Showing posts with label Music Articles. Show all posts
Showing posts with label Music Articles. Show all posts
Wednesday, July 8, 2015
Monday, January 28, 2013
కోయిలత
జబ్ ప్యార్ కియాతో డర్నాక్యా...
రంగీలారే- తేరే రంగ్‌మే
యూ రంగాహై- మేరా మన్....
యే జిందగీ ఉసీకిహై- జో కిసీకా హోగయా
ప్యార్‌హీ మే ఖోగయా...
ఓ సజ్‌నా... బర్‌ఖా బహార్ ఆయీ
రస్‌కీ పుహార్ లాయీ- అఖియోమే ప్యార్ లాయీ...
నైనా బర్ సే- రిమ్‌జిమ్ రిమ్‌జిమ్
పియా తోరే ఆవన్ కీ ఆస్....
ఠండీ హవాయే- లెహెరాకే ఆయే
రుత్‌హై జవా ఉన్‌కో యహా- కైసే బులాయే....
ఈ పాటలన్నీ ఆమెవి.
పంచి ఇచ్చిన ఈ పూలన్నీ ఆమెవి. ఈ మాధుర్యం అంతా ఆమెది.
పాట పట్ల ఉన్న ఈ ప్రేమ అంతా అమెదే.
ఇవాళ దేశం ఆమె పాటను సెలబ్రేట్ చేసుకుంటుంది.
ఒక వేడుకగా ఆమెతో గొంతు కలుపుతుంది.
హ్యాపీ బర్త్ డే టు యూ లతా.
ఇవాళ
పాటలు మళ్లొక్కసారి శిశువులై కేరింతలు కొడతాయి. బుగ్గల మీద రంగులు
పూసుకొని తియ్యగా నవ్వుతాయి. ఉదయపు నీరెండలో మెత్తగా దోగాడతాయి. మద్యాహ్నం
హటాత్తుగా కురిసే కుంభవృష్టిలో రోడ్డువారగా నిలబడి తడిసి ముద్దవుతాయి.
సాయంత్రపు పూట తొలిప్రేమలో ఉన్న ఒక జంట పెదాలకు పల్లవుల రుచిని అద్దుతాయి.
పాటలు ఇవాళ పాటను ప్రేమించే ప్రతి ఒక్కరి గుండెను లతలా అల్లుకుపోతాయి.
లతల్లా పెనవేసుకుపోతాయి.
ఆయేగా... ఆయేగా...
ఆనే వాలా ఆయేగా.. ఆయేగా...
ఆనే వాలా ఆయేగా.. ఆయేగా...
లతా మంగేష్కర్ పాటను ఈ దేశం క్రితం జన్మ నుంచీ వింటోంది. బహుశా రాబోయే
జన్మలో కూడా వింటుంది. మరో పది జన్మలైనా వింటుంది. ఎందుకంటే లతా పాటలో
ఆర్ట్ ఉంది, క్రాఫ్ట్ ఉంది. ఈ రెంటినీ రెండు రెక్కలుగా చేసుకున్న ఈ పిట్ట
అందుకే రివ్వున ఎగురుతూనే ఉంది.
పంఛీ బనూ ఉడ్‌తీ ఫిరూఁ... మస్త్ గగన్ మే
ఆజ్ మై ఆజాద్ హూ...
దునియాకే చమన్ మే....
ఆజ్ మై ఆజాద్ హూ...
దునియాకే చమన్ మే....
తండ్రి ఉన్నట్టుండి కన్నుమూస్తే ఇంటిని మోసే బాధ్యత లతా మీద పడింది.
ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడు, తల్లి.... గొంతులో పాట తప్ప తినడానికి మరేమీ
లేని పేదరికమూ. వాళ్లను పోషించడానికి లతా రోజూ ఒక గొడుగు పట్టుకొని
స్టూడియోల చుట్టూ తిరిగేది. అవకాశాల కోసం అర్థించేది. నూర్జహాన్,
రాజ్‌కుమారి, షంషాద్ బేగం, సురయ్యా, గీతారాయ్... వంటి స్టార్స్ మధ్య హిందీ
వచ్చీరాని, ఉర్దూ వచ్చీరాని, నాగరీకుల భాష వచ్చీరాని ఈ మరాఠీ అమ్మాయి
కాసింత ఆత్మవిశ్వాసపు ఆక్సిజన్ కోసం వెంపర్లాడింది. చివరకు సంగీత దర్శకుడు
ఖేమ్‌చంద్ ప్రకాష్ తన ‘మహల్’ సినిమాలో ‘ఆయేగా... ఆయేగా’ పాటతో ఆమెను ఈ లోకం
మీదకు క్షిపణిలా వదిలి పెట్టాడు. దానిని దొరకబుచ్చుకున్న మరో సంగీత
దర్శకుడు సి.రామచంద్ర ఆమె చేత ‘ధీరేిసీ ఆజారీ అఖియన్‌మే’ పాడించాడు. శంకర్ జైకిషన్‌లు ఊరుకోక ‘జియా బేకరార్ హై’... అనిపించారు.
అంతటితో లతా అందరినీ తోసి ముందుకు వచ్చి నిలబడింది.
ఆపైన
నౌషాద్, మదన్‌మోహన్, ఎస్‌డి బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్... ప్రతి
ఒక్క సంగీతదర్శకుడు తమ బాణీలను ఆమె పాదాల దగ్గర పెట్టి పునీతులయ్యారు.
కుఛ్ దిల్ నే కహా- కుచ్‌భీ నహీ
కుఛ్ దిల్‌నే సునా- కుచ్ భీ నహీ....
కుఛ్ దిల్‌నే సునా- కుచ్ భీ నహీ....
ఇక రఫీ, ముఖేష్, కిశోర్‌కుమార్ రంగంలో దిగారు. లతా గళానికి తమ గళం చేర్చి యుగళగీతాల మకరందాన్ని కుమ్మరించారు.
తేరి బిందియా రే-
రే ఆయ్ హాయ్- తేరి బిందియారే...
రే ఆయ్ హాయ్- తేరి బిందియారే...
మన్నా డేతో- ఏ రాత్ భీగీ భీగీ తక్కువా? తలత్, హేమంత్ కుమార్, సురేష్
వాడ్కర్, ఏసుదాస్, బాలసుబ్రహ్మణ్యం.... అందరూ ఆమె పాటకు బోయీలైనవారే.
వంతపాడినవారే.
సాధారణంగా అందరూ ఎవరెస్ట్ ఎక్కుతారు. ఎవరెస్ట్ ఉంది కనుక ఎక్కుతారు.
కాని, లతా తనే ఎవరెస్ట్‌గా మారి, ఆపైన తానే దానిని అధిరోహించింది.
శిఖరమే లతా. లతే శిఖరం.
ఆమెకు జయం. ఆమెకే జయం.
రజనీగంధా ఫూల్ తుమ్హారే....
లతాకు మంచి పాటలు యిచ్చిన సంగీతదర్శకుడిగా మదన్‌మోహన్ పేరు చెబుతారు. కాని
సలీల్ చౌధురి ఆమెకు చాలా విలువైన పాటలు కానుకగా యిచ్చాడు. రజనీగంధా పాటతో
పాటు ఛోటీసీ బాత్‌లోని ‘నజానే క్యూ’... అద్భుతం.
హవామె ఉడ్‌తా జాయే... మొర లాల్ దుపట్టా మల్‌మల్‌కా....
బర్సాత్
బర్సాత్
-పి.సుశీల, గాయని
రసిక్ బలమా....
చోరీచోరీ
చోరీచోరీ
-ఎస్.జానకి, గాయని
తూ జహా జహా చలేగా... మేరా సాయా సాత్ హోగా...
మేరా సాయా
మేరా సాయా
-కీరవాణి, సంగీత దర్శకుడు
దిల్ క దియా జలాకె గయా... ఏ కౌన్ మెరీ తన్హాయీ మే....
ఆకాశ్ దీప్...
ఆకాశ్ దీప్...
- యండమూరి వీరేంద్రనాథ్, రచయిత
ఆజారే మైతో కబ్ సే ఖడీ ఇస్ పార్...
మధుమతి
మధుమతి
- వంశీ, దర్శకుడు
కుచ్ నా కహో.. కుచ్ భీ నా కహో...
