Showing posts with label General Science. Show all posts
Showing posts with label General Science. Show all posts

Friday, January 11, 2013

సముద్రజీవులు నీళ్లు తాగవా?

సముద్రపు నీటిలో ఉప్పు బాగా ఉండే కారణంగా ఆ నీటిని మనం తాగలేం. ఒకవేళ తాగినా మన శరీరం తట్టుకోలేదు. అందుకే ఎవరైనా పొరపాటున కొంచెం సముద్రపు నీటిని తాగినప్పుడు ఆ నీటి సాంద్రత తగ్గేందుకు చాలా ఎక్కువగా మంచినీటిని తాగిస్తారు. అలాంటపుడు సముద్రంలోనే ఉండే జీవాల మాటేమిటి?


ఇతర జీవాల్లో ఉండే మాంసం, నీరు వాటి శరీర అవసరాలని తీరుస్తాయన్నమాట. అయితే ఆహారాన్ని మింగేటపుడు శరీరంలోకి ప్రవేశించే ఉప్పును వదిలించుకునేందుకు మాత్రం వేర్వేరు జీవుల్లో వేర్వేరు ఏర్పాట్లు కనపడతాయి. ఉదాహరణకు మొసళ్ళ, తాబేళ్లు, కొన్నిరకాల పాముల్లో అవి కార్చే కన్నీటి ద్వారా వాటి శరీరంలోని అదనపు ఉప్పు బయటకు పోతుంది.

వస్తువు పగిలినప్పడు వచ్చే శబ్దాల్లో తేడాలు ఎందుకు?

వస్తువులు పగిలినపుడు వచ్చే శబ్దాల్లో తేడాలు ఉంటాయి. వాటికి అనేక కారణాలుంటాయి. గాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చలించినపుడు రకరకాల శబ్దాలు ఉత్పన్నమవుతాయి. సైకిల్ ట్యూబ్ లేదా బెలూన్ పగిలినపుడు వాటిలో గాలి హఠాత్తుగా బయటికి రావడంతో ‘పేలిన’ శబ్దం వస్తుంది.


అయితే విద్యుత్ బల్బులో గాలి ఉండదు గనుక అది పగిలితే దాని చుట్టూ ఉన్న గాలి ఒకేసారి దాని దిశగా దూసుకుపోవడం వల్ల ఢాం అని శ బ్దం వస్తుంది. విద్యుత్ బల్బు శూన్యంలో పగిలిపోతే, దాని చుట్టూ గాలి వుండని కారణంగా అప్పుడు ఎలాంటి శబ్దమూ రాదు. నీటిలో పగిలినప్పుడు దాని దిశగా నీరు దూసుకుపోయే కారణంగా మరో రకం శబ్దం వస్తుంది. ఆయా వస్తువుల ధర్మాలను బట్టి గాక, అవి పగిలేటపుడు వచ్చే శబ్దాలలో మార్పు వస్తుందన్నమాట. పాలిథిన్ కవర్లలో గాలిని, నీటిని నింపి పగలగొడితే వచ్చే శబ్దంలో తేడాను గమనించే ఉంటారు.

ముసలితనంలో ముడతలు ఎందుకు వస్తాయి?

కొలాజెన్ అనే పదార్థం చర్మానికి పటుత్వం అందిస్తుంది. అలాగే సాగే గుణాన్ని ఎలాస్టిన్ అందిస్తుంది. మన చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచేలా చేసే వాటిని గైకోనమైనోగ్జికాన్స్ (గాగ్) అని పిలుస్తారు. ఇరవై సంవత్సరాల వయసు దాటినప్పటి నుంచి మన శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గుతుంటుంది.


దీంతో చర్మంలో మార్పులు రావడం మొదలవు తుంది. అలాగే ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గడం గాగ్ తయారీ కూడా తగ్గుతుండటంతో చర్మం పటుత్వం తగ్గుతుంది. అందుకే వయసు మీదపడుతున్న కొద్దీ చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. దీనితో మన శరీరం ముడతలు పడుతుంటుంది.

Tuesday, January 8, 2013

కరెంటు షాక్‌కు గురైనప్పుడు...ఎలా

షాక్‌కు గురైన వాళ్లను పొరపాటున కూడా ముట్టుకోవద్దు. ఎందుకంటే

వారి నుంచి కరెంటు మనలోకి కూడా పాసయ్యే ప్రమాదం ఉంది.

ఏదైనా కర్రతో గానీ, చెక్కతో గానీ కొట్టి కరెంట్ ఫ్లో అవుతున్న వైర్‌నుంచి బాధితుడిని వేరు చేయాలి.

వెంటనే పల్స్ చూడాలి. పల్స్ అందకపోతే, కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) చేయాలి. అంటే... నోటి ద్వారా కాస్త ఒత్తిడితో గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపాలి. గుండె స్పందనలు ఆగిపోతే రెండంగుళాల లోతుగా ప్రభావం పడేట్లు ఛాతీపైన చేతులతో ప్రెషర్ ఇవ్వాలి.

ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఒళ్లు కాలితే (ఎలక్ట్రిక్ బర్న్స్), డాక్టర్ని అడక్కుండా మామూలు ఆయింట్‌మెంట్స్‌గాని, పూతమందులు గాని వాటికి రాయకూడదు.

ఎలక్ట్రిక్ షాక్‌కు గురైనవారు అకస్మాత్తుగా కింద పడిపోతే, వాళ్లని ఎక్కువ కదిలించకూడదు.

