Showing posts with label Did U Know?. Show all posts
Showing posts with label Did U Know?. Show all posts

Saturday, May 18, 2013

చిన్నజీవులకు దెబ్బలు తగలవా?

ఆకారంలో చిన్నగా ఉండే జీవుల తాలూకు శరీర ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికారణంగా భూమి యెక్క గురుత్వాకర్షణశక్తి వాటిపై చూపించే ప్రభావంకన్నా గాలిలాంటివి వాటి ఉపరితలంపై చూపించే ప్రభావం సాపేక్షికంగా కొంచెం ఎక్కువగా వుంటుంది. దాంతో ఏదైనా ఒక ఎత్తై ప్రదేశం నుండి కిందకు పడిపోయినప్పుడు పెద్ద జీవులకన్నా చిన్నజీవులకు తక్కువ దెబ్బలు తగులుతాయి.

పడే విధానాన్ని బట్టి, ఎత్తుని బట్టి ఒక్కోసారి ఎలాంటి దెబ్బలూ తగలకపోవచ్చు. అంతేగాని అసలు మొత్తానికే దెబ్బలు తగలవు అనుకోవడం సరైనది కాదు. చిన్నజీవుల శరీరం తాలూకు బరువు, ఘనపరిమాణం తక్కువగానూ, అదే సమయంలో వాటి ఉపరితల వైశాల్యం ఎక్కువగాను ఉండే కారణంగా అలాంటి జీవులు పైనుంచి కిందికి పడుతున్నప్పుడు కేవలం పడిపోతున్నట్లుగా కాక ఎగురుతున్నట్లు లేదా ఎగరడానికి ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తాయి.

ఒక్కోసారి జోరుగా వీచే గాలికి అవి గాలితోపాటు కొంత దూరం కొట్టుకొనిపోతాయి కూడా! వివిధరకాల కీటకాలు, పురుగులకే గాక ఆకులు, విత్తనాలు, కాగితం ముక్కలు వంటి వాటికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏదేమైనా పైనుంచి కిందికి పడిపోయేటప్పుడు మామూలు దెబ్బలు గాని, తీవ్రమైన దెబ్బలు గాని తగిలే అవకాశం పెద్దజీవులకే ఎక్కువ!

కాకులు సంఘజీవులు

కాకులు సంఘజీవులు ప్రపంచంలోని పక్షులన్నింటిలోకి కాకులు చాలా తెలివైనవి శాస్తజ్ఞులు చెబుతున్నారు. అడ్డమైనవీ తింటాయని కాకుల్ని కొందరు అసహ్యించుకున్నా, మరికొందరు వాటిని అపశకునంగా భావించినా కాకుల వల్ల పంటపొలాలకు, పర్యావరణానికీ చాలా మేలు జరుగుతుంది. పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తినడం ద్వారా అవి రైతులకు మేలు చేస్తే, ఊళ్ళలోని చెత్తాచెదారంలోని పురుగుల్ని, పదార్థాల్ని తినడం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు తోడ్పడుతున్నాయి.

కాకులు సంఘజీవులు. అవి కేవలం తమ కుటుంబానికి చెందిన కాకులకేగాక, అవసరమైనప్పుడు ఇతర కుటుంబాలకు చెందిన కాకులకూ సాయం చేస్తాయి. గుంపులుగా జీవించే అనేక ఇతర పక్షుల్లోనూ, పిల్లులు, కుక్కలు వంటి జంతువుల్లో కూడా ఈ తరహా ప్రవర్తన మనకు కనిపించదు.

కాకులు తెలివిగా, సంతోషంగా జీవించడమే కాదు, అవసరమైనప్పుడు కట్టెపుల్లల్ని తమకు కావలసిన రీతిలో మలచుకొని వాటిని ‘సాధనాలుగా’ ఉపయోగిస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. నిజంగానే, కాకులు చాలా తెలివైనవి కదా! అంతేకాదు, వాటికి జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువేనట.

నిమ్మరసం తాగితే జలుబు చేయదా?

