Tuesday, January 8, 2013

ప్రతి పాటా ఒక కచేరి! - A.R. Rahman

‘‘మనందరిలో దైవాంశ ఉంది - ఇదే మనందరినీ ఒకటి చేస్తోంది. మన శరీరాలు వేర్వేరు. మన ముఖాలు వేర్వేరు. కానీ అంతరంగంలోకి తొంగి చూస్తే మనమంతా ఒకటే. మన భావనలూ ఒకే రకం. బాధ, సంతోషం, ప్రేమ, విషాదం... ఈ భావనల్లోంచి నా సంగీతం ఉద్భవిస్తుంది. అది జపానీ సంగీతమైనా, ఆఫ్రికా సంగీతమైనా, ఖవ్వాలీ అయినా లేక ఇంకా ఇతర రకమైన సంగీతమైనా ప్రజల హృదయాలను స్పందింపజేయాలి. అప్పుడే నా సంగీతానికి సార్థకత లభిస్తుంది.’’
- ఎ.ఆర్. రెహమాన్, సంగీత దర్శకులు

భారతీయ సినీ సంగీతాన్ని విప్లవాత్మకమైన రీతిలో రూపాంతర మొందించిన కళాకారుడు ఎ.ఆర్.రెహమాన్. సినీసంగీత రూపకల్పనను అనూహ్యమైన రీతిలో ఆధునికీకరణం చేసి, తనదైన ప్రత్యేక శైలితో ప్రతి ఒక్క కళాకారుడూ తన బాటలో, తననుసరించే రీతిలో ప్రభావితం చేసిన అత్యంత ప్రతిభావంతుడు ఆయన. రెహమాన్ సంగీతం ఎంత సృజనాత్మకమో అంత విభిన్నం. పాశ్చాత్య సంగీత ధోరణులైన ర్యాప్, జాజ్, రాక్, ఫంక్‌లను పాశ్చాత్య సంప్రదాయక సంగీతంతో ముడిపెట్టి, వాటిని కర్నాటక, హిందుస్తానీ సంగీతంతో జతపరచి, ఆపై ఖవ్వాలీ, సూఫీ రాగాలతో మిళితం చేసి, జానపద లయల హొయలతో చిలకరించి, వినగానే మనసును పట్టి, వింటున్నకొద్దీ ఆత్మను ఉర్రూతలూపి, మైమరపించే మృదుమధురమైన సంగీత సృజన సరసనే, ఒళ్లు వెర్రెక్కి ఆనందంతో ఊగిపోయే ఆధునిక నృత్య స్వర రచననూ చేసి పాపులర్ సంగీతాన్ని పునర్నిర్మించిన సంగీత సామ్రాట్ రెహమాన్.

సినీసంగీతం రొటీన్ శబ్దాలమయమై తన ఆకర్షణను కోల్పోతూ ప్రైవేట్ పాప్ పాటలు, గజళ్లకు తలవంచే సమయంలో ‘రోజా’ సినిమా పాటలతో సినీపాటల ప్రపంచాన్ని తాజా పరిమళాలతో నింపేశాడు రెహమాన్.

‘చిన్ని చిన్ని ఆశ’తో సంగీత ప్రపంచంలో పెద్దపెద్ద అడుగులు వేస్తూ ఎవరికీ అందనంత ఎత్తులకు ఎదిగిన రహమాన్, ఆరంభంలో ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథన్‌తో సహా అనేక సంగీత దర్శకుల వద్ద పనిచేశాడు. వారి గాన సృజన పద్ధతులను, నేపథ్య సంగీత సృజన పద్ధతులను ఆకళింపు చేసుకున్నాడు. ఒక వాయిద్యం సృజించే స్వరంపై పట్టు సంపాదిస్తే సరిపోదు, ఆ స్వరం ఆత్మను గ్రహించాలని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, అనేక వాయిద్యాలు ఎంత విభిన్నమైన స్వరాలను వినిపించినా, వాటన్నిటి ఆత్మ ఒకటేనని గ్రహించాడు. ఆ ఆత్మస్వరం, మనిషి ఆత్మస్వరాన్ని స్పందింపజేస్తుందని, అలౌకిక ఆనందానికి దారితీస్తుందని, భగవంతుడి అన్వేషణలో ఇదీ ఓ మార్గం అని గ్రహించాడు.