షాక్‌కు గురైన వారికి గుండె స్పందనల్లో తేడా రావడాన్ని వెంట్రిక్యులార్ అరిథ్మియా అంటారు. దాన్ని మానిటర్ ద్వారానే గుర్తించడం సాధ్యం. కాబట్టి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి.

బోరింగ్ పంపు నీరు అలా ఎందుకు ?

చాలా ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకు చేత్తో కొట్టే బోరింగ్ పంపు నీళ్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ బోరింగ్ పంపులో నుంచి వచ్చే నీళ్లు శీతాకాలంలో వేడిగా అనిపిస్తాయి. వేసవి కాలంలో చల్లగా అనిపిస్తాయి. శీతాకాలంలో భూగర్భంలోని నీటి ఉష్ణోగ్రత కన్నా, బయటి వాతావరణంలోని ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో బోరింగ్ పంపు కొట్టినపుడు వచ్చిన నీళ్లు వెచ్చగా అనిపిస్తాయి. అలాగే వేసవికాలంలో భూగర్భంలోని నీటి ఉష్ణోగ్రత కన్నా, బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవికాలంలో బోరింగ్ పంపు నీళ్లు చల్లగా అనిపిస్తాయి.

థర్మామీటర్ బల్బు దగ్గర నొక్కు ఉంటుంది... ఎందుకు?

మనకు జ్వరం వచ్చినపుడు క్లినికల్ థర్మామీటర్‌ని ఉపయోగించి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటాం. ఆ థర్మామీటర్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే, కింద భాగంలో పాదరసం ఉండే బల్బు దగ్గర నొక్కినట్లు కనిపిస్తుంది. అలా ఎందుకుందో చూద్దాం. జ్వరం వచ్చిన వ్యక్తి నాలుక కింద థర్మామీటర్‌ని ఉంచినపుడు శరీర ఉష్ణోగ్రతను బట్టి పాదరసం వ్యాకోచించి పైకి వెళుతుంది.


నోట్లో నుంచి బయటికి తీసిన వెంటనే వాతావరణంలోని ఉష్ణోగ్రతను బట్టి మళ్లీ కిందికి వచ్చేస్తుంది. అలా జరిగితే శరీరంలో ఎంత టెంపరేచర్ ఉందో తెలుసుకోవడం కష్టమవుతుంది. పాదరసం ఉండే బల్బు దగ్గర నొక్కినట్లు ఉండడం వల్ల థర్మామీటర్‌ని నోట్లోంచి తీసిన తర్వాత కూడా పాదరస మట్టం పడిపోదు. జ్వర తీవ్రతను సరిగా అంచనా వేయవచ్చు. అందుకే థర్మామీటర్‌లో ఆ నొక్కు ఉంటుంది.

పంక్చర్ అయిన ఫుట్‌బాల్ నుంచి బయటికి వెళ్లే గాలి చల్లగా ఉంటుంది. ఎందుకు?

చాలా మంది పిల్లలకి ఫుట్‌బాల్ ఆడడమంటే ఇష్టం. ఒక్కోసారి ముల్లో, రాయో గుచ్చుకుని ఫుట్ బాల్ పంక్చర్ అవడం సాధారణంగా అందరూ గమనించే సంగతే. అయితే బాల్‌లో నుంచి గాలి బయటికి పోతున్నప్పుడు ఆచోట చేయి పెట్టి చూస్తే గాలి చల్లగా తగులుతుంది. దానికి కారణమేంటో తెలుసుకుందాం.


ఫుట్‌బాల్‌లో గాలి నింపినప్పుడు తక్కువ స్థలంలో ఎక్కువ గాలి చేరుతుంది. అందువల్ల లోపల పీడనం ఎక్కువగా ఉంటుంది. బయట పీడనమేమో బాల్ లోపలి పీడనం కన్నా తక్కువగా ఉంటుంది. అధిక పీడనంలో ఉన్న గాలిని అల్ప పీడనం ఉన్న ప్రాంతంలోకి వ్యాకోచించడానికి వదిలినప్పుడు ఆ గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందుకే ఫుట్‌బాల్‌కి రంధ్రం పడినప్పుడు దాని నుంచి బయటికి పోయే గాలి చల్లగా అనిపిస్తుంది.

అస్తమిస్తున్న సమయంలో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?

సాయంత్ర ం పూట ఎర్రగా ఉన్న సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నట్లు కనిపించే దృశ్యాన్ని సాధారణంగా అందరూ ఇష్టపడతారు. మరి సూర్యుడు అస్తమిస్తున్నపుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడో తెలుసుకుందాం. సాయంత్రం వేళ సూర్య కిరణాలు ఏటవాలుగా పడుతుండటంవల్ల అవి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

అలా ప్రయాణించేటప్పుడు సూర్య కిరణాలలో ఎరుపు రంగు తప్ప మిగిలిన అన్ని వర్ణాలు ధూళి కణాల వల్ల చెల్లా చెదురయిపోతాయి. కాంతిలో ఉండే మిగతావర్ణాలకంటే ఎరుపు రంగుకి తరంగ ధైర్ఘ్యం ఎక్కువ కావడమే దీనికి కారణం. దాంతో ఎక్కువ తరంగ ధైర్ఘ్యం ఉన్న ఎరుపు రంగు మాత్రమే మిగిలి ఉండడం వల్ల అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

సీసాలో పడవలెలా పెడతారు?