1942 ఏ లవ్‌స్టోరీ
1942 ఏ లవ్‌స్టోరీ
- దేవిశ్రీ ప్రసాద్, సంగీత దర్శకుడు
అజీబ్ దాస్‌తాఁ హై ఏ.....
దిల్ అప్‌నా ఔర్ ప్రీత్ పరాయే....
దిల్ అప్‌నా ఔర్ ప్రీత్ పరాయే....
- రవితేజ, సినీనటుడు
తుమ్ క్యా జానో తుమ్హారీ యాద్‌మే...
షిన్‌షినాకి బబ్లాబూ
షిన్‌షినాకి బబ్లాబూ
-వి.ఎ.కె. రంగారావు, సినీ సంగీత విమర్శకులు
Tuesday, January 8, 2013
ప్రతి పాటా ఒక కచేరి! - A.R. Rahman
‘‘మనందరిలో
దైవాంశ ఉంది - ఇదే మనందరినీ ఒకటి చేస్తోంది. మన శరీరాలు వేర్వేరు. మన
ముఖాలు వేర్వేరు. కానీ అంతరంగంలోకి తొంగి చూస్తే మనమంతా ఒకటే. మన భావనలూ
ఒకే రకం. బాధ, సంతోషం, ప్రేమ, విషాదం... ఈ భావనల్లోంచి నా సంగీతం
ఉద్భవిస్తుంది. అది జపానీ సంగీతమైనా, ఆఫ్రికా సంగీతమైనా, ఖవ్వాలీ అయినా లేక
ఇంకా ఇతర రకమైన సంగీతమైనా ప్రజల హృదయాలను స్పందింపజేయాలి. అప్పుడే నా
సంగీతానికి సార్థకత లభిస్తుంది.’’
- ఎ.ఆర్. రెహమాన్, సంగీత దర్శకులు
భారతీయ
సినీ సంగీతాన్ని విప్లవాత్మకమైన రీతిలో రూపాంతర మొందించిన కళాకారుడు
ఎ.ఆర్.రెహమాన్. సినీసంగీత రూపకల్పనను అనూహ్యమైన రీతిలో ఆధునికీకరణం చేసి,
తనదైన ప్రత్యేక శైలితో ప్రతి ఒక్క కళాకారుడూ తన బాటలో, తననుసరించే రీతిలో
ప్రభావితం చేసిన అత్యంత ప్రతిభావంతుడు ఆయన. రెహమాన్ సంగీతం ఎంత సృజనాత్మకమో
అంత విభిన్నం. పాశ్చాత్య సంగీత ధోరణులైన ర్యాప్, జాజ్, రాక్, ఫంక్‌లను
పాశ్చాత్య సంప్రదాయక సంగీతంతో ముడిపెట్టి, వాటిని కర్నాటక, హిందుస్తానీ
సంగీతంతో జతపరచి, ఆపై ఖవ్వాలీ, సూఫీ రాగాలతో మిళితం చేసి, జానపద లయల హొయలతో
చిలకరించి, వినగానే మనసును పట్టి, వింటున్నకొద్దీ ఆత్మను ఉర్రూతలూపి,
మైమరపించే మృదుమధురమైన సంగీత సృజన సరసనే, ఒళ్లు వెర్రెక్కి ఆనందంతో ఊగిపోయే
ఆధునిక నృత్య స్వర రచననూ చేసి పాపులర్ సంగీతాన్ని పునర్నిర్మించిన సంగీత
సామ్రాట్ రెహమాన్.
సినీసంగీతం రొటీన్ శబ్దాలమయమై తన ఆకర్షణను
కోల్పోతూ ప్రైవేట్ పాప్ పాటలు, గజళ్లకు తలవంచే సమయంలో ‘రోజా’ సినిమా పాటలతో
సినీపాటల ప్రపంచాన్ని తాజా పరిమళాలతో నింపేశాడు రెహమాన్.
