Showing posts with label Music Instruments. Show all posts
Showing posts with label Music Instruments. Show all posts

Monday, February 18, 2013

సింగినాదం - సంగీత వాద్యం

సింగినాదం లేదా సింహనాదం ఒక సుషిర వాద్యం. బాకాను పోలి ఉంటుంది. పెద్ద ధ్వనులు చేయడానికి ఉపయోగపడే వాద్యం. దీని మొదలు సన్నగాను, చివర వెడల్పుగాను ఉంటుంది. ఈ వాద్యం ద్వారా అనేక ధ్వనులను సృష్టిస్తారు.

పూర్వం వర్తకులు ఆంధ్రప్రాంతానికి వచ్చినపుడు తమ రాకను తెలుపుతూ పెద్ద పెద్ద బర్రె కొమ్ములతో ఊదేవారట.

పెద్ద పెద్ద ధ్వనులు రావడం వల్ల వీటిని సింహనాదాలుగా వ్యవహరించి ఉండవచ్చు. అదే సింగినాదంగా రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు.

రామానుజ మతస్థులు తమ వైష్ణవ గురువుల రాకను సూచించేందుకు ఈ వాద్యాన్ని ఉపయోగించేవారట.

Sunday, February 10, 2013

విచిత్ర వీణ - సంగీత వాద్యం

ఉత్తర భారతదేశానికి చెందిన హిందూస్తానీ సంగీత సంప్రదాయానికి సంబంధించిన తంత్రి వాద్యమే విచిత్రవీణ.

దీన్నే గోటు అనీ అంటారు. ఇది కర్ణాటక సంగీతానికి సంబంధించిన చిత్రవీణకు దగ్గరగా ఉంటుంది. ఇది పురాతన ఏక త్రంతవీణ కి ఆధునిక రూపం.

సాధారణ వీణలో రెండు అసమానమైన తంబురాలు ఉంటాయి. కానీ విచిత్రవీణలో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరి సమానంగా ఉంటాయి. వీణ రెండు కొనలు నెమలి ఆకృతిలో ఉంటాయి.

పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది. విచిత్రవీణను వాద్యకారుడు తన ఒడిలో కాకుండా తన ముందు నేల మీద పెట్టి వాయిస్తాడు.

దీనికి మొత్తం 22 తంత్రులు ఉంటాయి వాటిలో నాలుగే ముఖ్యమైనవి. వాటితో అటు మరో అయిదు సహాయక తంత్రులు కూడా ఉంటాయి.

కుడిచేతి చూపుడు, మధ్య వేళ్లను ఉపయోగించి ముఖతంత్రులను వాయిస్తూ చిటికెనవేలి కింది వరుసన గల తంత్రులను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనె వాడతారు.

సారంగి - సంగీత వాద్యం

భారతీయ సంగీతవాద్యాలలో సారంగి కూడా ప్రధానమైనదే. ఇది వొంపు తిరిగి ఉండే వాద్యపరికరం.

దీన్ని నేర్చుకోవడం అంత సులభం కాదు. కేవలం రెండున్నర అడుగుల ఉండే ఈ చిన్న వాద్యపరికరాన్ని ఫిడేలు వలె కమానుతో వాయిస్తారు. అయితే దీని కమాను బాణంలా ఉంటుంది. ఈ కమానుకు కూడా గుర్రపు తోక వెంట్రుకలు తీగెలుగా ఉంటాయి.

సారంగిని నల్లకొయ్యతో తయారుచేస్తారు. చూడ్డానికి రెండున్నర అడుగుల పెట్టెలా ఉంటుంది. దీని వెడల్పు ఆరు అంగుళాలు ఉంటుంది. కొన్ని కాస్తంత పెద్దవి కూడా ఉన్నాయి. సారంగి కింది భాగం లోపల ఖాళీగా ఉంటుంది.

దీనివల్ల శబ్దం వీనులవిందుగా ప్రతిస్పందిస్తుంటుంది. దీనికి పల్చని మేకచర్మం తొడుగు ఉంటుంది. సారంగి చివరిభాగం గిటార్‌కివలె పైకి వొంపు ఉంటుంది. అక్కడి నుంచి తలభాగానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు తీగెలు ఉంటాయి. ఇవేగాకుండా మరో 35 తీగెలు ఉంటాయి.