గాజుసీసాలో పలు రకాల బొమ్మలు అమర్చి కళాకృతులుగా అమ్ముతుంటారు. వాటిలో ఓడలు, పడవలు, కట్టడాలు మనుషుల బొమ్మలు వంటివీ ఉంటాయి. అసలు సీసాలో బొమ్మల్ని ఎలా అమరుస్తారన్నదే ఆశ్చర్యపరుస్తుంది.

దీనికి ప్రత్యేకించి పుల్‌థ్రెడ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అంటే బొమ్మను అనేక మడతలుగా రూపొందిస్తారు. చిన్న దారం లాగితే ఆ బొమ్మ విచ్చుకుంటుంది. బొమ్మను సీసాలోకి పెట్టి ఈ దారాన్ని మెల్లగా లాగితే లోపల అమర్చిన బొమ్మ విచ్చుకుని పెద్దదవుతుంది. ఇప్పుడు మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడంతో వీటి తయారీలో కొత్తపద్ధతుల్ని వాడుతున్నారు. సన్నని మూతిగల సీసాలోకి అంతపెద్ద వస్తువులు ఇమడటం కష్టమే. కానీ చేసి చూపుతున్నారు.

ఫ్లెమింగోకి ఆ రంగులు ఎలా వస్తాయి?

తెలుపు, గులాబీ, కాషాయ రంగుల్లో పొడవైన కాళ్లతో అందంగా ఉండే పక్షులు ఫ్లెమింగోలు. వాటికి ఆ రంగులు వాటి ఆహారం వల్ల వస్తాయి.


సాధారణంగా ఇవి నీటిలో నివసించే ఆల్గే, పీతలు, రొయ్యలను తింటాయి. వీటిలో ఉండే కెరటినాయిడ్స్ అనే వర్ణ ద్రవ్యం వల్ల ఫ్లెమింగోలకు అందమైన వర్ణం వస్తుంది. ఈ కెరటినాయిడ్లను ఫ్లెమింగోల కాలేయంలోని ఎంజైమ్‌లు గులాబీ, కాషాయ వర్ణ పరమాణువులుగా విడగొట్టి వాటి ముక్కు, కాళ్లు రెక్కల్లో నిల్వ చేయడంతో ఇవి ఆ రంగులోకి మారతాయి.

మేఘాలు వివిధ ఆకారాల్లో ఎందుకు ఉంటాయి?

ఆకాశంలోకి చూసినప్పుడు మేఘాలు పలు ఆకారాల్లో కనపడుతుంటాయి. మేఘమంటే నీటి బిందువే. దాని చుట్టూ ఉన్న గాలి కారణంగా వాటి ఆకారాలు మారుతుంటాయి. వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతుంది. దీనికి తోడు మేఘాల్లోని నీటిబిందువులు ఘనీభవిస్తాయి. కావలసినంత చల్లదనం లేని మేఘాలు తక్కువ ఎత్తులో ఏర్పడి అప్పుడ ప్పుడు ఆకాశంలో దుప్పటిలా పరచుకోవడమూ చూస్తుంటాం.


మేఘాల్లోని నీటిబిందువులు గాలిలోని ఉష్ణోగ్రత అనుసరించి దగ్గరగా లేదా దూరంగా అమరి ఉంటాయి. వాతావరణంలో గాలివాటం ఎప్పుడూ మారుతుంటుంది. ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటుంది. అలాగే గాలి పయనించే వివిధ దిశల్లో లాగుతూ తోస్తూ ఉంటుంది. ఇలా వాతావరణంలోని గాలి వల్ల మేఘాలు వివిధ ఆకారాలలో కనిపిస్తాయి.

Friday, December 28, 2012

మహాపక్షవాతానికి రోబో రెక్కలు - క్వాడ్రీప్లీజియా

పక్షవాతం రోగులకు రెక్కాడదు. రెక్కాడకపోతే రోజువారీ చేయాల్సిన పనిలో ఏదీ జరగదు. ఒక కాలు, ఒక చేయి పనిచేయని మామూలు పక్షవాతం రోగుల పరిస్థితే ఇలా ఉంటే... ఇక రెండు చేతులతో పాటు రెండు కాళ్లూ పడిపోయిన క్వాడ్రీప్లీజిక్ రోగుల స్థితి ఎంత కష్టతరంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇలాంటి వారికి ఇప్పుడు కొత్తగా ‘రోబో రెక్కలు’ తోడు వస్తున్నాయి. వాటి సహాయంతో క్వాడ్రిప్లీజియా రోగులకే ఎంతో ప్రయోజనం. వాళ్లకే ఇన్ని ప్రయోజనాలుంటే మరి భవిష్యత్తులో మామూలు పక్షవాతం రోగుల రోజులూ బాగుంటాయని చెప్పే శుభవార్తల సమాహారమే ఈ కథనం... పక్షవాతం అనగానే అందరి మనసుల్లో స్ఫురించే రూపం ఏమిటంటే... ఒక మనిషికి చేయీ, కాలూ చచ్చుపడిపోయి ఉంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘హెమీప్లీజియా’ అంటారు. అదే రెండు కాళ్లూ చచ్చుబడితే దాన్ని పారాప్లీజియా అంటారు. మరి మనిషికి ఉన్న రెండు చేతులూ, రెండుకాళ్లూ చచ్చుబడితే...? అదే క్వాడ్రీప్లీజియా. కాలూ చేయి చచ్చుబడ్డ హెమీప్లీజియా కండిషన్‌లోనే మనిషి ఒకరిపై ఆధారపడి జీవించాల్సి రావడంతో ఎంతో వేదన అనుభవిస్తాడు. ఎవరికైనా సరే, కాళ్లూ, చేతులు... అన్నీ చచ్చుబడ్డ తర్వాత జీవితం ఎంతగా దుర్భరమవుతుందో ఊహించవచ్చు. అలాంటి వారి విషయంలోనూ కొత్త ఆశలు చిగురించే రోజులు మున్ముందు ఉన్నాయన్న సమాచారం ఎంత తియ్యగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. క్వాడ్రీప్లీజియా అంటే... కాళ్లూ, చేతులు చచ్చుబడిపోయే పరిస్థితిని క్వాడ్రీప్లీజియా అంటారు.

