కపిలాపురంలో గోపాలం, గోవిందం అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. గోపాలానికి
ధనాశ ఎక్కువ. అతను ఒకసారి గోవిందం దగ్గర పెద్దమొత్తంలో ధనం అప్పుగా
తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా గోపాలం అతనికి డబ్బు తిరిగి
ఇవ్వకపోగా గోవిందం వెళ్లిన ప్రతిసారీ ఏవో అబద్ధాలు కల్పించి చెప్పసాగాడు.
ఒకనాడు గోవిందం గోపాలం ఇంటికి వెళ్లి ‘‘నా అప్పు ఎప్పుడు తీరుస్తావు?’’ అని
గట్టిగా నిలదీయడంతో గోపాలం కిందపడి గిలగిల కొట్టుకుం టూ అనారోగ్యం
ఉన్నట్టు అభినయించసాగాడు.
అంతలో అతని భార్య లోపలి నుంచి వచ్చి
‘‘అయ్యో! అయ్యో! అనారోగ్యంతో బాధపడుతున్న నా భర్తను డబ్బు కోసం
పీడిస్తావా?’’ అంటూ శాపనార్థాలు పెట్టసాగింది.
గోవిందం ఇవతలికి రాగానే
భార్యభర్తలిద్దరూ ‘బాగా కుదిరింది. ఇక నుంచి గోవిందం ఎప్పుడు వచ్చినా
ఇలాగే చేయాలి’ అనుకోవడం అతని చెవినపడింది.
గోవిందం కొంతకాలం
తర్వాత మళ్లీ వెళ్లి డబ్బు అడగబోగా, గోపాలం ఈసారి కూడా కిందపడి గిలగిల
కొట్టుకోసాగాడు. అతని భార్య గోవిందాన్ని తిట్టడం మొదలుపెట్టింది.
వీళ్ల నాటకాన్ని ఎలాగైనా బయటపెట్టాలనుకున్న గోవిందం ఈ విషయం మొత్తం గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు.
గ్రామాధికారి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం గోవిందం కొద్దిరోజుల తర్వాత
మళ్లీ గోపాలం ఇంటికి వెళ్లి ‘‘నా అప్పు ఎప్పుడు తీరుస్తావు’’ అని అడగటంతో
గోపాలం కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు.
అప్పుడే లోపలికి వచ్చిన
గ్రామాధికారి తన వెంట వచ్చిన గ్రామవైద్యుడికి సైగ చేయడంతో వైద్యుడు గోపాలం
నాడిని పరీక్షించి, ‘‘అయ్యా! ఇతని పరిస్థితి ఆఖరి దశలో ఉంది. ఏవైనా
ముఖ్యమైన పనులు వుంటే పూర్తి చేయడం మంచిది’’ అన్నాడు.
అంతట
గ్రామాధికారి గోపాలం ఇల్లు అతని తదనంతరం అతని భార్యకు చెందాలి. భోషాణం
పెట్టెలోని డబ్బు గోవిందం ఇచ్చిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాలి’’
అన్నాడు. గోపాలానికి తగిన శాస్తి జరిగిందని అందరూ సంతోషించారు.
0 comments:
Post a Comment