Monday, January 28, 2013

జంక్ అంటే జంకండి!

మీ ఇంట్లో పిజ్జా, బర్గర్, పఫ్, ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ లాంటివి తినని పిల్లలు ఉన్నారా? వచ్చే సమాధానం లేరు అనే. ఇప్పుడు మనం పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లను నిరోధించలేం. సంప్రదాయ ఆహారాలను తయారు చేసుకోడానికి ఎంతో సమయం పడుతున్న వేళల్లో త్వరగా లభ్యమవుతున్నవాటిని రాకుండా అడ్డుకోలేం. కానీ అందులోని హానికరమైన అంశాలను గుర్తించి విచక్షణతో మెలగాలి. మనం ఆ ఆహార పదార్థాలను తీసుకుంటున్నప్పుడు వాటితో కలిగే హానిని కూడా గ్రహిస్తే వాటిని పరిమితం చేసుకోగలుగుతాం. అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటాం. అలాంటి విచక్షణను కలిగించేందుకే ఈ కథనం.

మనం ఆహారం కోసం ఏదో తింటుంటాం. అదే సమయంలో రుచిగా ఉండాలని కూడా కోరుకుంటాం. పిజ్జా, బర్గర్, పఫ్స్, చిప్స్ లాంటివి చాలా త్వరితంగా లభ్యమవుతున్నాయి. పైగా రుచి కూడా. అలాంటప్పుడు వాటిని తింటే తప్పేమిటి అనుకోకండి. వాటిని ప్రాసెస్‌డ్ ఫుడ్స్ అంటారు. ఏదైనా ఒక ఆహార పదార్థం దీర్ఘకాలం నిల్వ ఉండటానికీ, మరింత రుచిగా ఉండటానికి కొన్ని ప్రక్రియ (ప్రాసెస్)లను అనుసరిస్తాం. ఆ ప్రాసెస్‌ల వల్ల రుచి, చాలాకాలం నిల్వ ఉండే శక్తి (షెల్ఫ్‌లైఫ్) లభిస్తాయి. ఒక పదార్ధాన్ని నూనెతోనో, లేదా నేతితోనో చేస్తే త్వరగా చెడిపోవచ్చు. అందుకే అందులో దీర్ఘకాలం నిల్వ ఉంచే పదార్థాలు వాడతారు. వాటినే ప్రిజర్వేటివ్స్ అంటారు. ఇలా నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాల మీద ఆధారపడాల్సి వస్తుంటుంది. నిజానికి మనం తీసుకునే ఆహారంలో అందులోని స్వాభావిక పోషకాలతో ఎలాంటి హానీ లేకపోయినా... ఈ రసాయనాలే ప్రమాదకారి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో చాలాకాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి వాటిని కాస్త ఆలోచించి తినాలని సూచిస్తుంటారు నిపుణులు.

ఆహారాన్ని నిల్వ ఉంచేలా చేసే ఆ నూనె ఏమిటి?

స్వాభావికమైన వెన్న వాడితే దానితో చేసిన పదార్థం చాలా రుచిగా ఉంటుంది. కానీ వెన్న త్వరగా చెడిపోతుంది. అలా చెడకుండా ఉండే పదార్థం ఏదైనా ఉండి, అది వెన్నలాంటి రుచి ఇస్తే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన నుంచి వచ్చిన పదార్థమే హైడ్రోజనేటెడ్ ఆయిల్. ఇందులో మామూలు వంటనూనె (వెజిటబుల్ ఆయిల్)ను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి, అందులోకి హైడ్రోజెన్‌ను పంపుతారు. దీన్నే హైడ్రేజనేషన్ అంటారు. దాంతో నూనె కాస్తా వెన్నలాంటి పదార్థంగా మారిపోతుంది. వెన్నలాంటి రుచే ఇస్తుంది. ఇక్కడ ఇది రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంటుంది. ఒకటి... నూనె ద్రవరూపంలో ఉంటే దాన్ని వాడుకోవడం ఒకింత కష్టం. దూరం తీసుకెళ్లాలంటే ఒలికిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇది ఘనరూపంలో ఉంది. కాబట్టి ఒలికిపోయే ప్రమాదం లేదు. ఫలితంగా నిల్వకూ, రవాణాకూ, వాడుకోడానికీ చాలా సులభం. ఇక రెండో ప్రయోజనం... ఇది స్వాభావికమైన దానికంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

వెన్నలో ఏముంది.. మరి వెన్నలాంటిదాంట్లో ఏముంది?

వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వీటితో పాటు బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి. బ్యుటిరేట్ మానసిక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. తిన్న ఆహారమంతా ఒంటికి పట్టేలా చేస్తుంది. చిన్నపేగుల్లో వాపు, నొప్పి, మంటల (ఇన్‌ఫ్లమేషన్)ను తగ్గిస్తుంది. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) గుండె ఆరోగ్యానికి మంచిది. వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న ఎంతో ఉపయోగం. అంటే బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. మరి వెన్నలాంటి ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్‌లో పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇచ్చే గుణాలున్నాయి. ఇది గుండెకు మంచిది కాదు, శరీరంలోని కొవ్వును పెంచుతుంది. ఫలితంగా స్థూలకాయాన్ని కలిగిస్తుంది. పైగా ఇది క్యాన్సర్ కారకం కూడా.

అలర్జీలూ... మానసిక వ్యాధులు

మనం ఆహారంలో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్‌లో చాలా వరకు రసాయన పదార్థాలే కావడంతో ఒక్కోసారి అవి శరీరానికి సరిపడకపోవడం వల్ల అవి తీసుకున్న వారిలో అలర్జీలు కలగడం మామూలే. అంతేకాదు... షెల్ఫ్‌లైఫ్ ఎక్కువగా ఉండటానికి చేసే రకరకాల ఆహారాలతో పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే మానసిక వ్యాధి రావడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా కనిపిస్తున్న అంశం.

ఎర్రగా ఊరిస్తోందా...? ఒక్క క్షణం ఆగండి...

మీరు ఏదైనా బేకరీలోకి వెళ్లినప్పుడు అందులో నిల్వ ఉన్న చికెన్ ఐటమ్ ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించిందా? అది మరీ ఎర్రగా ఉందంటే దానికి సోడియమ్ నైట్రేట్‌పాళ్లు ఉన్న ప్రిజర్వేటివ్ కలిపారని అర్థం. చికెన్ మంచి పోషకమే అయినా దాంతోపాటు జత కలిసి ఉన్న సోడియమ్ నైట్రేట్ కారణంగా అది కోలోరెక్టల్ క్యాన్సర్‌ను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ల్యూకేమియాలను కలిగించే పదార్థంగా మారుతుంది. అందుకే ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే మాంసాహార బేకరీ పదార్థాలను తక్కువగానే తీసుకోవాలి. ప్రత్యామ్నాయ ఆహారాలుంటే వాటిని మానేసి ఏ శాండ్‌విచ్‌వైపో మొగ్గుచూపాలి. (అప్పుడు శాండ్‌విచ్‌లలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్‌కు బదులు స్వాభావికమైన వెన్న వాడిన వాటినే తీసుకోవాలని గుర్తుంచుకోండి).

కూల్‌డ్రింక్స్‌లోని కృత్రిమ రంగులు - ప్రిజర్వేటివ్స్

మనం కూల్‌డ్రింక్స్ తాగే సమయంలో వాటితో పాటు కొన్ని కృత్రిమ రంగులనూ బలవంతంగా శరీరంలోకి పంపుతాం. వాటిని అక్కడ ఉంచడానికి మన మూత్రపిండాలు అస్సలు ఒప్పుకోవు. అందుకే వీటిని బయటకు పంపేందుకు అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్రపిండాల దెబ్బతింటాయి. ఇక కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాలు దోహదపడతాయి. అవే... సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్. కొన్ని సందర్భాల్లో సన్‌సెట్ ఎల్లో, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్, సోడియ మ్ బెంజోయేట్ వంటి అనేక రసాయనాల మిశ్రమాన్ని ఒకే ప్రిజర్వేటివ్స్‌గా కూడా వాడతారు. వీటివల్ల పిల్లలకు కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.

