Showing posts with label Health Tips. Show all posts
Showing posts with label Health Tips. Show all posts

Sunday, February 10, 2013

క్యాన్సర్‌కు ఆయుర్వేద చికిత్స...

ఆయుర్వేదంలో ప్రాచీనవైద్యుడు చరకమహర్షి నిరూపించిన విషయం: శరీరంలోని ఏ అవయవానికైనా, ఏ భాగానికైనా మూలం కంటికి కనబడని సూక్ష్మాతిసూక్ష్మమైన, అసంఖ్యాకమైన పరమాణు సముదాయమే. (శరీరావయాస్తు పరమాణు భేదానం ఆపరిసంఖ్యేయా భవంతి, అతిబహుత్వాత్, అతి సౌక్ష్మాత్, అతీంద్రియ త్వాత్ చ). ఇలాంటి పరమాణువుల స్వభావ క్రియ భేదాల వల్ల సప్త ధాతువులైన... రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రాలు’, వాటి తో పాటు వివిధ స్రోతస్సులు ఉత్పత్తి కాబడ్డాయి.

క్యాన్సర్ అనే పదానికి అర్థం ‘ఎండ్రకాయ’ (కర్కాటకం). నిశ్శబ్దంగా దొలిచి దొలిచి ధ్వంసం చేయడానికి ఇది పెట్టింది పేరు. వ్యాధి స్వభావాన్ని బట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇలాంటి స్వభావం గల వ్యాధులు ఆయుర్వేదంలో చాలా వాటిని వర్ణించారు. ఈ వ్యాధి సోకిన ధాతువును బట్టి, స్రోతస్సును బట్టి, అవయవాన్ని బట్టి, భాగాన్ని బట్టి పేరు మారుతుంటుంది. పైన చెప్పిన వాటిలో దేనికి సంబంధించినవైనా కొన్ని అణువులు ‘నివారింపశక్యంకాకుండా, అవాంఛితంగా పరిమాణంలో పెరిగిపోతుండటమే’ ఈ వ్యాధిలో జరిగే ప్రక్రియ. అణువిభజనకు వాతం (న్యూక్లియస్ కర్మలు), పచింపబడటానికి పిత్తం (మైటోకాండ్రియా కర్మలు), పోషణకు కఫం (ప్రోటోప్లాజం కర్మలు) కారణంగా నిలుస్తాయి.

కొన్ని వ్యాధుల పేర్లు
తీవ్రస్థాయికి చేరిన అర్బుద, గ్రంథి, అపచి, గండమాల మొదలైనవి. అర్బుదాలు (కణుతులు), తాలువు, నాలుక, ముక్కు, చెవి, రొమ్ముల్లో కూడా పుడతాయని వాగ్భటాచార్యులు ప్రత్యేకంగా చెప్పారు. అదేవిధంగా ఉపద్రవస్థాయికి చేరిన రస మరియు రక్తవహస్రోతో దుష్టి లక్షణాలే ఈ నాటి బ్లడ్‌క్యాన్సర్లు.

వ్యాధికి కారణాలు
అసలు కారణం స్పష్టంగా తెలియదు. వాతపిత్తకఫాల ప్రాకృత కర్మలను చెడగొట్టే ఆహార విహారాలు, ధూమ, మద్యపానాలు, ఇతర మాదకద్రవ్యాలు, విపరీతమైన మానసిక ఒత్తిడి కారణాల్లో కొన్ని. ప్రస్తుతం సమాజంలో 90 శాతం ఆహారపదార్థాలు, పాలు, తినుబండారాలు, నూనెలు, పండ్లు సమస్తం కల్తీయే. ఇది కూడా ఈ ‘కర్కశకర్కాటకాని’కి కారణమే.

చికిత్స
వ్యాధి తీవ్రతను బట్టి ‘ప్రవర, మధ్యమ, అవర’ అని విభజించబడింది. ప్రవరావస్థలో ఫలితాలు బాగుంటాయి. ఆయుర్వేదం కేవలం రోగవ్యతిరేక చికిత్స మాత్రమే కాకుండా రోగికి బలవర్థకమైన ‘రసాయన’ చికిత్స, అవసరాన్ని బట్టి శోధన (పంచకర్మ) చికిత్స, శస్త్రచికిత్సతో పాటు రోగం సోకిన భాగాన్ని బట్టి ఎన్నో ఔషధాలను విశదీకరించింది.

కొన్ని ముఖ్య ఔషధాలు
ఏకద్రవ్యాలు:
భల్లాతకీ (నల్లజీడిగింజ)
అమృతా/గుడూచీ (తిప్పతీగె)
చిత్రక (చిత్రమూలం)
హరిద్రా (పసుపు)
అశ్వగంధ (పెన్నేరుగడ్డ) ప్రధానమైనవి.

ఇతర ఏకమూలికలలో: శిరీశ్రీ (దిరిసెన), సీతాఫల, తులసి, మారేడు, తమలపాకు, లశున (వెల్లుల్లి), నేల ఉసిరిక (భూమ్యామలకి), కటుకరోహిణి, బ్రాహ్మీ, శతావరీ (పిల్లిపీచర), అశోక, మంజిష్ఠ, దుగ్ధిక, త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసిరి), పాషాణభేది (కొండపిండి) మొదలైనవి చాలా చెప్పబడ్డాయి.

మిశ్రమ ఔషధాలు:
భల్లాతకీ లేహ్యం
అమృత భల్లాతకీ లేహ్యం
అగస్త్యరసాయనం
అశ్వగంధాది లేహ్యం
చిత్రకహరీతకీ రసాయనం
ఆమలకీ రసాయనం
గుడూచీసత్వం మొదలైనవి.

గమనిక: రోగి బలాన్ని, వ్యాధి సోకిక భాగాన్ని, అవయవాన్ని బట్టి ఏ ఔషధం, ఏ రూపంలో, ఎంతకాలం వాడాలో ఆయుర్వేద నిపుణులు నిర్ణయించి, పర్యవేక్షించాలేగాని, బైరాగి చిట్కాలు, సాధువుల వైద్యాలు క్యాన్సరును పోగొట్టలేవు. అలాంటి ప్రకటనలకు మోసపోవద్దు.

ఆయుర్వేద మార్గంలో నివారణ
బాల్యం నుంచి శాస్త్రబద్ధంగా కల్తీలు లేని, బలవర్ధకమైన సాత్వికాహార సేవన ఆవునెయ్యి, నువ్వుల నూనె రోజూ రెండేసి చెంచాలు సేవించాలి

పాలు, పెరుగు, వెన్నలు ఆవువైతేనే శ్రేష్ఠం. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి

పరిమిత వ్యాయామం, జీవితాంత ప్రక్రియగా భావించి, ప్రతిదినం చేయాలి

దూమ, మద్యపానాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి

రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రించి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి

మానసికారోగ్యం కాపాడుకోవడం ప్రధానం. కాబట్టి సంతోషం, శాంతం, ఉత్సాహం, కారుణ్యం వంటి లక్షణాలను అనుసరించాలి. (తనకోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష). వీటిని ఆయుర్వేదంలో ‘ఆచార రసాయనా’లంటారు

ఉసిరికాయరసం రోజూ రెండు చెంచాలు తాగాలి లేదా త్రిఫలా చూర్ణం రోజూ ఒక చెంచా తేనెతో

పది తులసి ఆకులు, ఐదు మారేడు ఆకులు నమిలి తినాలి

ఏదో ఒక తాజా ఫలం ప్రతిరోజూ తినాలి. 
Source : Sakshi

Monday, January 28, 2013

పొటాషియమ్ ప్రాధాన్యం తెలుసా...?

మనకు అవసరమైన లవణాల్లో ఒకటైన పొటాషియమ్ శరీరంలో లోపించిందనుకోండి... ఏం జరుగుతుందో తెలుసా? అసలు గుండె కొట్టుకోవడమే జరగదు. కండరం బిగుసుకోవడం జరగదు. అంటే... మనం దేన్నీ పట్టుకోవడం జరగదు. అంతెందుకు... అసలు కదలడమే సాధ్యం కాదు. ఒకవేళ పొటాషియమ్ తక్కువగా ఉంటే మీరు చదువుతున్న మ్యాటర్ అసలు అర్థం కాదు కూడా! ఎందుకంటే... మెదడులోని కణాలు పనిచేయడానికి కూడా పొటాషియమ్ కావాల్సిందే.