క్వాడ్రీ అంటే నాలుగు. ప్లీజియా అంటే చచ్చుబడటం అన్నమాట. అంటే రెండు కాళ్లూ, రెండు చేతులు మొత్తం నాలుగూ చచ్చుబడిపోయే పరిస్థితి ఇది. మనిషి మెదడులో సరిగ్గా రెండు అర్ధభాగాలుంటాయి. కుడివైపున ఉన్న శరీర భాగాలను మెదడు ఎడమ అర్ధగోళం నియంత్రిస్తుంది. అలాగే శరీరంలోని ఎడమవైపు ఉన్న అవయవాలను మెదడు కుడి అర్ధగోళం నియంత్రిస్తుంది. ఏదైనా కారణాల వల్ల మెదడు ఎడమ అర్ధగోళం ప్రభావితమైతే కుడివైపు శరీర భాగాలపై నియంత్రణ కోల్పోతారు. అలాగే కుడి అర్ధగోళం ప్రభావితమైతే ఎడమవైపు అవయవాలు కదలకుండా పోతాయి. దీన్నే పక్షవాతం అంటారు. ఏవైనా ఇతర కారణాల వల్ల రెండు అర్ధభాగాలూ ప్రభావితమైతే...? అదే ‘క్వాడ్రీప్లీజియా’.

కారణాలు...

- క్వాడ్రీప్లీజియాకు మూడు ప్రధానమైన కారణాలున్నాయి. అవి...

- పక్షవాతం చాలా తీవ్రంగా వచ్చి మెదడులోని రెండు అర్ధగోళాలూ ప్రభావితం కావడం.

- ఏదైనా ప్రమాదం (యాక్సిడెంట్) కారణంగా మెదడు దెబ్బతిని రెండువైపుల అర్ధగోళాలూ దెబ్బతినడం.
- వెన్నెముక (స్పైనల్‌కార్డ్) దెబ్బతిని కాళ్లూ, చేతులకు వెళ్లే నరాలు దెబ్బతినడం వల్ల అవి చచ్చుబడటం.

భవిష్యత్ ఆశాకిరణాలు
సాధారణంగా కాలూ లేదా చేయి చచ్చుబడ్డ కేసుల్లో మనకు స్ఫురించే ఆప్షన్ ఫిజియోథెరపీ లేదా కొన్ని మందులు. అదే ఒక కాలూ లేదా చేతిని తొలగించిన వారిలో మనకు స్ఫురించే ప్రత్యామ్నాయం కృత్రిమ అవయవాలు.

కానీ ప్రస్తుతం క్వాడ్రీప్లీజియా రోగులకే ఎంతో ఆశ కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంజనీరింగ్ రంగంలోని పురోగతి, రోబోటిక్స్‌లో వచ్చిన ప్రగతి హెమీప్లీజియా రోగుల్లోనూ, క్వాడ్రీప్లీజియా బాధితుల్లోనూ కొత్త ఆశలు నింపుతున్నాయి. ఇటీవలి కాలం వరకు కేవలం ఒక కాలు, ఒక చేయి దెబ్బతిన్న పక్షవాతం (హెమీప్లీజియా) కేసుల్లోనే రీ-హ్యాబిలిటేషన్‌తో కొంతవరకు మాత్రమే కనిపించే ఫలితాల విషయంలో మెరుగుదల సాధించేందుకు మరెంతగా అవకాశం ఉందో ఆలోచించుకుంటే ఆ రోగుల్లో నిరాశలు తక్షణం తొలగిపోతాయి.

పక్షవాతం (స్ట్రోక్), తలకు లేదా వెన్నెముకకు అయిన గాయం కారణంగా అవయవాలు చచ్చుబడినవారిలో అవి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధిలో చాలావరకు మామూలు స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో చాలా మంది రోగులు తమ రోజువారీ పనులను తమంతట తామే నిర్వహించుకోగలరు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం రోగులు తాము రోజూ చేసే పనులైన కాలకృత్యాలు, స్నానం, తినడం, నడవడం కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటివారికి రోబోటిక్స్ సహాయంతో నిర్మించిన కృత్రిమ పరికరాలు త్వరలోనే వారి పనులు వాళ్లంతట వాళ్లే చేసుకునే అవకాశాలను మెరుగుపరచనున్నాయి.