‘చిన్ని
చిన్ని ఆశ’తో సంగీత ప్రపంచంలో పెద్దపెద్ద అడుగులు వేస్తూ ఎవరికీ అందనంత
ఎత్తులకు ఎదిగిన రహమాన్, ఆరంభంలో ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథన్‌తో సహా అనేక
సంగీత దర్శకుల వద్ద పనిచేశాడు. వారి గాన సృజన పద్ధతులను, నేపథ్య సంగీత సృజన
పద్ధతులను ఆకళింపు చేసుకున్నాడు. ఒక వాయిద్యం సృజించే స్వరంపై పట్టు
సంపాదిస్తే సరిపోదు, ఆ స్వరం ఆత్మను గ్రహించాలని అర్థం చేసుకున్నాడు.
అంతేకాదు, అనేక వాయిద్యాలు ఎంత విభిన్నమైన స్వరాలను వినిపించినా, వాటన్నిటి
ఆత్మ ఒకటేనని గ్రహించాడు. ఆ ఆత్మస్వరం, మనిషి ఆత్మస్వరాన్ని
స్పందింపజేస్తుందని, అలౌకిక ఆనందానికి దారితీస్తుందని, భగవంతుడి అన్వేషణలో
ఇదీ ఓ మార్గం అని గ్రహించాడు.
ఈ గ్రహింపు రెహమాన్ సంగీతానికి ఒక
సార్వజనీనతను, వైశిష్ట్యాన్ని ఆపాదించింది. అందుకే, రెహమాన్ పాటలు ఎంత
పాశ్చాత్యంగా ధ్వనించినా, వాటి ఆత్మ భారతీయ సంగీతంలో ఉంటుంది. రెహమాన్
పాటలు ఎంతగా భారతీయ సంప్రదాయ సంగీతంలో స్నానమాడినా, వాటి నేపథ్యంలో
పాశ్చాత్య మాధుర్యం పరవళ్లు తొక్కుతుంటుంది. అందుకే రెహమాన్ సంగీతాన్ని
‘ఫ్యూజన్ సంగీతం’ అంటారు. ఈ పాశ్చాత్య, భారతీయ సంగీతాల నడుమ రెహమాన్
ప్రగాఢంగా విశ్వసించే సూఫీ తత్వచింతన సుధా రసధార అతని పాటలకు పవిత్రత
పరిమళాన్ని అద్దుతుంది. అందుకే పాటలో ఒక స్వరం వినగానే ఇది రెహమాన్ సంగీతం
అని గుర్తుపట్టవచ్చు.
చిన్ని చిన్ని ఆశ, చుకు బుకు రైలే, దొంగ
దొంగ, ముక్కాలా ముక్కాబులా, ఛయ్య ఛయ్య, ఓ చెలియా నా ప్రియ సఖియా, హమ్మ హమ్మ
వంటి పాటలతో భారతీయ సినీపాటలకొక నూతన దిశనిచ్చాడు రెహమాన్. స్వదేశ్,
లగాన్, రంగ్ దె బసంతి వంటి సినిమాల్లోని పాటలతో అంతర్జాతీయ
ఖ్యాతినార్జించాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమా సంగీతానికి ఆస్కార్
బహుమతి గెలుచుకోవటంతో, ప్రపంచ సినిమా సంగీతంపై తనదైన ప్రత్యేక ముద్ర వేయటం
ఆరంభించాడు. ఇలా అంచెలంచెలుగా అనంత ఖ్యాతిని రెహమాన్ ఆర్జించటానికి అతని
సంగీతంలోని ఏ లక్షణం దోహదం చేస్తోందని ఆలోచిస్తే ‘ఇదీ’ అని ఏ ఒక్క అంశాన్ని
ఎత్తి చూపించటం కష్టం. ఉదాహరణకు ‘రోజా’ సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ పాట
ఆరంభ సంగీతాన్ని, ‘నా చెలి రోజా’ పాట ఆరంభ సంగీతాన్ని పోలిస్తే వాయిద్యాల
వాడకంలోను, బాణీకి తగ్గ లయను సృజించటంలోను ఎంతో వైవిధ్యం, సృజనాత్మకత
కనిపిస్తాయి.