మనదేశంతో సహా చాలా దేశాల్లో బాగా ప్రచారంలో ఉన్న నమ్మకాల్లో ‘నిమ్మరసం తాగితే జలుబు చేస్తుంది’ అన్నది కూడా ఒకటి. వానలో తడిస్తే లేదా తడి జుత్తుతో బయట తిరిగితే లేదా ఐస్‌క్రీమ్‌లు తింటే జలుబు చేస్తుంది... అనేవి ఎలా ప్రచారంలోకి వచ్చాయో ఇది కూడా అలాగే ప్రచారంలోకి వచ్చింది. ఇక అసలు విషయంలోకి వస్తే...సాధారణంగా కొన్నిరకాల వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశించి మనపై తమ ప్రతాపాన్ని చూపించినప్పుడు మనకు జలుబు చేస్తుంది.

అందుకని నిమ్మరసం తాగడం వల్ల జలుబు చేస్తుంది అన్నది సరైనది కాదు. అంతేకాదు, జలుబు చేసినవాళ్ళు నిమ్మరసం తాగకూడదు అన్నది కూడా సరైనది కాదు. ఎందుకంటే నిమ్మరసం తాగడం వలన జలుబు రాదు సరికదా, వచ్చిన జలుబు తగ్గుముఖం పడుతుంది.

నిమ్మరసంలో ‘విటమిన్-సి’ అనేది పుష్కలంగా ఉంటుందన్న సంగతి మీకు తెలుసు కదా! అది మన శరీరపు రోగనిరోధకశక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే నిమ్మరసం తీసుకోవడం వలన జలుబు వైరస్‌లతో పోరాడే శక్తి మన శరీరానికి మరింతగా పెరుగుతుందన్నమాట.

అరటి, ఆపిల్స్, బత్తాయిలు వంటి పళ్ళతో సహా అన్నిరకాల పళ్ళను పుష్కలంగా తినమని డాక్టర్లు మరీమరీ చెప్పేది ఎందుకో తెలుసా? అవి మనకు మంచి పోషకాలను అందించడమేగాక మన వ్యాధినిరోధకశక్తి (వ్యాధులతో పోరాడి వాటిని అడ్డుకునే శక్తి)ని పెంచుతాయి.
అందుకని కేవలం నిమ్మపళ్ళ విషయంలోనేగాక ఏ పళ్ళ విషయంలోనూ అనవసరమైన ఆలోచనలను పెట్టుకోకండి.

Friday, April 12, 2013

సబ్బునీటి బుడగలు ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలి?

సన్నని గొట్టంతో గాల్లోకి మనం ఊదే సబ్బు నీటి బుడగలు పెద్దగా ఉండాలన్నా, అవి ఎక్కవ సేపు పగలకుండా ఉండాలన్నా అందుకు మనం కొన్ని చిట్కాలు పాటించాల్సి వుంటుంది.
ముందుగా సబ్బుని కలిపేందుకు మనం శుద్ధమైన నీటిని వాడాల్సి వుంటుంది. ఇందుకై ఓ ఐసుగడ్డని కరిగించగా వచ్చే నీటినిగాని, మెడికల్ షాపుల్లో దొరికే డిస్టిల్డ్ వాటర్‌నిగాని వాడితే మరీ మంచిది.

ఈ నీటిలో కొన్ని సబ్బు ముక్కల్ని గాని లేదా సర్ఫునిగాని వేసి బాగా కలియబెట్టండి. సబ్బు ముక్కలు కరిగి చిక్కని ద్రావకం తయారయ్యాక అందులో కొన్ని గ్లిసరిన్ చుక్కలను వేసి కలపండి. (ఇది కూడా మొడికల్ షాపుల్లో దొరుకుతుంది) అంతే! ఇప్పుడీ ద్రావకంలో సన్నని గొట్టాన్ని ముంచి తీసి, దీంట్లోకి గాలిని ఊదితే చక్కని బుడగలేకాక ఎక్కువసేపు పగలకుండా వుండే బుడగలు గాల్లో తేలుతూ కన్పిస్తాయి!

సూక్ష్మజీవులు... మహాగట్టివి!

ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఇప్పటికీ రకరకాల వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి. దీనికి కారణం పలురకాల వ్యాధులకు కారణమ య్యే సూక్ష్మజీవులు... మనం వాడే మందులకు అలవాటుపడి మొండిగా తయారయ్యాయి! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా.. మలేరియా వంటి వ్యాధులు బాగా ప్రబలడానికి గత కొన్ని దశాబ్దాలుగా మానవసమాజం వివిధ మందులను దుర్వినియోగం చేయడమేనని నిపుణులు అంటున్నారు.

అవసరం లేకున్నా మందులను వాడటం, అవసరాన్ని మించి మందులను వాడటం, వాడాల్సిన పద్ధతిలో వాడాల్సినన్ని రోజులు వాడకపోవడంతో పాటు కల్తీమందులు లేదా నాసిరకం మందులు కూడా వివిధ సూక్ష్మజీవులు తిరిగి శక్తి పుంజుకోవడానికి కారణమవుతున్నాయి.

ప్రస్తుతం టీబీ వల్ల ప్రపంచంలో ఏటా 20 లక్షలమంది చనిపోతున్నారు. ప్రతి ఏటా కొత్తగా 30 నుంచి 50 కోట్ల మందికి కొత్తగా మలేరియా వస్తోంది. ఈ వ్యాధికి గురైనవారిలో ఏడాదికి 27లక్షలమంది చనిపోతున్నారు. ఇక ఫ్లూ జ్వరం వంటివ్యాధుల బారిన పడే వారి సంఖ్య లెక్కలేదు. ఇలాంటి వాటన్నింటికీ వ్యాధికారక సూక్ష్మజీవుల మందులను వాడే విషయంలో మనందరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Monday, December 24, 2012

టెర్మినేటర్ విత్తనాలంటే..?

కాయలు కాసే లేదా కంకులు వేసే ప్రతి చెట్టు నుంచి అనేక గింజలు ఉత్పత్తి అవుతుండటం, వాటిలో దాదాపు అన్నీ తిరిగి అలాంటి మొక్కగా పుట్టగలిగే శక్తిసామర్థ్యాలను కలిగి ఉండటం సహజం. అయితే ఒక చెట్టు నుంచి పుష్కలంగా గింజలు వచ్చినా అందులో ఒక్కటి కూడా తిరిగి మొక్కగా పుట్టడానికి పనికిరాకపోతే ఏమవుతుంది?

అంతకు ముందు ఆ గింజల్ని అమ్మిన కంపెనీ నుంచే వాటి విత్తనాలను మళ్ల్లీ కొనాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని కల్పించేవే టెర్మినేటర్ విత్తనాలు. ఇవి కొన్ని కంపెనీల ఆధ్వర్యంలో కొందరు శాస్త్రజ్ఞులు ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాలు. వీటిని మన పొలంలో వేసుకుంటే పంట దిగుబడి అధికం కావచ్చు.

ఆయా కంపెనీలవారు చె బుతున్నట్టు ఈ మొక్కలు పీడలను సమర్థంగా తట్టుకోవచ్చు. కానీ రెండోసారి వేయాలంటే మాత్రం మళ్లీ ఆ కంపెనీవే వేయాలి. మనకంటూ ఎలాంటి విత్తనాలూ లేకపోవడం వల్ల కొంతకాలానికి వ్యవసాయం కోసం ఆయా కంపెనీల మీదే తప్పక ఆధారపడాల్సివస్తుంది. అందుకే టెర్మినేటర్ విత్తనాల పట్ల రైతాంగం ఆసక్తి చూపట్లేదు.

జంతువులు నక్షత్రాలను అనుసరిస్తాయా?

ప్రాచీన కాలం నుంచి నక్షత్రాలను అనుసరించి ప్రయాణించడమనేది ఉంది. ముఖ్యంగా నావికులు కొన్ని శతాబ్దాలపాటు నక్షత్రాలను అనుసరించే ప్రయాణించేవారు.


అయితే ఈ నైపుణ్యం కేవలం మనుషులకే కాకుండా, జంతువులకు కూడా ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. సీల్... రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను అనుసరించే సముద్రంలోకి వెళుతుందని జర్మనీ రొస్టాక్ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా మగ సీల్ ఆకాశంలో ప్రస్ఫుటంగా కనిపించే నక్షత్రాలను చూస్తూ తాను చేరవలసిన ప్రాంతానికి వెళ్లగలుగుతుందని తేలింది.