రీహ్యాబిలేటేషన్ కార్యకలాపాలకు ఒక వరం
పక్షవాతం రోగులు తమ పనులు తామే చేసుకునేలా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను రీ-హ్యాబిలిటేషన్ అంటారు. ఈ రోగుల్లో ఇదెంతో కీలకం. ఇటీవలే 1990 నాటి నుంచి వైద్యరంగంలోకి రోటోటిక్స్ ప్రవేశించి, అంగవైకల్యం ఉన్నవారికి రీ-హ్యాబిలిటేషన్ కల్పించేందుకు దోహదం చేయడం మొదలుపెట్టాయి. ఈ రంగంలో ఎంతో పరిశోధన జరుగుతోంది. మనిషి చేసే అనేక పనులు రోబోతో (అంటే పూర్తి రోబో కాకపోయినా రోబో చేయి, రోబో కాలు వంటివాటితో) చేయించడం మొదలైంది.

ఒక కాలు లేదా చేయి తెగిన వారిలో (యాంప్యుటీస్‌లో)
ఏదైనా కారణాల వల్ల ఒక కాలు లేదా ఒక చేయి వంటివి తొలగించడాన్ని యాంప్యుటేషన్ అంటారు. ఇలాంటివారికి రోబోటిక్ కాలు లేదా రోబోటిక్ చేయిని అమర్చడం మామూలే. సాధారణ కాలి కదలికల విషయానికి వస్తే మెదడు నుంచి వెన్నుపాము ద్వారా అందే ఆదేశాలకు అనుగుణంగా దాని కదలికలుంటాయి. కండరాల కదలికలన్నీ మెదడు ఆజ్ఞలకు అనుగుణంగా సాగుతాయి. ఇక అంగవైకల్యం ఉన్నవారి విషయానికి వస్తే వారి మెదడులో ఉత్పన్నమయ్యే ఆజ్ఞల సంకేతాలు (సిగ్నల్స్) రోబో కాలు లేదా రోబో చేయిలోని ఎలక్ట్రో మయో గ్రఫీ (ఈఎమ్‌జీ) సెన్సర్స్ అనే వాటికి చేరుతాయి. (ఈ ఈఎమ్‌జీ సెన్సర్ పరికరాన్ని కృత్రిమ కాలు/చేయిలో ఒకచోట అమర్చుతారు).

కృత్రిమ అవయవానికి సంబంధించి రోబో కాలు నిర్దిష్టంగా ఇలా కదలాలంటూ ఏదైనా సిగ్నల్ అందగానే సదరు రోబో అవయవం అలాగే స్పందిస్తుంది. ఉదాహరణకు ఏదైనా గ్లాసులాంటి దాన్ని పట్టుకోవడం, బిగించి ఉంచడం వంటి ఆజ్ఞలకు ఎలా ఎలా స్పందించాలో ఆ కృత్రిమ రోబో అవయవానికి నేర్పుతారు. ఈ శిక్షణలో ఏయే ఆజ్ఞకు ఎలా స్పందించాలో అన్న విషయాన్ని రోబో అవయవం 3 నుంచి 6 నెలల్లో నేర్చుకుంటుంది. ఆ తర్వాత అవే ఆజ్ఞలకు అలాగే స్పందిస్తుంటుంది.

ఇంకా ప్రయోగదశల్లోనే...
గ్లాసు పట్టుకోవడం లాంటి ప్రాథమికమైన కొన్ని పనులను రోబో అవయవంతో చేయించగలిగినా సంక్లిష్టమైన కదలికలు నేర్పడం ఇంకా పూర్తిగా సాధ్యపడలేదు. అంటే... అన్నం కలపడం, రాయడం వంటివి ఇంకా రోబో అవయవానికి నేర్పడం ఇంకా పూర్తిగా జరగలేదు. ప్రస్తుతానికి కృత్రిమ రోబో కాలికి నిలబడటం, నడక వంటివి నేర్పగలిగినా మెట్లెక్కడం, ఫుట్‌బాల్ వంటివి ఆడటం వంటివి నేర్పడం అన్న విషయాలు ప్రయోగదశలోనే ఉన్నాయి.

రోబోల ఉపయోగం ఇలా...
- ఏదైనా కారణాల వల్ల మెదడు లేదా వెన్నుపూస దెబ్బతిని మెదడు నుంచి సిగ్నల్ కొన్ని అవయవాలకు అందని వారిలో రోబో అవయవాల సహాయంతో కొన్ని సాధారణ పనులను చేయడం రెండు రకాలుగా జరుగుతుంది.
- మొదటిది బలహీనంగా ఉన్న కండరాలకు ఎలక్ట్రో మయోగ్రఫీ (ఈఎమ్‌జీ) ఎలక్ట్రోడ్‌లను అమర్చి దాన్నే ప్రేరేపించి పనులు చేయించడం.

రెండోది... సిగ్నల్స్ పంపే ఎలక్ట్రోడ్‌లను మెదడులోనే అమర్చి... ఆ సిగ్నల్స్ వైకల్యం ఉన్న చోట అమర్చిన రోబో అవయవానికి అందేలా చేసి ఆ సంకేతాలకు అనుగుణంగా కదిలేలా చేసి అనుకున్న పనులు చేయించడం. అయితే ఈ రెండో రకమైన పనులు ఇంకా పూర్తి సునిశితత్వంతో... మొత్తం సాధారణ అవయవంలాగే చేయించడం అంతగా సాధ్యపడటం లేదు. కానీ రోజు రోజుకూ నిన్నటి మీద మెరుగుదల మాత్రం ఉంటోంది. దాంతో కొద్దిరోజుల్లోనే కృత్రిమరోబో అవయవం సైతం స్వాభావిక అవయవం లాగే పనిచేసే (చేయించే) రోజు వస్తుందన్నది అటు ఇంజనీరింగ్ నిపుణులు, ఇటు వైద్య నిపుణుల్లో ఉన్న అభిప్రాయం. ఇదే రోగుల పాలిట శుభవార్త!