అలాగే ‘బొంబాయి’ సినిమాలో ‘కెహ్‌నా హై క్యా’ పాటలో
చిత్ర స్వరం పలికిన హొయల లయలు పూర్తవుతూనే ‘నుస్రుత్ ఫతే అలీ ఖాన్’
సూఫియానా రాగాలు పలకటం ఎంత మధురంగా ఉంటుందో, అంతగా ఆత్మను
ఉర్రూతలూగిస్తుంది. ఇదొక ‘ట్రెండ్ సెట్టింగ్’ పాటగా ఎదిగింది. ఇదే సూఫియానా
సంగీతాన్ని అటు రొమాన్స్‌కు, ఇటు భక్తి పాటలకు ఎంతో గొప్పగా వాడటం రెహమాన్
సృజనలోని ప్రధానాంశం. పియ హాజి అలీ, ఖ్వాజా మెరీ ఖ్వాజా ఎంత భక్తి
భావాన్ని పొంగిస్తాయో, తెరెచినా (గురు) పాట రొమాన్స్‌ను, అంతే పవిత్రంగా
ధ్వనింపజేస్తుంది. స్వదేశ్‌లో ‘యే తార వో తార’, ‘యూ హి చలాచల్’, ‘సావరియా
సావరియా’ పాటలు ఎంత భారతీయతను ప్రదర్శిస్తాయో, ‘జోథా అక్బర్’లో జష్నె
బహారా, ఇన్ లమ్హోంకె దామన్ పాటలు అంతగా మొఘల్ కాలం నాటి ప్రణయ భావనను
ప్రదర్శిస్తాయి.
ఇదే సినిమాలో ‘అజీమో షాన్ షెహెన్షా’ పాట ఆధునిక
వాయిద్యాల లయతో మొఘల్ కాలం నాటి ఆవేశాన్ని, శౌర్య ప్రతాపాలను సజీవంగా
వినిపిస్తుంది. ‘తాల్’ సినిమా పాటల లయలు బ్యూటీ క్వీన్ ఐశ్వర్యారాయ్
అందానికి నూతన మెరుగులు దిద్దాయి. ‘ఏ మాయ చేసావె’లో ఈ హృదయం, కుందనపు బొమ్మ
వంటి పాటలు నవ యువ శృంగారానికి నూతన వన్నెలద్దాయి. ఇలా అత్యంత
విభిన్నమైన, విశిష్టమైన సంగీతాన్ని రెహమాన్ సృజించే పద్ధతి అత్యంత
ఆశ్చర్యకరంగా, ఆధునికంగా ఉంటుంది.
వేర్వేరు వాయిద్యకారులను పిలిచి
ఓ అరగంటసేపు వారిని వారి ఇష్టం వచ్చిన బాణీలు వాయించమంటాడు. దాన్ని
రికార్డు చేసుకుంటాడు. ఆ తరువాత సందర్భానికి తగ్గ పాట రాయించుకుంటాడు. ఓ
బాణీ అనుకుంటాడు. ‘లయ’ ఆధారంగా గాయనీ గాయకులతో వారి ఇష్టం వచ్చినట్టు
పాడిస్తాడు. ఆపై వీటన్నిటినీ ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో లయబద్ధంగా
కూరుస్తాడు. అంటే, అనేక దృశ్యాలను చిత్రీకరించి వాటిని ‘ఎడిట్’ చేసినట్టు
విభిన్నమైన స్వరాలను, ధ్వనులను ఒకచోట చేర్చి పేర్చి ఒక అందమైన ముత్యాల
హారాన్ని ‘కూర్చి’ అందిస్తాడన్నమాట. అందుకే రెహమాన్ పాటలలో ఒక అనూహ్యత
ఉంటుంది. కొన్ని వాయిద్యాలు హఠాత్తుగా అద్భుతమైన పోకడలు పోతాయి. ‘కుచ్చి
కుచ్చి రక్కమ్మ (బొంబాయి)’, ‘కభి నీమ్ నీమ్ (యువ)’, ‘ముదినే పల్లి
(జెంటిల్మెన్)’ వంటి పాటలు జానపద బాణీలుగా ధ్వనిస్తున్నా వాటికోసం వాడిన
వాయిద్యాలు, అవి సృజించిన ధ్వనులు అత్యంత పాశ్చాత్యం. కానీ ఈ రెండు ఎలా
మిళితమై పోతాయంటే మొత్తం జానపదంలా తోస్తుంది.