దండానికి ఎడమభాగం పక్కన 12 మీటలు, సారంగి చివర రెండువైపులా నాలుగేసి మీటలు ఉంటాయి.
విద్వాంసుడు బాణంవంటి కమానుతో ప్రధాన ఆరుతీగెలమీదా వాయిస్తున్నపుడు రాగాన్ని అనుసరించి మీటలు సవరించినపుడు మిగతా తీగెలు సహకరించి వీనులవిందుచేస్తాయి.

సారంగిపై కొన్ని ప్రత్యేక రాగాలు మరింత వినసొంపుగా ఉంటాయి. దీన్ని వాయించడంలో ఎన్నో ప్రత్యేకతలు పాటించాల్సి ఉంటుంది.

పియానో - సంగీత వాద్యం

పియానోను తొలినాళ్లలో పియానోఫోర్టి అని పిలిచేవారు. సుమారు 1700-1720 మధ్యకాలంలో ఉన్న హార్ప్ సికోర్డ్ అనే వాద్యం పియానోఫోర్ట్‌గా రూపాంతరం చెందిందని అంటారు. ఫ్లారెన్స్ రాజు ఫెర్డినాండ్ ఆస్థానంలోని బి.ఎల్. క్రిస్టోఫర్ దీన్ని తయారు చేశాడు.
పారిశ్రామిక విప్లవం మూలంగా ఉత్తమ నాణ్యత కలిగిన పియానో వైరు, కాస్ట్ ఐరన్ ఫ్రేమ్‌లు అందుబాటులోకి రావ డంతో పియానో స్థాయి 5 ఆక్టేవ్‌ల నుంచి 8 ఆక్టేవ్‌లకు పెరిగింది. నిటారుగా ఉండే పియానోను 1780 ప్రాంతాల్లో ఆస్ట్రియాకు చెందిన జోహాన్ స్మిత్ రూపొందించాడు.

1802లో లండన్‌కు చెందిన థామస్‌లౌడ్ ఆ పియానో తీగెలు అడ్డంగా అమర్చి సరికొత్త రూపు తెచ్చాడు. 1881లో కేంబ్రిడ్జ్‌కి చెందిన పియానో ప్లేయర్ జాన్ మెక్‌టామ్నే తయారుచేసిన పియానోకి యాంత్రిక సంగీతపరికరంగా పేరు వచ్చింది. సౌకర్యవంతమైన చిల్లులు కలిగిన సన్నని కాయితాలను అమర్చడం ద్వారా ఇది పనిచేసేది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కి చెందిన లెవీనాక్స్ దీన్ని మరింత మెరుగుపరిచాడు. కాగా విద్యుత్ తో పనిచేసే పియానోను విలియం ఫ్లెమింగ్ కనుగొన్నాడు.

శాక్సోఫోన్ - సంగీత వాద్యం

పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాల్లో శాక్సోఫోన్ వాద్యాన్ని చూస్తారు. 19వ శతాబ్దం తొలినాళ్లలో ఫ్రాన్స్‌లో సంగీత కార్యక్రమాల్లో దీన్ని కూడా ప్రదర్శిస్తుండేవారు. ఇది తొలినాళ్లలో సింగిల్ రీడ్ క్లారినెట్‌లా వేళ్లను ఎక్కువ ఉపయోగించే సంగీతవాద్యపరికరంగా ఉండేది. దీని శబ్దం ఇత్తడి, కొయ్యలతో తయారుచేసిన వాద్యసాధనాలకు అనుగుణంగా ఉండేది. క్రమేపీ ఈ వాద్యం ఎన్నో మార్పులు చెంది సోలో ప్రదర్శనకు వీలయింది.

శాక్సోఫోన్స్ ఎనిమిది సైజుల్లో, గాలి పరికరాల శబ్దస్థాయికి తగినవిధంగా తయారుచేసేవారు. సాధారణంగా మనకు కనిపించేవి ఆల్టో, టీనర్ శాక్సోఫోన్స్. వీటిని జాజ్ బాండ్స్‌లో, డాన్స్ ఆర్కెస్ట్రాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. జాజ్ వాయించేవారు శాక్సోఫోన్స్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు.

నాల్ - సంగీత వాద్యం

ఇది రెండు తలల డ్రమ్ వాద్యం. ఈ వాద్యపరికరాన్ని మృదంగం వలె అడ్డంగా పట్టుకోవాలి. ఇది రెండువైపులా చేతులతో తడుతూ వాయించే వాద్యపరికరం.

ఇది జానపద సంగీత వాద్యం. దీన్ని గ్రామీణులు వారి శుభకార్యాల్లో పాడుకునే సమయంలో వాయిస్తుంటారు.

ఈ వాయిద్యానికి ఉపయోగించే షెల్స్ ఉత్తర ప్రదేశ్‌లో తయారుచేస్తారు. సాధారణంగా గ్రామాల్లో లభించే వేప, ఎర్రచందనం చెక్కతోనే తయారుచేస్తారు. వీటి తలలను మేకతోలుతో, నట్లు, బోల్టులతో బిగిస్తారు. తద్వారా మంచి నాదం వస్తుంది. ఈ నట్లు, బోల్టులను అవసరమైనపుడు బిగిస్తూ, మారుస్త్తూ, నాదాన్ని మరింత సరిచేస్తుంటారు.

ఇది చూడ్డానికి పక్వాజ్ అనే సంగీత వాద్య పరికరాన్ని పోలి ఉంటుంది. పొడవు పరంగా చూస్తే నాల్ పక్వాజ్ కంటే చిన్నది. చిత్రమే మంటే నాల్ ఒకవైపు ఊహించనివిధంగా తారస్థాయి నాదం ఉంటుంది. మరొకవంక డోలక్ వలె మంద్ర స్థాయి ఉంటుంది.

Friday, February 1, 2013

తబలా - సంగీత వాద్యం

తబలా అన్న పేరు అరబ్బీ భాషా పదమైన తబ్ల్ (డ్)్ర నుంచి ఉద్భవించింది. దీనిని రెండు చేతులతోనూ వాయిస్తారు. తబలా లేదా తబ్లా భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన వాద్యం. ఇది భారత ఉపఖండంలో ప్రఖ్యాతి గాంచింది.

ప్రత్యేకించి హిందూస్థానీ సంగీతంలో ప్రత్యేకస్థానం. ఈ వాద్యం చేతితో వాయించే జతడ్రమ్ములు కలిగి ఉంటుంది.

ఈ డ్రమ్ములు చెక్కతోను, వీటి పైభాగం గొర్రెతోలుతోనూ తయారవుతాయి. ఈ రెండు డ్రమ్ములు వేర్వేరు సైజుల్లో ఉంటాయి.తబలా వాయించడంలో ఒక ఘరానా లేదా పాఠశాలకు చెందిన పండితుడు లేదా విద్వాంసుడిని ఉస్తాద్ అంటారు.

తబలా పైనుండే నలుపురంగు వృత్తాకారాన్ని స్యాహీ అంటారు. దీనికి గాబ్ అని కూడా పేరుంది. ఇది తబలా యొక్క శీర్షభాగం. దీనిని ష్యానీ అని కూడా అంటారు.

తబలాకు ప్రపంచ ప్రసిద్ధ గుర్తింపు తెచ్చిన వారిలో ప్రముఖులు జకీర్ హుసేన్, ఉస్తాద్ అలారఖా, త్రిలోక్ గుప్తా మొదలైన వారు.

నాదస్వరం - సంగీత వాద్యం

కర్ణాటక సంగీతంలో విశేషస్థానం కలిగింది నాదస్వరం. ఈ వాద్యం అత్యంత మంగళప్రదమైనదిగా భావిస్తారు. దేవాలయాల్లో మత, సామాజికపరమైన కార్యకమాల్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన వాద్యం.