మరో పరిశోధన ఫలితం...
ఇటీవలే జేన్ షెర్మన్ అనే 52 ఏళ్ల మహిళకు కృత్రిమ రోబోచేతిని అమర్చారు. ఆమె పదమూడేళ్ల క్రితం క్వాడ్రీప్లీజియాకు లోనై చక్రాల కుర్చీకే పరిమితమైంది. ప్రతి విషయంలోనూ ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే యూనివర్సిటీ ఆఫ్ పిట్‌బర్గ్ మెడికల్ సెంటర్‌కు చెందిన నిపుణుల సహాయంతో ఆమెకు ఇటీవలే 7-డి (సెవన్ డైమన్షన్) రోబోటిక్ చేతిని అమర్చారు. ఆ చేతికి ఇచ్చిన శిక్షణ సహాయంతో ఆమె తనంతట తానే ఒక చాక్లెట్‌ను తీసుకుని నోటికి అందించి తినడం సాధ్యమైంది. ఈ పరిశోధన ఫలితాల్లోని పురోగతి ఇలాగే కొనసాగితే పక్షవాతం రోగులు, క్వాడ్రీప్లీజియా రోగులు తమంతట తామే చాలా పనులు చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదు.




ఇరాక్ యుద్ధంలో కుడికాలు కోల్పోయిన ఒక సైనికుడి కాలి స్థానంలో ఒక రోబో కాలిని (రోబోటిక్ లెగ్‌ను) అమర్చారు. దాని సహాయంతో మామూలుగా నడవడం నేర్పడానికి ఆర్నెల్ల వ్యవధి పట్టింది. ఇప్పుడు అతడు పూర్తిగా మామూలుగా నిలబడటం, నడవగలగడం చేస్తున్నాడు. అతడికి ఫుట్‌బాల్ అంటే ఎంతో ఆసక్తి ఉండటంతో ప్రస్తుతం బంతిని తన్నడం వంటి కదలికలకు తగిన శిక్షణ ఇస్తున్నారు. కొంతమేరకు ఇది సాధ్యపడింది కూడా. దాంతో అతడిలోని ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అయ్యా యి. పైగా అతడు తన రోబో కాలి సహాయంతో కదల గలగడం వల్ల ఎప్పుడూ ఒకే చోట కదలకుండా ఉన్నవారిలో కనిపించే ఆస్టియోపోరోసిస్, స్థూలకాయం, హార్ట్‌ఎటాక్ వంటి రిస్క్‌లనుంచి తప్పించినట్లయ్యింది.


Source : Sakshi News paper

ఈ రోజు చాలా చిన్నదోచ్! - డిసెంబర్ 21

ఈ రోజు... అదే డిసెంబరు 21కి ఉన్న ప్రత్యేకత ఏమిటి? అబ్బబ్బే... యుగాంతంపై వినిపిస్తున్న పుకార్ల సంగతి కాదు. ఈ ఏడాది మొత్తానికి అతి తక్కువ పగటికాలం ఉండేది ఈ రోజే! అదేంటి? రోజుకు 24 గంటలే కదా ఉంటాయి.. అలాంటప్పుడు తేడాలెందుకు? అనేనా మీ సందేహం?


భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూందన్న సంగతి మీకూ తెలిసే ఉంటుంది. ఈ తిరుగుడు ఓ వృత్తం మాదిరిగా కాకుండా దీర్ఘవృత్తం ఆకారంలో ఉంటుందనీ మనకు తెలుసు. ఈ దీర్ఘవృత్తాకార కక్ష్య ఫలితంగానే పగటి, రాత్రివేళల్లో అప్పుడప్పుడూ తేడాలొస్తూంటాయి.


ఎలాగంటే... దీర్ఘవృత్తాకారాన్ని ఒకసారి ఊహించుకోండి.. దీని మధ్యభాగంలో అతితక్కువ దూరం... రెండు చివర్ల మధ్య దూరం ఎక్కువగా కనిపిస్తోంది కదా. ఇటువంటి కక్ష్య మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు భూమి ఏదో ఒక దశలో ఈ నాలుగు స్థానాల్లోకి చేరుతుంది. ఆయా దశలనుబట్టి... ఆయా రోజుల్లో మనకు సూర్యుడి నుంచి అందే వెలుగులో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల పగటి, రాత్రి సమయాల్లోనూ తేడాలు వస్తాయన్నమాట. అంటే ఏడాదిలో ఒకరోజు అతితక్కువ పగటి కాలం ఉంటుంది. మరోరోజు అతి ఎక్కువ రాత్రి సమయం ఉంటుందన్నమాట.


భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న వారికి ఈ తేడాలు ఎక్కువగా లేకున్నప్పటికీ ఉత్తరార్ధ, దక్షిణార్ధగోళాల్లో ధ్రువప్రాంతాల వైపు వెళ్లే కొద్దీ తేడాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు డిసెంబరు 21వ తేదీనే తీసుకుందాం. ఈ రోజున పగటి కాలం భూమధ్య రేఖ ప్రాంతంలో దాదాపు 11 గంటల 21 నిమిషాల వరకూ ఉంటే ఇంగ్లాండ్‌లో పగటి కాలం కేవలం ఏడు గంటల 51 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అదే దక్షిణార్ధగోళంలో ఉండే ఆస్ట్రేలియాలో ఇదే రోజున పగటి కాలం 14 గంటల 19 నిమిషాల వరకూ ఉండటం గమనార్హం. గ్రీకులతో మొదలుకొని అనేక ప్రాచీన నాగరకతల్లో ఈ ఖగోళ దృగ్విషయానికి కొంత ప్రాముఖ్యత ఉంది. పాకిస్థాన్‌లోని కలాశ్ తెగ ప్రజలు ఈ రోజున పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాగే జొరాష్ట్రియన్, జుడాయిజమ్, క్రైస్తవ మతాల్లోనూ ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.