పైగా రక్తపోటును క్రమబద్ధీకరించే గుణం దీనికి ఉంది. మరి పోషకంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ లవణం కోసం తీసుకోవాల్సిన ఆహారాలేమిటో తెలుసా? మనకు అందుబాటులో ఉండేది అరటిపండు. ఒక అరటిపండులో 400 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. ఒక అవకాడోలో 500 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. కానీ ఇది అందరికీ అంతగా అందుబాటులో ఉండదు. ఇక పై రెండూ అందుబాటులో లేకపోతే పొటాషియమ్ కోసం బంగాళాదుంప (ఆలుగడ్డ) మీద ఆధారపడండి. ఒక పెద్ద ఆలుగడ్డలో 1600 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది.

ప్రో-బయాటిక్స్ మజ్జిగే మందుగా...

మజ్జిగే మందెలా అవుతుంది?

మన జీర్ణవ్యవస్థ పొడవునా అనేక కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి కొన్ని కొన్ని వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొంది స్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో-బయోటిక్’ అంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో-బయాటిక్స్‌ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీ పిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ చేసుకుంటాం. అలాగే దోసె పిండి కలుపుకుని కాస్తంత పులిసిపోయాకే అట్లు వేసుకుంటాం. ఎండన పడి వచ్చిన వారికి మజ్జిగ ఇస్తాం. ఇలా మనం మజ్జిగను తాగినప్పుడు కూడా మనకు మేలు చేసే అనేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుని, ఆరోగ్యాన్ని పెంచుకుంటాం. అంటే మజ్జిగరూపంలో మనం ఒకవైపు ఎండ దెబ్బ వల్ల వచ్చే డీ-హైడ్రేషన్‌ను నిరోధించుకుని, మరోవైపు పేగులకు మేలు చేసే సూక్ష్మజీవులనూ సమకూర్చుకుంటామన్నమాట. ఇలా మనం మన సంస్కృతి సంప్రదాయాల్లో ‘ప్రో-బయాటిక్స్’ను తీసుకునే అలవాటు ఎప్పట్నుంచో మనకు ఉంది. మనం మజ్జిగలా తీసుకునేదాన్నే ఇప్పుడు చాలామంది మందులా కూడా ఉపయోగిస్తున్నారు.

ఏయే జబ్బులకు...

పైన పేర్కొన్నట్లుగా రుక్మిణికి కలిగిన సమస్య చాలామందిలో కనిపిస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటారు. ఇదిగాక అల్సరేటివ్ కొలైటిస్ అనే వ్యాధిలోనూ, క్రోన్స్ డిసీజ్‌లోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తుంటాయి. అల్సరేటివ్ కొలైటిస్‌లో పెద్దపేగు, రెక్టమ్ (మలద్వారం పై భాగం) వాపు, నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేషన్)కు గురవుతాయి. ఇక క్రోన్స్ డిసీజ్ ఉన్నవారిలోనైతే జీర్ణవ్యవస్థ ఏ భాగంలోనైనా ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తుంది. ఈ రెండు వ్యాధులను కలిపి ‘ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్’గా వ్యవహరిస్తుంటారు.

ఎందుకొస్తాయి ఈ సమస్యలు...?

ఇరిటబుల్ బవెల్ డిసీజ్‌లు ఎందుకు వస్తాయన్న అంశంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా లేదు. కొంతమంది అయితే ఇవి మానసిక సమస్యల వల్ల కనిపించే శారీరక లక్షణాలని సిద్ధాంతీకరించారు. తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే వారికి ఈ జబ్బులు వస్తుండటం గమనించారు.

తగ్గడానికి ఏం చేయాలి...?

ఉదయం తినే టిఫిన్లలో పాశ్చాత్య తరహా ఆహారాలు కాకుండా మన సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె వంటివాటిని తీసుకోవాలి. తరచూ తాజా మజ్జిగ తాగుతూ ఉండాలి. కాస్తంత పులిశాక తాగితే అందులో సూక్ష్మజీవులు పెరగవచ్చేమోగాని... అప్పటికే తాజా మజ్జిగ తన క్షారగుణాన్ని కోల్పోయి ఆమ్ల గుణాన్ని సంతరించుకుంటుంది. అప్పటికే మన జీర్ణవ్యవస్థలో అసిడిటీ ఉంటే... ఆ యాసిడ్‌కు... ఈ ఎసిడిక్ మజ్జిగ తోడై సమస్యను పెంచుతుంది. అందుకే తాజా మజ్జిగ తాగాలి. లేదా తియ్యటి పెరుగులోనూ ప్రో-బయాటిక్స్ ఎక్కువగానే ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకునే రిఫైన్‌డ్ షుగర్స్, జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. వీలుకాకపోతే గణనీయంగానైనా తగ్గించాలి. ఇక కార్బోహైడ్రేట్స్ కోసం పొట్టుతో ఉండే అన్ని ధాన్యాలనూ తీసుకోవచ్చు కానీ కొంతకాలం పాటు మొక్కజొన్న, గోధుమలనుంచి మాత్రం దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలతో మన పేగుల్లోకి పుష్కలంగా పీచు వెళ్లేలా చేసుకోవాలి. అప్పటికీ గుణం కనిపించకపోతే డాక్టర్‌లను అడిగి ఇప్పుడు టాబ్లెట్లు, కాప్సూల్స్, పౌడర్లు, సోయాబీవరేజెస్ రూపంలో లభ్యమవుతున్న ప్రోబయాటిక్స్ మందులు వాడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవాలి.

జంక్ అంటే జంకండి!

మీ ఇంట్లో పిజ్జా, బర్గర్, పఫ్, ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ లాంటివి తినని పిల్లలు ఉన్నారా? వచ్చే సమాధానం లేరు అనే. ఇప్పుడు మనం పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లను నిరోధించలేం. సంప్రదాయ ఆహారాలను తయారు చేసుకోడానికి ఎంతో సమయం పడుతున్న వేళల్లో త్వరగా లభ్యమవుతున్నవాటిని రాకుండా అడ్డుకోలేం. కానీ అందులోని హానికరమైన అంశాలను గుర్తించి విచక్షణతో మెలగాలి. మనం ఆ ఆహార పదార్థాలను తీసుకుంటున్నప్పుడు వాటితో కలిగే హానిని కూడా గ్రహిస్తే వాటిని పరిమితం చేసుకోగలుగుతాం. అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటాం. అలాంటి విచక్షణను కలిగించేందుకే ఈ కథనం.

మనం ఆహారం కోసం ఏదో తింటుంటాం. అదే సమయంలో రుచిగా ఉండాలని కూడా కోరుకుంటాం. పిజ్జా, బర్గర్, పఫ్స్, చిప్స్ లాంటివి చాలా త్వరితంగా లభ్యమవుతున్నాయి. పైగా రుచి కూడా. అలాంటప్పుడు వాటిని తింటే తప్పేమిటి అనుకోకండి. వాటిని ప్రాసెస్‌డ్ ఫుడ్స్ అంటారు. ఏదైనా ఒక ఆహార పదార్థం దీర్ఘకాలం నిల్వ ఉండటానికీ, మరింత రుచిగా ఉండటానికి కొన్ని ప్రక్రియ (ప్రాసెస్)లను అనుసరిస్తాం. ఆ ప్రాసెస్‌ల వల్ల రుచి, చాలాకాలం నిల్వ ఉండే శక్తి (షెల్ఫ్‌లైఫ్) లభిస్తాయి. ఒక పదార్ధాన్ని నూనెతోనో, లేదా నేతితోనో చేస్తే త్వరగా చెడిపోవచ్చు. అందుకే అందులో దీర్ఘకాలం నిల్వ ఉంచే పదార్థాలు వాడతారు. వాటినే ప్రిజర్వేటివ్స్ అంటారు. ఇలా నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాల మీద ఆధారపడాల్సి వస్తుంటుంది. నిజానికి మనం తీసుకునే ఆహారంలో అందులోని స్వాభావిక పోషకాలతో ఎలాంటి హానీ లేకపోయినా... ఈ రసాయనాలే ప్రమాదకారి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో చాలాకాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి వాటిని కాస్త ఆలోచించి తినాలని సూచిస్తుంటారు నిపుణులు.