ఈ నాదస్వరం కచేరీలలో విరివిగా ఉపయోగించే వాద్యం. దక్షిణభారతంలో కర్ణాటక సంగీతానికి పొడవైన సన్నాయినీ, అలాగే ఉత్తరభారతంలో హిందూస్థాని సంగీతానికి పొట్టి నాదస్వరాన్నీ ఉపయోగిస్తారు.

దీన్నే షెహనాయి అని అంటారు. నాదస్వరానికి రెండు పీకలుంటాయి. రెండుప్రత్యేకమైన భాగాలుండి కిందవైపు వెడల్పుగా ఉండి, పైన పొడవాటి గొట్టంలా ఉంటుంది.

దీని పార్శ్వభాగంపైన ఎనిమిది వేళ్లు ర్రంధాలు ఉండి, నాలుగు గాలి బయటకు పోయే ర్రంధాలూ ఉంటాయి. దీనికి పైన బిగించిన కొయ్యతో చేసిన డబుల్‌రీడ్ నుండి ధ్వని జనిస్తుంది. నాదస్వరం అనగానే షేక్ చినమౌలా, షెహనాయ్ అనగానే ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ గుర్తుకువస్తారు.

వేణువు - సంగీత వాద్యం

ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. దీన్నే పిల్లన గ్రోవి అని కూడా పిలుస్తారు. అత్యంత నాణ్యత కలిగి, బాగా ఆరబెట్టిన వెదురుముక్కతో తయారు చేసిన రంధ్రాలు గల వాద్యపరికరం.

ఈ వెదురు గొట్టాన్ని ఒక వైపు తెరచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై భాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది.
ఈ ర్రంధంతోపాటు స్వరాల మార్పుకోసం మరికొన్ని రంధ్రాలు ఉంటాయి. యూరప్‌లో ఈ సంప్రదాయ సంగీత వాద్యం ఎంతో ప్రాచీన కాలం నాటి నుంచే ఉండేదని కొందరి అభిప్రాయం.

చైనాలో క్రీ.పూ.433లో ఝవూ రాజవంశీకుల కాలంలో వాయించేవారు. దీనిని వారు షి జింగ్ అని పిలిచేవారు. ఇక భారత సంప్రదాయానికి వస్తే పిల్లనగ్రోవి శ్రీకృష్ణుడినే తలపిస్తుంది.
మన దేశంలోని వాటికి, పశ్చిమదేశాలలోని వాటికి తేడా ఉంది.ఆధునిక కాలంలో పండిట్ రఘునాథ్ ప్రసన్న, పండిట్ రాజేంద్ర ప్రసన్న, పండిట్ హరిప్రసాద్ చౌరాసియాలు పిల్లనగ్రోవిని మరింత ప్రాచుర్యం చేసిన ప్రముఖులు.

Monday, January 28, 2013

వీణ (Veena)

కర్ణాటక సంగీతంలో ఉపయోగించే ప్రధాన సంగీత వాయిద్యం వీణ. వీణకు ఏడుతంత్రులు ఉంటాయి. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమమనే నాలుగు తంత్రులు బిగించబడి ఉంటుంది.

ఇవేగాక శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులు బిగిస్తారు.

వీణ వాయించేటపుడు కుడిచేత్తో మీటుతూ, దానికి అమర్చిన 24 మెట్లు(స్థాయిలు) దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమచేతి వేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది.

వీణలో ప్రధానంగా కుండ, దండి, యాళి, సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.
వీణల తయారీకి మన రాష్ట్రంలోని విజయనగరంజిల్లా బొబ్బిలి సుప్రసిద్ధం. ఇక్కడ 17వ శతాబ్ది నుంచే వీణల తయారీ జరుగుతోంది.

వీణ ల్లో రుద్రవీణ, చిత్రవీణ, విచిత్ర వీణ, సరస్వతీ వీణ అనే రకాలున్నాయి.
సంగీత త్రిమూర్తుల్లో ముత్తుస్వామి దీక్షితార్ వీణవిద్వాంసులుగానూ సుప్రసిద్ధులు.