చేపల తొట్టెకు నేరుగా ఎండ ఎందుకు తగలకూడదు?

గాజుతొట్టెల్లో చాలామంది చేపల్ని పెంచుతుంటారు. దీన్నే అక్వేరియం అంటారు. ఇలా చేపల్ని పెంచడానికి కొన్ని అంశాలు తెలియాలి.


అక్వేరియంలో పెంచేందుకు గోల్డ్‌ఫిష్, గప్పీస్ వంటి కొన్నిరకాల చేపలను మాత్రమే పెంచగలం. వాటికి ప్రత్యేక ఆహారాన్ని ఇవ్వాలి. పదినిమిషాల్లో తినగలిగినంత మాత్రమే పెట్టాలి. అక్వేరియమ్‌ను సురక్షితస్థానంలో నేరుగా ఎండతగలని చోట ఉంచాలి. తొట్టెకి ఎండ తగిలితే అందులో నాచు పెరిగే అవకాశం ఉంది.


ఈ కారణంగా తొట్టెలోని నీటి ఉష్ణోగ్రత ఉండాల్సినదానికంటే పెరిగిపోతుంది. అక్వేరియంపై గాజు లేదా ప్లాస్టిక్‌మూతను పెట్టడం మంచిది. ఇది నీటి ఉష్ణోగ్రతను సమానంగా ఉంచుతుంది. నీటిని మార్చడం గురించి అక్వేరియం అమ్మే దుకాణాల వారితో సంప్రదించడం మంచిది.

గవ్వల రంధ్రాలు కుడివైపునే తెరుచుకుంటాయా?

సముద్రతీరాల్లో రకరకాల గవ్వలు దొరుకుతుంటాయి. వాటిని ఏరుకోవడంలో పిల్లలు పోటీపడుతుంటారు. వాటితో ఆడుకోవడం అదో సరదా. ఇవి రకరకాల ఆకృతుల్లో కనపడతాయి. ఉదాహరణకు రెక్కలు, తలపాగాలు, దారపు కండెలు, బొంగరాలు, తులిప్ పువ్వులు, శంఖాలు. గవ్వలు అతి మెత్తని శరీరం ఉండే కొన్ని జాతులకు చెందిన జీవులను చలి నుంచి శత్రువుల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన గట్టి నిర్మాణాలు. ఒక విధంగా ఆ కవచాలు వాటిలోని జీవులకు ఒక ఇల్లుగా కూడా ఉపయోగపడతాయి. గవ్వ పెంకులపై ఉండే వలయాలు సాధారణంగా సవ్యదిశలోనే వుంటూ, వాటి ముఖభాగం కుడివైపు తెరచుకుని ఉంటాయి. చాలా అరుదుగా ఒకే జాతికి చెందిన కొన్ని లక్షలు లేదా కోట్ల గవ్వల్లో ఒకటి చొప్పున వాటి వలయాలు అపసవ్య దిశలో కొనసాగి వాటి ముఖభాగం ఎడమవైపు ఉంటుంది.

Thursday, December 27, 2012

ప్లగ్‌లో మూడో పిన్ను దేనికి..?

ఒకప్పుడు ఎలక్ట్రిక్ ప్లగ్‌లు రెండు పిన్నులతోనే ఉన్నప్పటికీ, ఆ తరువాత మూడు పిన్నుల ప్లగ్‌లు వాడుకలోకి వచ్చాయి. ఈ రెండుడురకాల ప్లగ్గులో ఏది వాడినా ఎలక్ట్రిక్ పరికరం పనిచేస్తుంది.


అయితే మూడు పిన్నులప్లగ్‌ని ఉపయోగించడంవల్ల ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. వీటిలో కింద ఉండే రెండు పిన్నులకంటే పైన ఉండే పిన్ను కొంచెం లావుగా ఉంటుంది. ప్లగ్‌లో మూడు పిన్నులు ఉండడంతో సంబంధిత పరికరానికీ, ఎర్త్‌వైర్‌కీ మధ్య నేరుగా సంబంధం ఏర్పడుతుంది.


ఈ ప్లగ్‌లో కింద ఉండే రెండుపిన్నులూ వస్తువుకు కావలసిన విద్యుత్ ప్రవాహాన్ని అందిస్తే, మూడోది మాత్రం వస్తువు పైభాగంలో విద్యుత్ ప్రవహించకుండా చూస్తుంది. ఇస్త్రీపెట్టె వంటి పరికరాన్ని వాడుతున్నపుడు ఏ కారణం వల్లనైనా దాని పైభాగంలో కూడా విద్యుత్ ప్రవహించినా ఆ పరికరం పైభాగాన్ని తాకితే షాక్ కొడుతుంది. మూడు పిన్నుల ప్లగ్‌ను వాడటం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తదు.

Monday, December 24, 2012

టెర్మినేటర్ విత్తనాలంటే..?