ఆహారాన్ని నిల్వ ఉంచేలా చేసే ఆ నూనె ఏమిటి?

స్వాభావికమైన వెన్న వాడితే దానితో చేసిన పదార్థం చాలా రుచిగా ఉంటుంది. కానీ వెన్న త్వరగా చెడిపోతుంది. అలా చెడకుండా ఉండే పదార్థం ఏదైనా ఉండి, అది వెన్నలాంటి రుచి ఇస్తే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన నుంచి వచ్చిన పదార్థమే హైడ్రోజనేటెడ్ ఆయిల్. ఇందులో మామూలు వంటనూనె (వెజిటబుల్ ఆయిల్)ను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి, అందులోకి హైడ్రోజెన్‌ను పంపుతారు. దీన్నే హైడ్రేజనేషన్ అంటారు. దాంతో నూనె కాస్తా వెన్నలాంటి పదార్థంగా మారిపోతుంది. వెన్నలాంటి రుచే ఇస్తుంది. ఇక్కడ ఇది రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంటుంది. ఒకటి... నూనె ద్రవరూపంలో ఉంటే దాన్ని వాడుకోవడం ఒకింత కష్టం. దూరం తీసుకెళ్లాలంటే ఒలికిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇది ఘనరూపంలో ఉంది. కాబట్టి ఒలికిపోయే ప్రమాదం లేదు. ఫలితంగా నిల్వకూ, రవాణాకూ, వాడుకోడానికీ చాలా సులభం. ఇక రెండో ప్రయోజనం... ఇది స్వాభావికమైన దానికంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

వెన్నలో ఏముంది.. మరి వెన్నలాంటిదాంట్లో ఏముంది?

వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వీటితో పాటు బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి. బ్యుటిరేట్ మానసిక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. తిన్న ఆహారమంతా ఒంటికి పట్టేలా చేస్తుంది. చిన్నపేగుల్లో వాపు, నొప్పి, మంటల (ఇన్‌ఫ్లమేషన్)ను తగ్గిస్తుంది. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) గుండె ఆరోగ్యానికి మంచిది. వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న ఎంతో ఉపయోగం. అంటే బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. మరి వెన్నలాంటి ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్‌లో పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇచ్చే గుణాలున్నాయి. ఇది గుండెకు మంచిది కాదు, శరీరంలోని కొవ్వును పెంచుతుంది. ఫలితంగా స్థూలకాయాన్ని కలిగిస్తుంది. పైగా ఇది క్యాన్సర్ కారకం కూడా.

అలర్జీలూ... మానసిక వ్యాధులు

మనం ఆహారంలో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్‌లో చాలా వరకు రసాయన పదార్థాలే కావడంతో ఒక్కోసారి అవి శరీరానికి సరిపడకపోవడం వల్ల అవి తీసుకున్న వారిలో అలర్జీలు కలగడం మామూలే. అంతేకాదు... షెల్ఫ్‌లైఫ్ ఎక్కువగా ఉండటానికి చేసే రకరకాల ఆహారాలతో పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే మానసిక వ్యాధి రావడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా కనిపిస్తున్న అంశం.

ఎర్రగా ఊరిస్తోందా...? ఒక్క క్షణం ఆగండి...

మీరు ఏదైనా బేకరీలోకి వెళ్లినప్పుడు అందులో నిల్వ ఉన్న చికెన్ ఐటమ్ ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించిందా? అది మరీ ఎర్రగా ఉందంటే దానికి సోడియమ్ నైట్రేట్‌పాళ్లు ఉన్న ప్రిజర్వేటివ్ కలిపారని అర్థం. చికెన్ మంచి పోషకమే అయినా దాంతోపాటు జత కలిసి ఉన్న సోడియమ్ నైట్రేట్ కారణంగా అది కోలోరెక్టల్ క్యాన్సర్‌ను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ల్యూకేమియాలను కలిగించే పదార్థంగా మారుతుంది. అందుకే ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే మాంసాహార బేకరీ పదార్థాలను తక్కువగానే తీసుకోవాలి. ప్రత్యామ్నాయ ఆహారాలుంటే వాటిని మానేసి ఏ శాండ్‌విచ్‌వైపో మొగ్గుచూపాలి. (అప్పుడు శాండ్‌విచ్‌లలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్‌కు బదులు స్వాభావికమైన వెన్న వాడిన వాటినే తీసుకోవాలని గుర్తుంచుకోండి).

కూల్‌డ్రింక్స్‌లోని కృత్రిమ రంగులు - ప్రిజర్వేటివ్స్

మనం కూల్‌డ్రింక్స్ తాగే సమయంలో వాటితో పాటు కొన్ని కృత్రిమ రంగులనూ బలవంతంగా శరీరంలోకి పంపుతాం. వాటిని అక్కడ ఉంచడానికి మన మూత్రపిండాలు అస్సలు ఒప్పుకోవు. అందుకే వీటిని బయటకు పంపేందుకు అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్రపిండాల దెబ్బతింటాయి. ఇక కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాలు దోహదపడతాయి. అవే... సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్. కొన్ని సందర్భాల్లో సన్‌సెట్ ఎల్లో, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్, సోడియ మ్ బెంజోయేట్ వంటి అనేక రసాయనాల మిశ్రమాన్ని ఒకే ప్రిజర్వేటివ్స్‌గా కూడా వాడతారు. వీటివల్ల పిల్లలకు కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.

ఉదాహరణకు... సోడియం బెంజోయేట్ అనే రసాయనం మనం తీసుకున్న విటమిన్ ‘సి’తో కలిసినప్పుడు ఇది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుంది. బాగా వయస్సు పైబడటం లేదా అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో సోడియమ్ బెంజోయేట్ తీసుకున్న వారిలోనూ అచ్చం అలాంటి దుష్పరిణామాలే కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని ఇటీవలి కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా అదే పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్‌ను రూపొందించడానికి విశేష పరిశోధనలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే అప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు గణనీయంగా తగ్గవచ్చు. అప్పటివరకూ మనం ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటున్నా, కూల్‌డ్రింక్స్ తాగుతున్నా అప్రమత్తంగా ఉంటూ పరిమితంగా తీసుకోవడం తప్పదు.

కూల్‌డ్రింక్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్‌తో: దీనివల్ల దంతాలపై ఉండే అనామెల్ పొరను దెబ్బతింటుంది. దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఈ పొర దెబ్బతినడం, పళ్లపై మరకలు, చారలు ఏర్పడటం ఇప్పటికే కనిపిస్తున్న అనారోగ్యకరమైన పరిణామం. కూల్‌డ్రింక్స్ కంపెనీలు మాత్రం తమ పానీయాల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ కేవలం అనుమతించిన మోతాదుల (పర్మిసిబుల్ లిమిట్స్)కు మించకుండా వాడుతున్నామని చెబుతుంటాయి. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల అది క్యాల్షియం మెటబాలిజమ్‌ను దెబ్బతీస్తుంది. దాంతో ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

అందుకే బేకరీలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి ఈ అంశాలన్నీ గుర్తు తెచ్చుకుని మీరు తీసుకోబోయే ఆహారాన్ని వీలైనంతగా పరిమితం చేసుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

ఉప్పు కూడా ఒక ప్రిజర్వేటివే...

మనం ఆహారంలో తీసుకునే ఉప్పు కూడా ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో ఒక ప్రిజర్వేటివ్‌గా వాడతారని మీకు తెలుసా? ఉప్పు వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు... మనకు బాగా తెలిసిన ఉదాహరణ రక్తపోటు మాత్రమే. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ ఉప్పు ఎక్కువగా వాడితే జీర్ణాశయం లోపలి గోడలపై ఉన్న పొరలు దెబ్బతింటాయి. ఫలితంగా అట్రోఫిక్ గ్యాస్ట్రయిటిస్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వంటి జబ్బులూ రావచ్చు. మనం వాడే ప్రాసెస్‌డ్ ఫుడ్స్, అప్పడాలు, ఊరగాయలు (పచ్చళ్లు)... వీటన్నింటిలోనూ ఉప్పు ఎక్కువ. అందుకే వాటిని తక్కువగా తీసుకోవాలి.

కలుషితాహారం తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు

ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు అవుతుంటే మీరు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటమో లేదా ఓఆర్‌ఎస్ తీసుకుంటూ ఉండటమో చేస్తూ మీ శరీరం లవణాలనూ, నీటిని కోల్పోకుండా చూసుకోండి.

వాంతులు, విరేచనాలు మరీ ఎక్కువగా ఉంటే సాధారణంగా దొరికే యాంటీ-వామిటింగ్ అండ్ డయేరియా మందులను డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. ఆన్ కౌంటర్ మెడిసిన్ వద్దు.

వాంతులు, విరేచనాలు సాధారణ యాంటీ వామిటింగ్ అండ్ డయేరియా మందులతో తగ్గకపోతే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించడం వంటివి చేస్తారు.

వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట లభించే పాల ఉత్పాదనలు వాడవద్దు.

Tuesday, January 8, 2013

పెయిన్ కిల్లర్స్ దుష్ర్పభావాలు తెలుసా..?

పెయిన్ కిల్లర్స్‌తో కలిగే దుష్ర్పభావాలపై చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే చిన్న నొప్పి ఉన్నా చీటికీ మాటికీ పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటారు. నొప్పి తగ్గే విషయంలో ఇవి సత్వరం పనిచేసినా, దీర్ఘకాలంలో అవి చూపించే సైడ్‌ఎఫెక్ట్స్ మీద మీ అవగాహన ఏమిటో చెక్ చేసుకోండి.


1.పెయిన్ కిల్లర్స్ మూడు వారాలకు మించి వాడితే అవి కడుపు లోపలి పొరలను, రక్తనాళాల్లోని లోపలి పొరలను దెబ్బతీస్తాయి.

ఎ. అవును                     బి. కాదు

2.చాలామందిలో అవి మూత్రపిండాలపై దుష్ర్పభావం చూపి, నెఫ్రోపతి అనే కండిషన్‌కు దారితీస్తాయి.

ఎ. అవును                     బి. కాదు

3.రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌ని దెబ్బతీసి అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు.

ఎ. అవును                     బి. కాదు

4.పెయిన్ కిల్లర్స్‌ను తప్పనిసరిగా ఏదైనా తిన్న తర్వాత మాత్రమే వేసుకోవాలి.

ఎ. అవును                     బి. కాదు

5.అవి వేసుకున్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.

ఎ. అవును                   బి. కాదు


పై వాటిల్లో మూడింటికంటే ఎక్కువ అంశాలకు మీ సమాధానం ‘అవును’ అయితే మీకు పెయిన్‌కిల్లర్స్‌తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ప్‌పై మంచి అవగాహన ఉన్నట్లే.

హెల్దీ 2013

కొత్త ఏడాది అనగానే ఎన్నో నిర్ణయాలు. ‘న్యూ ఇయర్ రెజల్యూషన్స్’గా ఎన్నో ఆరోగ్యకరమైన అలవాట్లకు శ్రీకారాలు. మరెన్నో అనారోగ్య కారకాలకు తిలోదకాలు. ఇది సహజం. ఈ కొత్త సంవత్సరం 2013లో ఎలాంటి నిర్ణయాలు ఆరోగ్యాన్నిస్తాయో తెలియజేయడం కోసం ఉపయోగపడే ఈ కథనంలో ‘పదమూడు’ ఆరోగ్యకరమైన అంశాలను పొందుపరుస్తున్నాం. వాటిని పాటించిన ఏ కొందరైనా ఏడాది చివరివరకూ కొనసాగిస్తే... అంతకంటే ఆరోగ్యమేముంది!




1)

మంచి ఆహారమే తీసుకోండి...

ఆహారంలో ఆరోగ్యానికి మేలు చేసేవి ఎక్కువగా తీసుకుంటూ, అనారోగ్యానికి దోహదం చేసేవాటిని పరిమితంగా తీసుకుంటూ ఉండటం మంచిది. మన ప్రధాన ఆహారమైన బియ్యం విషయానికి వస్తే దంపుడుబియ్యం, ఇతర ధాన్యాల్లో పొట్టుతీయని ముడి ధాన్యాలు తీసుకోవాలి. అలాగే కూరల విషయంలో ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) మంచివి. ఇక మాంసాహారంలో చేపలు చాలా మంచి ఆహారం.


అయితే మాంసాహారం తీసుకునేవారు ప్రోటీన్‌ల కోసం రెడ్ మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటి వైట్ మీట్ తీసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి. అరటి, నారింజ వంటి అన్నిరకాల తాజా పండ్లలో అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటితో పాటు పీచు ఎక్కువగా ఉండే జామ, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లు, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని నిర్ణయించుకోండి.


మేలు చేయనివి: కాఫీ, టీ, శీతలపానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్... వీటిల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. చాక్లెట్లు, సోడా డ్రింక్స్ వంటి వాటిల్లో హానికరమైన చక్కెరపాళ్లు ఎక్కువ. అలాగే బేకరీ ఫుడ్స్, పిజ్జా, బర్గర్‌ల వంటి ప్రాసెస్‌డ్ ఆహారాల్లో పోషకాలు తక్కువ, హానికరమైన అంశాలు ఎక్కువ. నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనెల్లో ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వుపాళ్లను పెంచుతాయి. చర్మంపై మొటిమలు వచ్చేలా చేస్తాయి. కాబట్టి వీటిని పరిహరించాలి. వాటిని పూర్తిగా మానివేయడం సాధ్యం కాకపోతే చాలా పరిమితంగానే తీసుకోవాలి.



2)

నిద్ర విషయంలో...

కొత్త ఏడాది పార్టీలతో వచ్చే అనర్థాల్లో మరో ముఖ్యమైనది నిద్రలేమి. వేడుకలు, విందు వినోదాల్లో భాగంగా అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన నిద్ర సమకూరదు. దాంతో అనేక సమస్యలు వస్తాయి.


నిద్రలేమి వల్ల... మతిమరపు మెదడు ఎదుగుదలలో లోపం సాధారణ ఎదుగుదలలో లోపం అధిక రక్తపోటు గుండెజబ్బులు స్థూలకాయం డయాబెటిస్ జీర్ణకోశ సమస్యలు రోగనిరోధక శక్తి తగ్గడం గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం వంటి అనేక అనర్థాలతో పాటు శరీరంలోని అన్ని వ్యవస్థలూ దెబ్బతింటాయి. ఇవేగాక నిద్రలేమి వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం పెరుగుతాయని కొన్ని అధ్యయనాలలో తేలింది.


కాబట్టి ఈ కొత్త ఏడాదిలో వేళకు నిద్రపోవడం, పెందరాళే నిద్రలేవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుంటే అనేక అనారోగ్యాలను ముందు నుంచే నివారించవచ్చు.





3)

ఆరుబయట సూర్యకాంతిలో...

మన లేట్‌నైట్ పార్టీ వేడుకల వల్ల జరిగే అనర్థాలలో మరో ముఖ్యమైనది పెందరాళే నిద్రలేవలేకపోవడం. దాంతో మనం అందమైన సూర్యోదయాలను మిస్ అవుతాం. శరీరానికి సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ఎంతో విలువైన విటమిన్-డిని కోల్పోతాం. దాంతో ఎముకల వ్యాధులైన... రికెట్స్, ఆస్టోమలేసియా వంటివి రావచ్చు. ఈ వైటమిన్ లోపం పారాథైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే ఒక్కోసారి ఫిట్స్/కన్వల్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే కొత్త ఏడాది నిర్ణయాలలో పెందరాళే నిద్రలేచి ఆరుబయట సూర్యకాంతిలో నడవాలనే అంశానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వండి.





4)

ఐరన్‌పాళ్లు పెంచుకోండి

మన దేశంలో 85 శాతం మహిళలకు రక్తహీనత ఉంటుందని అంచనా. అందువల్ల మన ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ఈ ఏడాది నిర్ణయాలలో ఉండాల్సిందే. మీరు మహిళ అయితే ఈ తీర్మానం తప్పనిసరి.


మనలో ఐరన్‌పాళ్లు పెరగాలంటే మాంసాహారులైతే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంలోని లివర్ తీసుకోవాలి. శాకాహారులైతే తాజా ఆకుపచ్చటి ఆకుకూరలు(గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, గసగసాలు, అటుకులు వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ దొరుకుతుందని గుర్తుంచుకోండి.




5)

గుండె పదిలంగా ఉండాలంటే

మన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుకోడానికి చేసే ప్రయత్నాలన్నీ మన సాధారణ ఆరోగ్యం (జనరల్ హెల్త్) కోసం కూడా ఉపయోగపడతాయి. అవి.. రోజూ ఆటలాడటం... దీనివల్ల మనలో సంతోషం కలిగించే ఎండార్ఫిన్స్ వంటి రసాయనాలు స్రవించి అవి ఆరోగ్యంగా ఉంచుతాయి రక్తదానం... మీకు రక్తదానం చేసే అలవాటు ఉంటే... ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు ఆ మంచిపని చేస్తే అది గుండెకు ఎంతో మంచిది.


వ్యాయామం గుండెకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. వ్యాయామాలన్నింటిలోనూ నడక మంచిది. మొదటి రోజున 20 నిమిషాలతో మొదలు పెట్టి, ఆ వ్యవధిని క్రమంగా పెంచుకుంటూపోతూ రోజూ కనీసం 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేసే స్థాయికి చేరుకోవాలి. ఇలా వారంలో కనీసం 5 రోజులైనా వాకింగ్ చేయడం గుండెకు మేలు చేస్తుందనే విషయాన్ని మరచిపోకండి. కాబట్టి కొత్త ఏడాది నిర్ణయంగా ఈ రోజే వాకింగ్ మొదలుపెట్టండి.




6)

హైపర్ టెన్షన్‌తో జాగ్రత్త

ప్రవహించాల్సిన వేగం కంటే ఎక్కువ ఒత్తిడితో రక్తం ప్రవహించడాన్ని రక్తపోటు /హైబీపీ/ హైపర్‌టెన్షన్ అని చెప్పవచ్చు. సాధారణ రక్తపోటు 120-130 / 70-90 ఎంఎం హెచ్‌జిగా ఉండాలి. ఇంతకు మించి ఉంటే ప్రమాదం అని గుర్తించాలి. రక్తపోటు కారణంగా కళ్లు, మెదడు, గుండె, మూత్రపిండాలు... ఇలా శరీరంలోని ఏ భాగమైనా దెబ్బతినవచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం కోసం ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండు వంటివి తినడం లాంటి మంచి అలవాట్లు చేసుకోండి.





7)

డయాబెటిస్ ఉంటే పరాకు వద్దు

శరీరంలోని ఏ అవయవాన్నైనా దెబ్బతీసి ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టే జబ్బు డయాబెటిస్. ఒక్క డయాబెటిస్ ఉందంటే అది పది రోగాల పెట్టు అని గుర్తెరిగి జాగ్రత్త వహించండి. గతంలో ఎలా ఉన్నా... ఈ ఏడాదిలో ముందు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, చక్కెరను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకుంటూ ఉండటం మరవకండి. చక్కెరవ్యాధి ఉన్నవారు ప్రతి మూడు నెలలకు కనీసం ఒకసారి హెచ్‌బీ1 ఏసీ అనే పరీక్ష చేయించుకుంటూ చక్కెరపాళ్లు ఎప్పుడైనా పెరుగుతున్నాయా లేక ఒకేలా ఉంటున్నాయా అన్నది పరీక్షించుకుంటూ ఉండండి.


8)

కొవ్వు పాళ్లు సరిగా ఉన్నాయేమో చూసుకోండి

కొవ్వు వల్ల ఎప్పుడూ హానే జరుగుతుందని మనలో చాలామందికి ఒక అపోహ. కానీ అది వాస్తవం కాదు. నిజానికి మనలోని అనేక జీవక్రియల నిర్వహణకు కొవ్వు కావాల్సిందే. ఎందుకంటే కొన్నిరకాల విటమిన్లు కేవలం కొవ్వులోనే కరుగుతాయి. అందుకే కొవ్వులు తగినంతగా లేకపోవడం కూడా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యస్పృహ ఎక్కువైన కొందరు నూనెలను / కొవ్వులను అదేపనిగా పరిహరిస్తుంటారు. దాంతో కొవ్వు తగ్గడం వల్ల వచ్చే అనర్థాలు ఎదురవుతాయి. ఇలాంటి కండిషన్‌ను ‘డిస్‌లిపిడేమియా’ అంటారు.


డిస్ లిపిడేమియా అంటే శరీరంలో కొవ్వు పాళ్లు ఉండాల్సినంత లేకపోవడం అన్నమాట. కొవ్వులను ఆరోగ్యకరమైన పాళ్లలో తీసుకుంటూనే గుండెపోటును నివారించడానికి తమ రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పాళ్లు 40కి పైన, చెడు కొలెస్ట్రాల్ పాళ్లు 80లోపు, ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు (టిజిఎల్) 150లోపు ఉండేలా చూసుకోవాలి.




9)

ఒత్తిడి అనర్థాలను అధిగమించండి

మన దైనందిన జీవితంలో ఒత్తిడిని అనుభవించనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు పరిమితమైన ఒత్తిడి వల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో మితిమీరిన ఒత్తిడి వల్ల అనర్థాలే ఎక్కువ. ఆందోళన నుంచి ఉపశమనానికి పొగతాగడం, మద్యం తీసుకోవటం వంటివి చేస్తుంటారు.


ఇది మరింత అనర్థదాయకం. ఒత్తిడిని అధిగమించడం కోసం రోజూ యోగా, ఆటలు, ధ్యానం, ఇష్టమైన వ్యాపకాలు, హాబీలను పెంపొందించుకోవడం... వంటివి చేయాలనే నిర్ణయం తీసుకోండి.




10)

పొగాకును వదిలేయండి

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలు పొగతాగడం వల్లనే సంభవిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. పొగాకులో ఉండే విషపదార్థాలు రక్తంలో కలవటమే హార్‌్ణఫెయిల్‌కు ప్రధాన కారణం. పొగతాగేవారు తమకు చేటు చేసుకోవడంతో పాటు పక్కవారి అనారోగ్యానికీ కారణమవుతున్నారు. అందుకే అనేక అనర్థాలకు మూలమైన ఈ అలవాటును ఈ ఏడాది తక్షణం వదిలేయండి. మళ్లీ ఎప్పుడూ మొదలుపెట్టకండి.





11)

మద్యంతో ముప్పే!

చాలా కొద్దిమోతాదుల్లో తీసుకునే ఆల్కహాల్ గుండెకు మంచిదని, అది కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. కొద్ది మోతాదులో రెడ్ వైన్‌లాంటి డ్రింక్ వల్ల కొంచెం మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరగవచ్చు. కానీ ఆల్కహాల్‌లో ఉండే పదార్థాలు దానికి బానిసయ్యేలా చేస్తాయి.


ఈ కారణంగా మద్యం తాగటం మొదలు పెట్టిన కొన్నాళ్ల తరువాత ఆల్కహాలు మోతాదును పెంచుకుంటూపోతారు. దాంతో అనేక సామాజిక, మానసిక, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆల్కహాల్ అన్నివేళలా ఆరోగ్యానికి అనర్థదాయకమే అని గుర్తుంచుకుని ఈ ఏడాది ఆ అలవాటుకు స్వస్తి చెప్పండి.



12)

పాజిటివ్ దృక్పథంతో ఉండండి

మన రోజువారీ వ్యవహారాల్లో సానుకూల దృక్పథం (పాజిటివ్ ఆటిట్యూడ్)తో ఉండటం వల్ల ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం ఉంటుందన్న విషయం అనేక సందర్భాల్లో తేలిన సత్యం. యువరాజ్‌సింగ్‌కు క్యాన్సర్ నయం కావడానికి సానుకూల దృక్పథం ఎంతగా తోడ్పడిందో మనందరికీ తెలిసిన విషయమేకదా! అందుకే ఈ ఏడాదంతా పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ ఫలితాలు పొందండి.


13)

బరువు పెరుగుతున్నారా... అప్రమత్తంగా ఉండండి

కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా ఈ నెలంతా పార్టీలు జరుగుతూనే ఉంటాయి. దీనికితోడు ఇటీవల మన ఆహారపు అలవాట్లలోనూ, జీవనశైలిలోనూ పాశ్చాత్యధోరణులు కనిపిస్తున్నాయి. దాంతో బరువు పెరగడం అన్నది చాలా రొటీన్ సమస్యగా మారింది. ఇలా పెరిగే బరువు ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతుంది.


అవి... డయాబెటిస్ పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) హైబీపీ ఆర్థరైటిస్ గుండెజబ్బులు సంతానలోపం, అంగస్తంభన లోపాలు హైకొలెస్ట్రాల్ మహిళల్లో హార్మోనల్ మార్పులు రుతుక్రమంలో మార్పులు, ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం జీర్ణక్రియ మందగించడం మానసిక సమస్యలు మూత్ర సంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ మలబద్దకం గ్యాస్ట్రయిటిస్, అసిడిటీ ఛాతీలో మంటగా ఉండటం వాంతులు కావడం డయేరియా నడుము నొప్పి రావడం.


మనలోని ఒబెసిటీనీ గుర్తించడం ఎలా: మన బరువు మామూలుగానే ఉందా లేక అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేంతగా పెరిగిందా అని తెలుసుకునేందుకు ఒక సూచిక అందుబాటులో ఉంది. అదే బాడీ మాస్ ఇండెక్స్.


బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) పద్ధతితో కిలోగ్రాముల్లో మీ బరువును తీసుకుని, దాన్ని మీటర్లలో మీ ఎత్తు స్క్వేర్‌తో భాగించండి. వచ్చిన ఆ విలువను బట్టి మీరు ఉండాల్సినంత బరువు ఉన్నారా లేక ఎక్కువగా ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆ విలువ 18.5 కంటే తక్కువ ఉంటే మీరు తక్కువ బరువు ఉన్నట్లు 18.5 నుంచి 24.99 ఉంటే మీ ఎత్తుకు తగిన బరువు ఉన్నట్లు.

25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు లావుగా ఉన్నట్లే!

25 నుంచి 29 ఉంటే మీరు స్థూలకాయులు (ఒబేస్)

30 నుంచి 34.99 వరకు చాలా స్థూలకాయులు

35 నుంచి 39.99 వరకు అయితే మీలో ఒబేసిటీ పాళ్లు విపరీతమన్నమాట. మీ బీఎంఐ 33 దాటితే సాధారణ వ్యాయామం, ఆహార మార్పుల వంటి జీవనశైలిలో మార్పులతోనే సన్నబడటం కష్టమై, సర్జరీ వరకు వెళ్లాల్సి రావచ్చు. కాబట్టి బీఎంఐ ఆ స్థాయికి చేరకుండా ముందునుంచే జాగ్రత్త వహించాలి.

నోరు మంచిదైతే...


పొద్దున్నే లేచి ముఖం కడుక్కుంటాం. కానీ శరీరంలోని అంతర్గత అవయవాలను నేరుగా కడగలేం. అయితే ఒక్క ముఖం కడగడం అంటేనే... పరోక్షంగా శరీరంలోని ఎన్నో అవయవాలనూ శుభ్రం చేయడమన్నమాట. దంతాల సంరక్షణకూ... గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధుల నివారణకూ సంబంధం ఉంది. మహిళల నోటి ఆరోగ్యంపైనే వారి కడుపులోని బిడ్డ ఆరోగ్యం ముడిపడి ఉంది. నోటికీ... మన లోని గుండె, మూత్రపిండాలు, కళ్లు, కాలేయం, థైరాయిడ్, మెదడు, ఊపిరితిత్తులు... ఇలా అనేక అవయవాల ఆరోగ్యానికీ సంబంధం ఉంది.

నోటి సంరక్షణ చక్కగా జరుగుతోందంటే క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్ నివారణ కూడా సాధ్యమవుతోందని అర్థం అంటున్నారు దంత వైద్యనిపుణులు. అంటే... నోరు మంచిదైతే హెల్త్ కూడా మంచిదవుతుందన్నమాట. నోటి ఆరోగ్యానికీ... మనలో అంతర్గతంగా ఉండే అవయవాలకూ, హైబీపీ, చక్కెర లాంటి వ్యాధులకు ఉన్న దగ్గరి సంబంధాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేదే... ఇవాళ్టి ఈ ప్రత్యేక కథనం.

మన నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే అది శరీరంలోని అంతర్గత అవయవాలన్నింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. నోటి పరిశుభ్రతకూ మన శరీరంలోని వివిధ అవయవాలకు మధ్య ఉన్న సంబంధం ఇలా...

చిగుర్ల ఆరోగ్యమే గుండెకు రక్ష: మనం రోజూ చక్కగా బ్రష్ చేసుకుని చిగుర్ల ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటే గుండెజబ్బులను, గుండెపోటును నివారించినట్లే. నోటి శుభ్రత సరిగా పాటించని వారిలో గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజెస్) వచ్చిన దాఖలాలు ఉన్నట్లుగా అనేక అధ్యయన ఫలితాలున్నాయి. దీనికి సంబంధించి రెండు థియరీలను చెప్పుకోవచ్చు. మొదటిది... నోటిలో జబ్బులకు, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్ని రకాల విషాలను వెలువరిస్తుంటాయి. ఇవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తం సాఫీగా ప్రవహించడానికి అడ్డుపడేలా కొన్ని రక్తపు గడ్డలు (క్లాట్స్), కొవ్వుముక్కల వంటి పదార్థాలను (ప్లాక్స్) తయారు చేస్తాయి. అవి రక్తప్రవాహానికి అడ్డుపడటంతో గుండెపోటు రావచ్చు. రెండో థియరీ ప్రకారం... నోటిలోని హానికారక బ్యాక్టీరియా కారణంగా కాలేయంలో కొన్ని ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తనాళాల్లోకి ప్రవేశించి అడ్డుపడటం వల్ల గుండెపోటుకు ఒక్కోసారి పక్షవాతానికీ కారణమవుతాయి. ఒక్కోసారి నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల ‘ఎండోకార్డయిటిస్’ వంటి గుండెలోపలి పొరల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు రోజూ సరిగా బ్రష్ చేసుకుంటున్నారంటే, మీరు నోటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే కాదు... గుండెపోటునూ నివారిస్తున్నారన్నమాట.

గుండెజబ్బులు ఉన్నవారు దంత చికిత్స తీసుకోడానికి దంతవైద్యుడిని కలిసేందుకు ముందుగా రక్తన్ని పలచబార్చేందుకు వారు వాడే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులను మూడు నుంచి ఐదు రోజుల ముందుగానే పూర్తిగా నిలిపివేయాలి బైపాస్ సర్జరీ చేయించుకోదలచినవారు ముందుగా దంతవైద్యుడిని కలిసి తమకు పళ్లు, చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవీలేవని నిర్ధారణ చేసుకోవాలి. దంతసంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే బైపాస్ ద్వారా వచ్చే పూర్తి ఫలితాలను పొందలేం.


దంతాలు... ఊపిరితిత్తులు : నోటిలో బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది గొంతులోకి ప్రవేశించి అక్కడ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిలో కలిసి లంగ్స్‌లోకి ప్రవేశించవచ్చు. ఇది ఒక్కోసారి పల్మునరీ ఇన్ఫెక్షన్స్‌కు, నిమోనియాకు దారితీయవచ్చు. ఇది వయసు పైబడ్డవారిలో జరిగితే వాళ్లలో సహజంగానే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఒక్కోసారి చిగుర్లలో ఉండి ఇన్‌ఫ్లమేషన్ కలిగించే ‘సైటోకైన్స్’ ఊపిరితిత్తుల్లోని కింది భాగానికి చేరితే అవి మరింత ప్రమాదకరమైన శ్వాసకోశవ్యాధులకు ఆస్కారమివ్వవచ్చు.

నోటి ఆరోగ్యం... మూత్రపిండాలపై దాని ప్రభావం: మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అంటే కిడ్నీవ్యాధులు ఉన్నవారు ఇన్ఫెక్షన్లకు తేలిగ్గా లోనవుతారన్నమాట. అదీగాక మూత్రపిండాల జబ్బులతో బాధపడేవారికి నోటి రుచి మారిపోతుంది. పైగా వాళ్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మన శరీరం నుంచి మాలిన్యాలను తొలగించేవి మూత్రపిండాలే కదా! అవి పనిచేయడం మానేయడం వల్ల మాలిన్యాలన్నీ అలాగే పోగుపడతాయి. దాంతో మన శరీరంలోని యూరియా అమోనియాగా మారి నోటి ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే నోటి నుంచి అలా దుర్వాసన వస్తుంటుందన్నమాట. దీనికి తోడు ఎముకలు కూడా క్యాల్షియమ్‌ను సక్రమంగా గ్రహించలేవు. ఫలితంగా దవడ ఎముకలు బలహీనం కావడం, పళ్లు ఊడిపోవడం వంటివి జరగవచ్చు. నోరు పొడిగా మారిపోవచ్చు. ఈ కండిషన్‌ను గ్జీరోస్టోమియా అంటారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో పళ్లు ఊడిపోవడం లాలాజలగ్రంథుల ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు రావచ్చు.