ఇలాంటి అనేక
విభిన్నమైన ప్రయోగాలు స్వరాలతో చేయటం వల్లనే రెహమాన్ బాణీలు విలక్షణంగా,
విభిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. అందుచేతే రెహమాన్ ప్రతి పాట ఓ
సంగీత కచేరీలా, ఆర్కెస్ట్రా సింఫోనీ సృజనలా ఉంటుంది. ‘లాజిక్ ప్రో’ వాడుతూ
రింగ్ షిఫ్టర్, మల్టి ప్రాసెసర్, ఈఎస్‌ఎస్‌టూఫోర్, ఈవీపీ88 వంటి ఆధునిక
పరికరాల సహాయంతో ధ్వనులను కలిపి లయను సృజిస్తాడు. బంగారాన్ని కరిగించి
తీగలుగా లాగి ఆకర్షణీయమైన రూపాలు ఏర్పాటు చేసినట్టు పాటలను రూపొందిస్తాడు.
సింథసైజర్, గిటార్, హర్పెజ్, డ్రమ్స్, పియానో, ఆకార్డియన్, ఫ్లూట్ వంటి
వాయిద్యాలతో పాటు మానవ స్వరాన్నీ ఓ వాయిద్యంలా వాడటంతో పాటకొక విభిన్నమైన
శోభ ఏర్పడుతుంది. అందుకే రెహమాన్ తన పాటలలో విభిన్నమైన స్వరాలను వాడతాడు.
జాతీయ,
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీసంగీతానికి తన సృజనాత్మక అభినివేశంతో
గౌరవాన్ని, ప్రామాణికతను ఆపాదిస్తున్నాడు రెహమాన్. దేశంలోని పలు భాషలలో
సంగీతాన్ని అందిసున్నారాయన.. కానీ అతని పాటల గొప్పతనం స్పష్టంగా అర్థం
కావాలంటే ‘తమిళ’ భాషలోని పాటలను వినాలి. ఇవే పాటలు హిందీలోకి వచ్చేసరికి
కొద్దిగా మారతాయి. రెహమాన్ సృజనలోని గొప్పతనం, సినీ సందర్భాన్ని అర్థం
చేసుకుని ఔచితీవంతమైన బాణీలను సృజించటం అర్థం కావాలంటే ‘ఎర్ట్ 1947’లో
‘రైత్ ఆగయి హై’ పాట బాణీ, వాయిద్యాల వాడకం గమనించాలి. ఈ పాట రెహమాన్ ప్రతిభ
అనే కొండను చిన్న అద్దంలో చూపుతుంది. అందుకే రెహమాన్ కన్నా ముందు ఎందరో
ప్రతిభావంతులు సరస్వతీదేవి కంఠాన మణిహారంలో మణులుగా వెలిగారు. రెహమాన్
మాత్రం సరస్వతీదేవి కంఠాన వెలిగే ప్రత్యేక రత్నాల హారంగా నిలుస్తాడు.
- కస్తూరి మురళీకృష్ణ
ఎ.ఆర్. రెహమాన్ చిన్ని చిన్ని విషయాలు
తల్లిదండ్రులు: కరీమా (అసలు పేరు కస్తూరి), ఆర్.కె.శేఖర్
అసలు పేరు:
దిలీప్‌కుమార్. సోదరికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మసీదులో ప్రార్థించటం వల్ల
ఆమె ఆరోగ్యవంతురాలైంది. దాంతో ఇస్లాం స్వీకరించారు. అయితే ఓ జ్యోతిష్కుడు
దిలీప్‌కుమార్ నుంచి రెహమాన్‌గా పేరు మార్చుకోమని సూచించటంతో దిలీప్‌కుమార్
అల్లా రఖా రెహమాన్ అయ్యాడు.
ఇళయరాజాతో:
చాలామంది రెహమాన్‌ను ఇళయరాజాతో పోల్చి వాద ప్రతివాదాలు చేస్తూంటారు. కానీ
వారిద్దరి నడుమ చక్కని స్నేహం ఉంది. ఇళయరాజా, రెహమాన్ తండ్రి వద్ద
పనిచేశాడు. రెహమాన్ తండ్రి మరణించిన తరువాత అతని వాయిద్యాలను ఇళయరాజా
అద్దెకు ఇచ్చేవాడు. రెహమాన్, ఇళయరాజా వద్ద సహాయకుడిగా పనిచేశాడు.