వయొలిన్ (Violin)

దీనినే ఫిడేలు అంటారు. ఇది తంత్రీవాద్యం.వయొలిన్‌లో ప్రధానభాగాన్ని చెక్కతో తయారుచేస్తారు. ఈ భాగం కారణంగానే తంత్రులు చేసే శబ్దం మరింత గట్టిగా వినిపిస్తుంది.
ప్రారంభంలో వయొలిన్‌లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారుచేసేవారు.

కర్ణాటక సంగీతంలో దీనిని ప్రధాన తంత్రీవాయిద్యంగా ఉపయోగిస్తారు. వయొలిన్‌పై కమానుతో వాయిస్తారు. కమాను అనేది చిన్నపాటి కర్ర. దీనికి గుర్రపు తోక వెంట్రుకలు తీగెలుగా ఉంటాయి. దీన్ని కుడి చేతితో ఒక చివర పట్టుకుని వయొలిన్ తీగెలపై అడ్డంగా కమానును ఒక చివరి నుంచి మరో చివరికి రాస్తూంటారు.వయొలిన్ అనగానే మనకు స్ఫురించేది ద్వారం వెంకటస్వామినాయుడుగారి పేరు.

కంజీర

కర్ణాటక సంగీత కచేరీల్లో మృదంగానికి తోడుగా వాయించే వాయిద్యం కంజీర. కంజీరాను 1890ల్లోనే వాయిస్తుండేవారు. 1930లో సంగీత కచేరీల్లో తోటి వాయిద్యంగా ప్రవేశపెట్టారు.

ఇది గుండ్రంగా 7 నుంచి 9 అంగుళాల వెడల్పు, 2 నుంచి 4 అంగుళాల లోతు ఉంటుంది.
చూడ్డానికి మూతలాగ ఉంటుంది. దీన్ని జంతుచర్మంతో తయారుచేస్తారు. వెదురు లేదా కొయ్యతో గుండ్రంగా ఉన్న ఫ్రేమ్‌కి ఒక వైపు చర్మాన్ని గట్టిగా బిగిస్తారు.

ఫ్రేమ్‌కి మూడు లేదా నాలుగు పాత చిల్లు నాణాలు ఏర్పాటుచేస్తారు. ఇతర చర్మ వాయిద్యాల వలె కంజీరాను వాయించడం అంత సులభం కాదు. దీన్ని కుడి అరచేయి, వేళ్లతో వాయిస్తారు. ఎడమ చేయిని డ్రమ్‌కు మద్దతుగా ఉంచాలి. శబ్దాన్ని ప్రత్యేకించి నియంత్రించడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితులను అనుసరించి కంజీరా పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

మృదంగం

మృదంగం దక్షిణ భారతదేశానికి చెందిన ఒక తాళ వాద్యం. శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుందని పురాణాలు చెబుతాయి.

ఈ వాద్యం ఒక గొట్టపు ఆకారంలో ఉండి ఇరువైపులా వాయించడానికి అనువుగా ఉంటుంది.

ఇది హిందూసంస్కృతిలో కచేరీలలో ముఖ్యభాగంగా అన్ని కార్య్రకమాల్లోనూ ఉపయోగించే ప్రధాన వాయిద్యం.

మంచి బలమైన చెట్టు కాండం నుంచి పొడవైన భాగాన్ని తీసుకుని దానిలో మధ్యభాగాన్ని తొలగించి డొల్లగా చేస్తారు.

ఎండబెట్టిన తోలును గుండ్రటి రింగులాంటి దానికి చుట్టి బిగిస్తారు. ఆ తోలుకి రింగులు అనుసరిస్తూ చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు.

దీన్ని కావలసిన విధంగా చర్మాన్ని వేడి చేసుకుంటూ తాళ్లను బిగించుకుంటూ ధ్వని సరియైన శ్రుతిలో వచ్చేలా సరిచేస్తాడు.

మృదంగవాయిద్యంలో పాల్‌ఘాట్ మణిఅయ్యర్, దండమూడి రామమోహనరావు, యెల్లా వెంకటేశ్వరరావు తదితరులు ఎంతో సుప్రసిద్ధులు.