కొన్ని జాగ్రత్తలు అవసరం: కిడ్నీ జబ్బు ఉండి డయాలసిస్ చికిత్స తీసుకునేవారు తప్పనిసరిగా దంతవైద్యుడితో సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. ఈతరహా రోగులు డెంటల్ చికిత్స తీసుకోవాల్సి వస్తే... అది తప్పకుండా డయాలసిస్ అయిన మర్నాడు ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే షంట్ చికిత్స ఇచ్చిన రోగులకు రక్తాన్ని పలచబార్చే మందులు ఇస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో దంత చికిత్స చేస్తే రక్తస్రావం జరిగి ప్రమాదానికి దారితీయవచ్చు. అలాంటప్పుడు దంతచికిత్స చేస్తే తప్పనిసరిగా మంచి యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుందన్నమాట. చాలావరకు మనం దంతవైద్య చికిత్సలో వాడే నొప్పి నివారణ మందులు కిడ్నీపై ప్రభావం చూపి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ (కిడ్నీ ఫెయిల్యూర్)కు దారితీస్తాయి. కాబట్టి ఏ మందులనైనా డాక్టర్ సూచించిన మోతాదులోనే వాడాలి.

నోటి ఆరోగ్యం... క్యాన్సర్ల విషయంలో మరికొన్ని అంశాలు:
పొగతాగడం వంటి కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ప్రోస్టేట్, లంగ్ క్యాన్సర్లతో సహా అనేక రకాల క్యాన్సర్లను నివారించవచ్చు.

నోటి క్యాన్సర్‌లను గుర్తుపట్టడం ఎలా:
నోటిలో చాలాకాలంగా మానని పుండు నోటిలో ఏదైనా గడ్డలా తగులుతుండటం చాలాకాలంగా గొంతు బొంగురుగా ఉండటం నమలడం, మింగడంలో ఇబ్బంది నాలుక లేదా దవడలు కదలడంలో ఇబ్బందులు గొంతులో ఎప్పుడూ ఏదో అడ్డుపడి ఉన్న ఫీలింగ్... ఈ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యనిపుణులను కలిసి సలహా తీసుకోవాలి.
ఇక క్యాన్సర్‌కు రేడియేషన్ చికిత్స తీసుకున్నవారిలో చాలామందికి నోటిలో లాలాజల స్రావం తగ్గుతుంది. దాంతో వారికి పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వ్యాధులు రావడం వంటి ప్రమాదాలు ఉంటాయి. ఇలాంటివారు లాలాజలానికి ప్రత్యామ్నాయ మందులు వాడాల్సి ఉంటుంది.
పై అంశాలను దృష్టిలో ఉంచుకుని ఒక్క నోటిని శుభ్రంగా ఉంచుకుంటే శరీరంలోని దాదాపు అన్ని అవయవాలనూ శుభ్రపరచుకున్నట్లేనని గ్రహిస్తే శరీరమంతటికీ ఆరోగ్యమే.


నోటి ఆరోగ్యం... మెదడుపై ప్రభావం
నోటి శుభ్రతకూ, మెదడుకూ దగ్గరి సంబంధం ఉందంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. కానీ ఆ మాట అక్షరాలా నిజం. మన నోటిలో చిగుళ్లపై ఒక రకం గార ఏర్పడటం సాధారణం. దీన్నే సూప్రా జింజివల్ ప్లాక్ లేదా సబ్ జింజివల్ ప్లాక్ అంటారు. ఈ గార మన రక్తంలోని ప్లేట్‌లెట్‌లను ప్రభావితం చేసి... అవి గుంపులుగా చేరేలా ప్రేరేపిస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన ‘థ్రాంబస్ ఫార్మేషన్’ జరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీన్నే ‘థ్రాంబోఎంబాలిజమ్’ అంటారు. ఈ ప్రక్రియ మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది పక్షవాతానికి దారి తీయవచ్చు. అంటే మనం ముఖం సరిగా కడుక్కోకపోతే పక్షవాతం వచ్చే ప్రమాదమూ ఉందన్నమాట. మరో విషయం ఏమిటంటే... మన మెదడులో చిన్న పగులు వంటిది ఏర్పడి అందులో చీము నిండటాన్ని బ్రెయిన్ యాబ్సెస్ అంటారు. నోటిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి ఇలాంటి యాబ్సెస్‌లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే దంతాలకు ఏదైనా చికిత్స తీసుకున్నప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ మందులను డాక్టర్ల సలహా మేరకు వాడాలి. ఒకవేళ అలా జరగకపోతే నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్‌లు... క్రమంగా మన పుర్రెలోని రంధ్రాలైన కావెర్నస్ సైనస్‌ల ద్వారా మెదడుకు చేరి... బ్రెయిన్ యాబ్సెస్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ముఖం శుభ్రంగా కడుక్కోవడం అంటే మన మెదడునూ సురక్షితంగా ఉంచుకోవడం అని అర్థం.


నోటి సంరక్షణే... పిండ సంరక్షణ...
గర్భవతుల్లో ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్’ అనే ఒక రకం చిగుర్ల వ్యాధి వస్తుంటుంది. ఇది సాధారణంగా గర్భధారణ జరిగిన రెండో నెలలో కనిపిస్తుంటుంది. ఒకవేళ ఆ మహిళకు అంతకు ముందే చిగుర్ల సమస్య ఉంటే అది గర్భధారణ తర్వాత మరింత తీవ్రతరం అవుతుంది. ఇలాంటి సమయాల్లో నోటి శుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే వాచిన చిగుర్లలో లేదా నోటిలో కణుతులు, మంటలేని-క్యాన్సర్‌కాని (నాన్ ఇన్‌ఫ్లమేటరీ, నాన్ క్యాన్సరస్) గడ్డలు పెరగవచ్చు. గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే వాళ్లకు నిర్ణీత వ్యవధి కంటే ముందే ప్రసవం కావడం (నెల తక్కువ బిడ్డలు పుట్టడం), పుట్టిన బిడ్డ బరువు చాలా తక్కువగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి గర్భసంచి (యుటెరస్)కి చేరి అక్కడ ప్రోస్టాగ్లాండిన్ వంటి రసాయనాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దాంతో అది గర్భధారణ వ్యవధి ముగియక ముందే ప్రసవానికి (ప్రీ మెచ్యూర్ లేబర్‌కు) దారితీయవచ్చు. అందుకే గర్భవతులు తమ నోటి ఆరోగ్యాన్ని చక్కగా సంరక్షించుకుంటే అది పుట్టబోయే బిడ్డకూ మేలు చేస్తుందని మరవద్దు.
గర్భిణులు టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఆ ప్రభావం పిండం మీద పడి శిశువు పళ్ల రంగు మారిపోతుంది. కాబట్టి గర్భిణులు యాంటీబయాటిక్స్‌ను ఫిజీషియన్ సలహా మేరకే వాడాలి.


పన్ను... కన్ను... మంచి ఆరోగ్యం
మనలో చాలామందికి... పన్ను పీకిస్తే అది కంటి నరాలను అదిరేలా చేసి చూపును తగ్గిస్తుందని, కంటిచూపుపై ప్రభావం పడేలా చూస్తుందన్నదే ఆ అపోహ. ఇది నిజం కాదు. అయితే పైన మెదడు విషయంలో జరిగినదే కంటి విషయంలోనూ జరగవచ్చు. పలువరసకుగాని, నోటిలోగాని వచ్చే ఇన్ఫెక్షన్లు మెదడుకు చేరే మార్గంలోనే కంటికి చేరి ‘కార్నియల్ ఇన్ఫెక్షన్’గా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో పైవరస పంటికి పైభాగంలో ఉండే ఎముకల్లో చీము పట్టడం జరిగితే... అది కంటికి చాలా దగ్గరగా ఉన్న కారణంగా ఆ ఇన్ఫెక్షన్ కంటినీ ప్రభావితం చేయవచ్చు. ఇక కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోదలచినవారు ముందుగా నోటిలో ఎలాంటి ఇన్ఫెక్షన్‌లూ లేకుండా చూసుకుని ఆ తర్వాతే ఆపరేషన్ చేయించుకుంటే మంచిది.


నోటి ఆరోగ్యం... క్యాన్సర్లు
నోటి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకునే క్రమంలో పొగతాగడమనే ఒక్క దురలవాటును మానుకుంటే ఎన్నో క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. పొగతాగే అలవాటు ఉన్నవారిలో తెల్లరక్తకణాల్లో ఉండే న్యూట్రోఫిల్స్ పనితీరు లోపభూయిష్టంగా ఉంటుంది. పొగతాగేవారిలో ఎముకలు పలచబారుతాయి. ఇదీ నోటి నుంచే జరుగుతుంది. సిగరెట్‌లో ఉండే నికోటిన్ కారణంగా మన చిగుర్ల చుట్టూ ఏర్పడే గారను స్వాభావికంగానే తొలగించుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా సిగరెట్ వల్ల పంటికి, చిగుర్లకు చేసే చికిత్స పూర్తి ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. పైగా మన దేశంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు చాలా ఎక్కువ. పొగ తాగే అలవాటు మానివేయడం వల్ల ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు లంగ్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులనూ నివారించుకోవచ్చు. ఇక పొగాకు నమలడం వల్ల ల్యూకోప్లేకియా, పెరియోడాంటల్ డిసీజ్ వంటివీ ఎక్కువే. కాబట్టి ఈ దురలవాటు మానేయడం వల్ల పై జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ఇక నోటిలో ఏవైనా పుండ్లు, చీలికలు (లీజన్స్) ఉంటే పొగాకు నమిలే అలవాటుకు దూరంగా ఉండితీరాలి. గుట్కా తినేవారికి కొన్నాళ్ల తర్వాత నోరు తెరవలేని స్థితి వస్తుంది. కారం ఏమాత్రం తగిలినా భరించలేకపోవడం, బుగ్గ గట్టిపడిపోవడం (ఫైబ్రోసిస్) వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే అది క్యాన్సర్‌కు తొలి దశ అని గుర్తించాలి, జాగ్రత్త పడాలి.


నోరు - థైరాయిడ్ సంబంధాలిలా...
మన శరీరంలో ఉన్న గ్రంథులన్నింటిలోనూ కీలకమైనది థైరాయిడ్. సాధారణంగా థైరాయిడ్ విషయంలో రెండు రుగ్మతలు ఉంటాయి. మొదటిది థైరాయిడ్ పూర్తిస్థాయిలో పనిచేయని హైపోథైరాయిడిజమ్. రెండోది థైరాయిడ్ మరీ అతి చురుకుగా వ్యవహరించే హైపర్‌థైరాయిడిజమ్. హైపర్ థైరాయిడిజమ్ ఉన్న రోగుల్లో పంటిలో రంధ్రాలు (క్యావిటీస్), చిగుర్ల సమస్యలు రావడం, థైరాయిడ్ పెద్దది కావడం, నోటిలో మంట రావడం (బర్నింగ్ మౌత్ సిండ్రోమ్), నోటిలో ఉండే ఎముకలైన మాగ్జిల్లరీ, మాండిబుల్‌కు ఆస్టియోపోరోసిస్ రావడం వంటి సమస్యలు చూడవచ్చు. అలాగే హైపోథైరాయిడిజమ్ ఉన్న రోగుల్లో లాలాజల గ్రంథుల వాపు, లాలాజల స్రావం మరీ ఎక్కువ కావడం, నాలుక మందం పెరగడం, నాలుక మంటపుట్టడం (ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ టంగ్), నోటికి రుచి ఎంతమాత్రమూ తెలియకుండా పోవడం (డిస్‌గెసియా), నోటిద్వారానే గాలి పీల్చుకోవాల్సి రావడం వంటి కండిషన్స్ కనిపిస్తాయి. అందుకే థైరాయిడ్ సమస్యలు వచ్చినప్పుడు ఫిజీషియన్‌తో పాటు ఒకసారి దంతవైద్యనిపుణులూ పరీక్షించడం అవసరం. హైపర్ లేదా హైపో థైరాయిడిజమ్‌లలో దేనితో బాధపడుతూన్నా, ఆ రోగులకు ఎపీనెఫ్రిన్, వాసోప్రెస్సార్స్ వంటి మందులు వాడాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మత్తు కలిగించే మందులు వాడాల్సి వచ్చినప్పుడు మరింత శ్రద్ధతో చికిత్స చేయాల్సి ఉంటుంది.


హైబీపీకీ - నోటి ఆరోగ్యానికీ గల సంబంధం
అధిక రక్తపోటుకూ (హైబీపీ), నోటి ఆరోగ్యానికీ నేరుగా సంబంధం లేకపోయినా పరోక్షంగా ఎంతో దగ్గరి సంబంధం ఉన్నట్లే. అధిక రక్తపోటుకు వాడే మందులు నోటిని ఎండిపోయినట్లుగా అనిపించేలా చేస్తాయి. ఆ మందులు వాడేవారిలో చాలామందికి రుచి కూడా సక్రమంగా తెలియదు. ఈ కండిషన్‌ను ‘డిస్‌జెసియా’ అంటారు. కొన్ని హైబీపీ మందులతో (ముఖ్యంగా క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్స్‌తో) చిగుర్లు పరిమితికి మించి పెరగవచ్చు. కొందరిలో ఈ చిగుర్ల పెరుగుదల, వాళ్లు ఆహారం నమలడానికి కూడా అడ్డుపడేంతగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ అదనపు చిగురును సర్జరీ ద్వారా తొలగించాల్సి రావచ్చు. అంటే... హైబీపీ మందులు వాడుతున్నప్పుడు నోరంతా ఎండిపోకుండా, రుచి తెలుస్తూ ఉందంటే మన ఆరోగ్యం బాగున్నట్లేనని భావించవచ్చు.


నోటి పరిశుభ్రత- డయాబెటిస్...
డయాబెటిస్ ఉన్నవారు తమ చక్కెరపాళ్లను అదుపులో పెట్టుకోకపోతే నోటికి సంబంధించిన అనేక సమస్యలు రావచ్చు. అవి...
లాలాజలం ఉత్పత్తిని దెబ్బతినవచ్చు. అందుకే చక్కెర వ్యాధి ఉన్న చాలామందిలో నోరు పొడిబారిపోతుంటుంది. అది క్రమంగా నోటిలో పుండ్లకు, దంతక్షయానికి దారితీయవచ్చు.


చిగుర్ల వ్యాధులు: చక్కెర నియంత్రణలో లేకపోతే జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వంటి చిగుర్ల ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు రావచ్చు. డయాబెటిస్ ఉన్నప్పుడు అది రక్తనాళాలను మందంగా చేయడం వల్ల రక్తప్రవాహం సరిగా జరగక, శరీరంలోని అనేక భాగాలకు పోషకాలు సరిగా అందకపోవచ్చు. ఫలితంగా ఈ రెండో పరిణామంతో మన అన్ని శరీర భాగాలకు అందాల్సిన పోషకాలు అందక శరీరానికి రోగనిరోధకశక్తి తగ్గవచ్చు. ఫలితంగా నోటి సమస్యలు, చిగుర్ల వ్యాధులు ఉన్నవారిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి వాటికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
పళ్లు వదులై కదులుతున్నప్పుడు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు లేదా నోటిలో ఏదైనా పుండై అది మానకుండా ఉంటే దంతవైద్యుడిని కలిసి డయాబెటిస్ ఉందేమోనని నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.
----------------------------------------------------
Source : Sakshi News Paper

Monday, January 7, 2013

Which one you will prefer?

Benefits of Apple & Banana

Saturday, January 5, 2013

Healthy, Delicious Snacks!

If you're looking for a savory snack with a little bit of a crunch, put down the Doritos and grab a bowl of roasted edamame. Get about two cups of shelled edamame and pour into a bowl. Mix it with two teaspoons of olive oil, salt and pepper, then put it on a baking sheet in the oven at 375°F for a half hour. Just make a batch and store them for later so you will be able to grab your roasted edamame on the go.

Friday, December 7, 2012