కాయలు కాసే లేదా కంకులు వేసే ప్రతి చెట్టు నుంచి అనేక గింజలు ఉత్పత్తి అవుతుండటం, వాటిలో దాదాపు అన్నీ తిరిగి అలాంటి మొక్కగా పుట్టగలిగే శక్తిసామర్థ్యాలను కలిగి ఉండటం సహజం. అయితే ఒక చెట్టు నుంచి పుష్కలంగా గింజలు వచ్చినా అందులో ఒక్కటి కూడా తిరిగి మొక్కగా పుట్టడానికి పనికిరాకపోతే ఏమవుతుంది?

అంతకు ముందు ఆ గింజల్ని అమ్మిన కంపెనీ నుంచే వాటి విత్తనాలను మళ్ల్లీ కొనాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని కల్పించేవే టెర్మినేటర్ విత్తనాలు. ఇవి కొన్ని కంపెనీల ఆధ్వర్యంలో కొందరు శాస్త్రజ్ఞులు ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాలు. వీటిని మన పొలంలో వేసుకుంటే పంట దిగుబడి అధికం కావచ్చు.

ఆయా కంపెనీలవారు చె బుతున్నట్టు ఈ మొక్కలు పీడలను సమర్థంగా తట్టుకోవచ్చు. కానీ రెండోసారి వేయాలంటే మాత్రం మళ్లీ ఆ కంపెనీవే వేయాలి. మనకంటూ ఎలాంటి విత్తనాలూ లేకపోవడం వల్ల కొంతకాలానికి వ్యవసాయం కోసం ఆయా కంపెనీల మీదే తప్పక ఆధారపడాల్సివస్తుంది. అందుకే టెర్మినేటర్ విత్తనాల పట్ల రైతాంగం ఆసక్తి చూపట్లేదు.

జంతువులు నక్షత్రాలను అనుసరిస్తాయా?

ప్రాచీన కాలం నుంచి నక్షత్రాలను అనుసరించి ప్రయాణించడమనేది ఉంది. ముఖ్యంగా నావికులు కొన్ని శతాబ్దాలపాటు నక్షత్రాలను అనుసరించే ప్రయాణించేవారు.


అయితే ఈ నైపుణ్యం కేవలం మనుషులకే కాకుండా, జంతువులకు కూడా ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. సీల్... రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను అనుసరించే సముద్రంలోకి వెళుతుందని జర్మనీ రొస్టాక్ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా మగ సీల్ ఆకాశంలో ప్రస్ఫుటంగా కనిపించే నక్షత్రాలను చూస్తూ తాను చేరవలసిన ప్రాంతానికి వెళ్లగలుగుతుందని తేలింది.

మెదడు చురుగ్గా ఉండాలంటే...

మన శరీరంలో పనిచేసే కొద్దీ చురుగ్గా ఉండేది మెదడే. శరీరంలో జరిగే వివిధ పనులను నిరంతరం నియంత్రించే మన మెదడుకి ఆఖరికి మనం నిద్రపోయేటపుడు కూడా కొన్ని పనులు చేస్తూనే ఉంటుంది. అందుకే మన శరీరంలోని రక్తంలో 20 శాతాన్ని, ఆక్సిజన్‌లో 20 శాతాన్ని ఒక్క మెదడే ఉపయోగించుకుంటుంది.


మన మెదడులో 20వేల కోట్ల నాడీకణాలతోసహా మొత్తం లక్ష మైళ్ల పొడవుండే రక్తనాళాలుంటాయి. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంతో సహా అనేక ముఖ్యమైన పనులను చేసే మెదడు నిరంతరం చురుగ్గా ఉండాలి.


అందుకు మనం బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ తగినంత పనిచేయాలి. సరైన వ్యాయామం చేయాలి. తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. వివిధ రకాల పజిల్స్ పరిష్కరించడం, కొత్తవిద్యలు నేర్చకోవడం, ఆలోచించడం, రాయడం వంటివన్నీ మెదడును ఉత్తేజపరిచి చురుగ్గా ఉంచుతాయి.

సింథటిక్ వస్త్రాలతో చిక్కులా?

మనం ఉపయోగించే వస్త్రాల్లో సింథటిక్ వస్త్రాలూ ఉన్నాయి. అంటే పట్టు, ఉన్ని దారాలతో నేసినవి కాకుండా కృత్రిమ దారాలతో చేసినవన్నమాట. ఉదాహరణకి పాలియెస్టర్, టెరీన్, నైలాన్ వంటి వస్త్రాలు. అయితే ఈ వస్త్రాలకి కూడా సహజవస్త్రాల లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆయా రసాయనాలను బట్టి, వాటిని తయారుచేసే విధానాన్ని బట్టి సింథటిక్ వస్త్రాలు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి.


పాలియెస్టర్ వస్త్రాలను ఎంత వాడినప్పటికీ అవి నలగవు. వాటిలో ఆ శక్తి ఉంటుంది. బాగుంటున్నాయని నైలాన్, టెరికాట్, పాలియెస్టర్ వస్త్రాలు వాడుతున్నాం గానీ నిజానికి అవి అంత మంచిది కాదు. ప్లాస్టిక్‌లానే పాలియెస్టర్ కూడా ప్రకృతిలో కలిసిపోదు. పైగా మన శరీరానికిగాని, చర్మానికి గాని అంత సురక్షితం కాదు. వీటిని అతిగా వాడితే చర్మసమస్యలతోపాటు, ఇతర ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి.