంజన్‌లలో, చక్రాల్లో కందెనగా గ్రీజ్, ఆముదం వంటి నూనెలను వాడతారు. పిస్టన్ కదులుతున్నప్పుడు ఆ కందెన సన్నని పొరగా ఏర్పడి ఘర్షణని తగ్గిస్తుంది. దాంతో ఇంజన్ సామర్థ్యం పెరిగి ఎక్కువకాలం పనిచేయగలదు.