ఉదాహరణకు... సోడియం బెంజోయేట్ అనే రసాయనం మనం తీసుకున్న విటమిన్ ‘సి’తో కలిసినప్పుడు ఇది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుంది. బాగా వయస్సు పైబడటం లేదా అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో సోడియమ్ బెంజోయేట్ తీసుకున్న వారిలోనూ అచ్చం అలాంటి దుష్పరిణామాలే కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని ఇటీవలి కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా అదే పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్‌ను రూపొందించడానికి విశేష పరిశోధనలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే అప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు గణనీయంగా తగ్గవచ్చు. అప్పటివరకూ మనం ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటున్నా, కూల్‌డ్రింక్స్ తాగుతున్నా అప్రమత్తంగా ఉంటూ పరిమితంగా తీసుకోవడం తప్పదు.

కూల్‌డ్రింక్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్‌తో: దీనివల్ల దంతాలపై ఉండే అనామెల్ పొరను దెబ్బతింటుంది. దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఈ పొర దెబ్బతినడం, పళ్లపై మరకలు, చారలు ఏర్పడటం ఇప్పటికే కనిపిస్తున్న అనారోగ్యకరమైన పరిణామం. కూల్‌డ్రింక్స్ కంపెనీలు మాత్రం తమ పానీయాల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ కేవలం అనుమతించిన మోతాదుల (పర్మిసిబుల్ లిమిట్స్)కు మించకుండా వాడుతున్నామని చెబుతుంటాయి. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల అది క్యాల్షియం మెటబాలిజమ్‌ను దెబ్బతీస్తుంది. దాంతో ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

అందుకే బేకరీలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి ఈ అంశాలన్నీ గుర్తు తెచ్చుకుని మీరు తీసుకోబోయే ఆహారాన్ని వీలైనంతగా పరిమితం చేసుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

ఉప్పు కూడా ఒక ప్రిజర్వేటివే...

మనం ఆహారంలో తీసుకునే ఉప్పు కూడా ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో ఒక ప్రిజర్వేటివ్‌గా వాడతారని మీకు తెలుసా? ఉప్పు వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు... మనకు బాగా తెలిసిన ఉదాహరణ రక్తపోటు మాత్రమే. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ ఉప్పు ఎక్కువగా వాడితే జీర్ణాశయం లోపలి గోడలపై ఉన్న పొరలు దెబ్బతింటాయి. ఫలితంగా అట్రోఫిక్ గ్యాస్ట్రయిటిస్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వంటి జబ్బులూ రావచ్చు. మనం వాడే ప్రాసెస్‌డ్ ఫుడ్స్, అప్పడాలు, ఊరగాయలు (పచ్చళ్లు)... వీటన్నింటిలోనూ ఉప్పు ఎక్కువ. అందుకే వాటిని తక్కువగా తీసుకోవాలి.

కలుషితాహారం తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు

ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు అవుతుంటే మీరు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటమో లేదా ఓఆర్‌ఎస్ తీసుకుంటూ ఉండటమో చేస్తూ మీ శరీరం లవణాలనూ, నీటిని కోల్పోకుండా చూసుకోండి.

వాంతులు, విరేచనాలు మరీ ఎక్కువగా ఉంటే సాధారణంగా దొరికే యాంటీ-వామిటింగ్ అండ్ డయేరియా మందులను డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. ఆన్ కౌంటర్ మెడిసిన్ వద్దు.

వాంతులు, విరేచనాలు సాధారణ యాంటీ వామిటింగ్ అండ్ డయేరియా మందులతో తగ్గకపోతే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించడం వంటివి చేస్తారు.

వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట లభించే పాల ఉత్పాదనలు వాడవద్దు.

0 comments:

Post a Comment