మెదడు చురుగ్గా ఉండాలంటే...

మన శరీరంలో పనిచేసే కొద్దీ చురుగ్గా ఉండేది మెదడే. శరీరంలో జరిగే వివిధ పనులను నిరంతరం నియంత్రించే మన మెదడుకి ఆఖరికి మనం నిద్రపోయేటపుడు కూడా కొన్ని పనులు చేస్తూనే ఉంటుంది. అందుకే మన శరీరంలోని రక్తంలో 20 శాతాన్ని, ఆక్సిజన్‌లో 20 శాతాన్ని ఒక్క మెదడే ఉపయోగించుకుంటుంది.


మన మెదడులో 20వేల కోట్ల నాడీకణాలతోసహా మొత్తం లక్ష మైళ్ల పొడవుండే రక్తనాళాలుంటాయి. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంతో సహా అనేక ముఖ్యమైన పనులను చేసే మెదడు నిరంతరం చురుగ్గా ఉండాలి.


అందుకు మనం బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ తగినంత పనిచేయాలి. సరైన వ్యాయామం చేయాలి. తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. వివిధ రకాల పజిల్స్ పరిష్కరించడం, కొత్తవిద్యలు నేర్చకోవడం, ఆలోచించడం, రాయడం వంటివన్నీ మెదడును ఉత్తేజపరిచి చురుగ్గా ఉంచుతాయి.

సింథటిక్ వస్త్రాలతో చిక్కులా?

మనం ఉపయోగించే వస్త్రాల్లో సింథటిక్ వస్త్రాలూ ఉన్నాయి. అంటే పట్టు, ఉన్ని దారాలతో నేసినవి కాకుండా కృత్రిమ దారాలతో చేసినవన్నమాట. ఉదాహరణకి పాలియెస్టర్, టెరీన్, నైలాన్ వంటి వస్త్రాలు. అయితే ఈ వస్త్రాలకి కూడా సహజవస్త్రాల లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆయా రసాయనాలను బట్టి, వాటిని తయారుచేసే విధానాన్ని బట్టి సింథటిక్ వస్త్రాలు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి.


పాలియెస్టర్ వస్త్రాలను ఎంత వాడినప్పటికీ అవి నలగవు. వాటిలో ఆ శక్తి ఉంటుంది. బాగుంటున్నాయని నైలాన్, టెరికాట్, పాలియెస్టర్ వస్త్రాలు వాడుతున్నాం గానీ నిజానికి అవి అంత మంచిది కాదు. ప్లాస్టిక్‌లానే పాలియెస్టర్ కూడా ప్రకృతిలో కలిసిపోదు. పైగా మన శరీరానికిగాని, చర్మానికి గాని అంత సురక్షితం కాదు. వీటిని అతిగా వాడితే చర్మసమస్యలతోపాటు, ఇతర ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి.

వెంట్రుకలు నల్లగా ఎందుకుంటాయి?

ప్రాంతం, వాతావరణ పరిస్థితులను అనుసరించి మానవుల వెంట్రుకల రంగులో తేడాలుంటాయి. ఉష్ణ ప్రాంతాల్లో నివసించేవారి వెంట్రుకలు సాధారణంగా నల్లగానే ఉంటాయి. ఇది ఒక విధంగా వరం. నల్లని రంగు వేడిమిని చక్కగా గ్రహించడమే గాక సులభంగా వదిలిపెడతాయి కూడ.


ఈ ఏర్పాటు ఉష్ణప్రాంతాల్లో నివ సించేవారికే వీలుంటుంది. ఇక వెంట్రుకలు నల్లగా ఉండడానికి కారణం మెలనిన్ అనే పదార్థం. అది లోపిస్తే మాత్రం నల్లరంగు పోతూంటుంది. వెంట్రుకలు వృద్ధాప్యం కారణంగానే తెల్లబడతాయని లేదు. చిన్నవయసులోనే తీవ్రమానసిక ఒత్తిళ్లు, ఆందోళనకు గురయ్యేవారి తలవెంట్రుకలు తెల్లబడటం గమనించవచ్చు. అంతేగాకుండా శరీరతత్వం, జీవనశైలి కూడా అందుకు కొంత కారణమవుతాయి.

పడకగదిలో టీవీ ఉండకూడదా?!

మనం విశ్రాంతి తీసుకునే ప్రదేశం పడకగది. రాత్రివేళల్లో ప్రశాంతతకు భంగం కలిగించే శబ్దాలు ఉండకూడదు. మనం నిద్రించే గదిలో టీవీలు, సెల్‌ఫోన్‌లు, డీవీడీ ప్లేయర్లు, కంప్యూటర్లు, ఫ్రిజ్ వంటివి ఉండటం మంచిది కాదు. వాటినుంచి విడుదలయ్యే తరంగాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


తప్పనిసరి అనుకుంటే వాటిని గదిలోనే వీలైనంత దూరంలో పెట్టుకోండి. టీవీమాత్రం వద్దు. టీవీని అతిగా చూసే వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు దెబ్బతినడం ఖాయం. నిర్లక్ష్యం, విసుగు, త్వరగా కోపగించుకోవడం వంటి లక్షణాలు వస్తున్నాయని పరిశీలనలో తేలింది. ఇది పిల్లల్లో, యువతలో మరీ ఎక్కువైందట! తిండి ధ్యాస తగ్గడం, శరీరానికి వ్యాయామం లేకపోవడంతో చురుకుదనం తగ్గిపోతుంది. తస్మాత్ జాగ్రత్త!

ఫ్లోరైడ్ ఉన్న నీరు ప్రమాదమా!

మనం తాగే నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. కలుషిత నీరు ఎంతో ప్రమాదకరం. అందునా ఫ్లోరైడ్, ఇతర లవణాలు అధికశాతంలో ఉన్న నీరు మరీ ప్రమాదకరం. ఇది నేరుగా మన శరీర వ్యవస్థనే దెబ్బతీస్తుంది.


నీటిలో ఫ్లోరైడ్ శాతం 1.5 మి.గ్రా. కంటే ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. మెడ వంగిపోవడం, కాళ్లు, చేతులు వంకరలు తిరగడం, ఎముకలు పెళుసుగా తయారై విరిగిపోవడం వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. దురదృష్టమేమంటే ఈ నీటిని చాలాకాలం నుంచీ తాగుతున్నప్పటికీ దాని ప్రభావం తొలిదశలో ఏమీ తెలియదు. కనీసం 12 సంవత్సరాల నుంచి బయటపడుతూ ఉంటుంది. పంటిమీద పచ్చగా గార ఏర్పడుతుంది. దీని ద్వారా ఫ్లోరైడ్ సోకిందని చెప్పవచ్చు.

డాల్ఫిన్లు వాసన చూడగలవా?

సముద్రజలాల్లో నివసించే డాల్ఫిన్లు ‘సెటాషియన్స్’ అనే క్షీరదాల జాతికి చెందినవి. భూగోళం మీది అతిశీతల ప్రాంతాల్లో వుండే చల్లని సముద్రజలాలు మొదలుకొని ఉష్ణమండల ప్రాంతంలో వుండే వెచ్చని జలాల దాకా అన్నిరకాల సముద్రజలాల్లోను మనకు డాల్ఫిన్లు కల్పిస్తాయి.డాల్ఫిన్లలో కిల్లర్‌వేర్, పైలట్, బాటిల్‌నోస్ డాల్ఫిన్ అని విభిన్న రకాలు ఉన్నాయి.

సముద్రజలాల్లో డాల్ఫిన్లు కొన్ని తెలుపునలుపు రంగుల్లో ఉంటే మరికొన్ని చిక్కని నలుపు రంగులో ఉంటాయి. సీసామూతి లాంటి ముక్కుతో వుండే డాల్ఫిన్లు మాత్రం బూడిదరంగులో వుంటాయి. డాల్ఫిన్లు ఆయా రకాలనుబట్టి 8 అడుగుల నుంచి 20 అడుగుల పొడవు దాకా ఉంటాయి. ఇవి సాధారణంగా రోజుకి 3 నుంచి 7 మైళ్లు వరకూ ఈదుతాయి.

ఒకప్పుడు రోజుకి 21 గంటలే ఉండేవా?

భూమి తన చట్టూ తాను గంటకు వెయ్యి మైళ్ళ వేగంతో, సూర్యుని చుట్టూ గంటకు 67 వేల మైళ్ల వేగంతోనూ తిరుగుతోంది. అయితే ఈ రెండు వేగాలూ భూమి పుట్టినప్పటి నుంచీ ఇలానే లేవు. భూగోళం పుట్టి ఇప్పటికి సుమారు 456 కోట్ల సంవత్సరాలు అయిందని శాస్త్రవేత్తల అంచనా.  అయితే ఇప్పటికి సుమారు 53 కోట్ల ఏళ్ల కిందట భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు కేవలం 21గంటల సమయాన్ని మాత్రమే తీసుకునేదని, సూర్యుని చుట్టూ తిరిగేందుకు రమారమి 420 రోజుల సమయాన్ని తీసుకునేదని శాస్త్రవేత్తలు లెక్కించారు. అంతేకాదు ఇప్పటికి మరో 50 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు 27 గంటల సమయాన్ని, సూర్యుని చుట్టూ తిరిగేందుకు కేవలం 300 రోజుల సమయాన్ని తీసుకుంటుందని కూడా శాస్త్రవేత్తల అంచనా.

ఏయే విద్యుత్ ఉత్పాదనల్లో ఎలాంటి కాలుష్యాలు..?

థర్మల్ విద్యుత్, అణువిద్యుత్తు వంటి సాంప్రదాయక విద్యుత్ ఉత్పాదన ప్రక్రియల్లో విద్యుత్ ఉత్పత్తికై ఒకసారి వాడిన ఇంధనాన్ని మళ్ళీ వాడేందుకు కుదరదు. ఆ అవశేషాలు పర్యావరణానికి ముప్పు కలిగించేవిగా ఉంటాయి.


ఉదాహరణకు థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోనూ రోజుకి కొన్ని టన్నుల బొగ్గును మండిస్తుంటారు. దాని మూలంగా వాతావరణంలోకి పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. అంతేగాక బొగ్గును మండించిన తర్వాత బూడిద కొన్నిసార్లు వందల కిలోమీటర్ల దాకా వ్యాపిస్తుంది. అలాగే అణువిద్యుత్ వల్ల రేడియేషన్ తాలూకు దుష్ఫలితం ఉంటుంది. పైన పేర్కొన్న విద్యుత్ ఉత్పత్తి పద్ధతులకు భిన్నంగా సహజవనరులైన గాలి, ఎండ, అలలు వంటి వాటితో విద్యుదుత్పత్తి చేసినప్పుడు ఆ విద్యుత్తుకోసం వాడిన వాటినే మళ్ళీ మళ్ళీ వాడేందుకు వీలవుతుంది. అంతేగాక వాటి వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు.

అరటిపళ్లు పసుపుపచ్చగా ఎలా మారతాయి?

క్లోరోఫిల్ కారణంగా అనేక చెట్ల ఆకులు ఆకుపచ్చగా ఉన్నట్టుగానే అరటిపళ్ళు కాయల రూపంలో ఉన్నపుడు వాటి తొక్క ఆకుపచ్చగానే ఉంటుంది. ఇవి పండినపుడు వాటిలోని క్లోరోఫిల్ విచ్ఛిన్నమై పసుపురంగు కనపడటం మొదలవుతుంది. ఈ మార్పు సమయంలో అప్పటివరకూ ఉన్న పిండిపదార్థాలు చక్కెరగా మారతాయి.  పెక్టిన్ అనబడే పిండిపదార్థం విచ్ఛిన్నమై, పండు తాలూకు గుజ్జు మెత్తబడుతుంది. శిశిరరుతువులో చెట్ల ఆకులు పసుపురంగులోకి మారడానికి కూడా ఆయా ఆకుల్లోని క్లోరోఫిల్ విచ్ఛిన్నం కావడమే ప్రధానకారణం.