గేయ రచయిత: రెహమాన్ అప్పుడప్పుడు పాటలు వినడమే కాదు రాస్తాడు కూడా. అధికంగా సూఫీయానా తరహా పాటలు పాడటానికి ఇష్టపడతాడు.
గాయకులు, వాయిద్యాలు:
రెహమాన్ ప్రచారంలోకి తీసుకువచ్చినన్ని కొత్త స్వరాలు మరే సంగీత దర్శకుడు
తేలేదు. అలాగే, తనకు వాయిద్య సహకారం అందించిన వారి పేర్లూ ఆల్బమ్‌పై ఇచ్చి
వారికీ ప్రాచుర్యం కల్పించే సత్సంప్రదాయాల్ని రెహమాన్ ఆరంభించాడు. అందుకే
‘శివమణి’ లాంటి వాయిద్యకారులూ గుర్తింపు పొందుతున్నారు.
స్వయంగా పాడిన టాప్ టెన్ హిట్స్
1. ఊర్వశీ ఊర్వశీ (కాదలన్, 1994)
2. హమ్మ హమ్మ (బొంబాయి, 1995)
3. మాంగ్తా హై క్యా (రంగీలా, 1995)
4. ముస్తఫా ముస్తఫా (కాదల్ దేశం 1996)
5. కొలంబస్ కొలంబస్ (జీన్స్, 1998)
6. ఇష్క్‌బినా (తాల్, 1999)
7. పియ హాజి అలీ (ఫిజా, 2000)
8. యేజో దేశ హై తేరా (స్వదేశ్, 2004)
9. రూబరూ (రంగ్ దె బసంతి, 2006)
10. తెరెబినా (గురు, 2007)
ఇక రెహమాన్ పాడిన ప్రైవేటు పాట ‘వందేమాతరం’ యువతను ఉర్రూతలూపింది. ‘వందేమాతరం’ పాటను ఆధునికీకరణం చేసింది.
తెలియగలేదు ఈ లీలలు...
వెదురుతో
చేసిన వేణువుకైతే ఆరేడు రంధ్రాలుంటాయి, కానీ ఈల పాడేవారికి మాత్రం ఒకే ఒక
రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి సప్తస్వరాలనూ, 72 మేళకర్త రాగాలలో
పలికించాలి. ఎవరైనా ఈల వేయగానే టక్కున గుర్తు వచ్చే పేరు ఈలపాట రఘురామయ్య.
శివప్రసాద్ కూడా ఈల కుటుంబానికి చెందినవారే. ఉచ్ఛ్వాసనిశ్వాసలలో కూడా
రాగాలు పలికించడం వీరి ప్రత్యేకత. నేడు ఆయన బాలమురళితో రాగప్రవాహం
చేస్తున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూ.
మలుపు తిప్పిన ఘటన...
జీవితంలో మరచిపోలేను!
ఒకరోజు గురువుగారు వారి ఇంటికి వచ్చిన అతిథుల ముందు నన్ను ఒక కీర్తన
పాడమన్నారు. నేను ‘‘తెలిసి రామచింతనతో’’ కీర్తన ఈల మీద ఆలపించాను. అది
విన్న వెంటనే నా కీర్తనలను సీడీ రూపంలో తీసుకు వస్తామని, నన్ను
రికార్డింగ్‌కి తీసుకెళ్లారు. అందులో బాలమురళిగారు ‘కంజీర’ మీద వాద్యసహకారం
అందించటం నా జీవితంలో మధుర ఘట్టం.
ఆశీర్వచనంలా భావిస్తున్నాను
గురువుగారితో ఎన్నో కచేరీలు చేశాను. అందరిలో ఒకడిగా పక్కవాద్యాల వారితో
కూర్చున్నాను. ఆయనతో విడిగా పాడటం మాత్రం ఇదే ప్రథమం. ఇంతకు ముందు
బిస్మిల్లాఖాన్‌తో జుగల్‌బందీ చేశాను. అప్పుడు నాకు ‘‘శహనాయ్’’లో వచ్చే
ప్రత్యేకమైన అంశాలను గురువుగారు గురువుగారే నేర్పారు. అయితే ఇది నేను
గురువుగారితో పాడుతున్నాను కనుక దీనిని జుగల్‌బందీ అనను. ఆయనతో పాడే
అవకాశాన్ని ఇచ్చినందుకు దానిని ఆశీర్వచనంలా భావిస్తున్నాను.
విని నేర్చుకున్నాను
సైగల్, సురయ్యా పాడినవి, పన్నాలాల్ ఘోష్, ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు..
వీరందరి కచ్చేరీలను బాగా వినేవాడిని. ఏ పని చేస్తున్నా ఈలతో పాటలు
పాడుతూనే ఉండేవాడిని. రఘురామయ్యగారు కేవలం గాలిలోపలకు మాత్రమే పీల్చుతూ
ఈలపాట పాడేవారు. నేను ఉచ్ఛ్వాస, నిశ్వాసలు రెండింటిలోనూ పాడగలను. నా పాటలకు
ఆయన సంతోషంతో 1000 బహూకరించటం అపురూపమైన బహుమతి అయితే నాకు ఇందిరాగాంధీ
ప్రశంసలు లభించటం నా జీవితంలో మరపురాని మధురానుభూతి.
గురువుల ఆశీర్వాదమే...
గురుముఖంలో నేర్చుకున్న దానికంటె, గురువుల దగ్గర చూసి నేర్చుకున్నదే
ఎక్కువ. ఆలాపన ఎలా చేస్తారన్నది వారి దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఈల పాట
పాడేటప్పుడు మాధుర్యమైన శబ్దం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అందుకే
జనరంజకంగా ఉండే... నయనకాంతి, హంసానందిని, హిందోళ వంటి రాగాలను
ఎన్నుకొంటాను.
పుష్కరకాలంగా జరుగుతున్న కార్యక్రమం!
2000 సంవత్సరం జనవరి 1 నుంచి నూతన సంవత్సరం నాడు ఏదో ఒక కాన్సెప్ట్
ఆధారంగా కచ్చేరీ జరుగుతోంది. ఈ సంవత్సరం గురువుగారితో ‘రాగప్రవాహం’
కార్యక్రమం చేస్తున్నాను. సంగీతమే స్వరసుఖదాయి(యమన్, కల్యాణి) తో
ప్రారంభిద్దామనుకుంటున్నాను. ముందర ఎవరికి వారు ఒక్కొక్క కీర్తన పాడతాం.
తరవాత వారన్నది నేను, నేనన్నది వారు అంటుంటాం. అలా కార్యక్రమం జరుగుతుంది.
ఆయనే సర్వస్వం...
బాలమురళిగారిని తండ్రిగా, గురువుగా, దైవంగా భావిస్తాను. నాకు
విద్యాబుద్ధులు నేర్పి, నన్ను ఒక స్థితికి తీసుకువచ్చింది ఆయనే.
సందర్భాన్ని బట్టి కీర్తనలను ఎంపిక చేసుకోవడమే బాలమురళి గారి విజయానికి
కారణం. అలా చేస్తేనే రాణిస్తుంది విద్య. ఆయన దగ్గర మెలకువలు నేర్చుకోవడం
వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానన్న విషయాన్ని నేనెన్నటికీ మరువను!
- డా. పురాణపండ వైజయంతి
1991లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివప్రసాద్ పేరు నమోదు అయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా విజిల్ మీద శాస్త్రీయ సంగీతం పాడుతున్నది వీరొక్కరే.
లాహిరి లాహిరి పేరుతో, నాగేశ్వరరావుగారు నటించిన చిత్రాలలోని పాటలు,
సుహానాసఫర్ టైటిల్‌తో హిందీపాటలు, సాయిబాబా భజనల సీడీలు కలిపి ఇప్పటివరకు
మొత్తం 10 సీడీలు విడుదలయ్యాయి.
అమెరికాలో 35 కేంద్రాలలో, రష్యాలో ప్రదర్శనలిచ్చారు.