ఈ గ్రహింపు రెహమాన్ సంగీతానికి ఒక సార్వజనీనతను, వైశిష్ట్యాన్ని ఆపాదించింది. అందుకే, రెహమాన్ పాటలు ఎంత పాశ్చాత్యంగా ధ్వనించినా, వాటి ఆత్మ భారతీయ సంగీతంలో ఉంటుంది. రెహమాన్ పాటలు ఎంతగా భారతీయ సంప్రదాయ సంగీతంలో స్నానమాడినా, వాటి నేపథ్యంలో పాశ్చాత్య మాధుర్యం పరవళ్లు తొక్కుతుంటుంది. అందుకే రెహమాన్ సంగీతాన్ని ‘ఫ్యూజన్ సంగీతం’ అంటారు. ఈ పాశ్చాత్య, భారతీయ సంగీతాల నడుమ రెహమాన్ ప్రగాఢంగా విశ్వసించే సూఫీ తత్వచింతన సుధా రసధార అతని పాటలకు పవిత్రత పరిమళాన్ని అద్దుతుంది. అందుకే పాటలో ఒక స్వరం వినగానే ఇది రెహమాన్ సంగీతం అని గుర్తుపట్టవచ్చు.

చిన్ని చిన్ని ఆశ, చుకు బుకు రైలే, దొంగ దొంగ, ముక్కాలా ముక్కాబులా, ఛయ్య ఛయ్య, ఓ చెలియా నా ప్రియ సఖియా, హమ్మ హమ్మ వంటి పాటలతో భారతీయ సినీపాటలకొక నూతన దిశనిచ్చాడు రెహమాన్. స్వదేశ్, లగాన్, రంగ్ దె బసంతి వంటి సినిమాల్లోని పాటలతో అంతర్జాతీయ ఖ్యాతినార్జించాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమా సంగీతానికి ఆస్కార్ బహుమతి గెలుచుకోవటంతో, ప్రపంచ సినిమా సంగీతంపై తనదైన ప్రత్యేక ముద్ర వేయటం ఆరంభించాడు. ఇలా అంచెలంచెలుగా అనంత ఖ్యాతిని రెహమాన్ ఆర్జించటానికి అతని సంగీతంలోని ఏ లక్షణం దోహదం చేస్తోందని ఆలోచిస్తే ‘ఇదీ’ అని ఏ ఒక్క అంశాన్ని ఎత్తి చూపించటం కష్టం. ఉదాహరణకు ‘రోజా’ సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ పాట ఆరంభ సంగీతాన్ని, ‘నా చెలి రోజా’ పాట ఆరంభ సంగీతాన్ని పోలిస్తే వాయిద్యాల వాడకంలోను, బాణీకి తగ్గ లయను సృజించటంలోను ఎంతో వైవిధ్యం, సృజనాత్మకత కనిపిస్తాయి.

అలాగే ‘బొంబాయి’ సినిమాలో ‘కెహ్‌నా హై క్యా’ పాటలో చిత్ర స్వరం పలికిన హొయల లయలు పూర్తవుతూనే ‘నుస్రుత్ ఫతే అలీ ఖాన్’ సూఫియానా రాగాలు పలకటం ఎంత మధురంగా ఉంటుందో, అంతగా ఆత్మను ఉర్రూతలూగిస్తుంది. ఇదొక ‘ట్రెండ్ సెట్టింగ్’ పాటగా ఎదిగింది. ఇదే సూఫియానా సంగీతాన్ని అటు రొమాన్స్‌కు, ఇటు భక్తి పాటలకు ఎంతో గొప్పగా వాడటం రెహమాన్ సృజనలోని ప్రధానాంశం. పియ హాజి అలీ, ఖ్వాజా మెరీ ఖ్వాజా ఎంత భక్తి భావాన్ని పొంగిస్తాయో, తెరెచినా (గురు) పాట రొమాన్స్‌ను, అంతే పవిత్రంగా ధ్వనింపజేస్తుంది. స్వదేశ్‌లో ‘యే తార వో తార’, ‘యూ హి చలాచల్’, ‘సావరియా సావరియా’ పాటలు ఎంత భారతీయతను ప్రదర్శిస్తాయో, ‘జోథా అక్బర్’లో జష్నె బహారా, ఇన్ లమ్హోంకె దామన్ పాటలు అంతగా మొఘల్ కాలం నాటి ప్రణయ భావనను ప్రదర్శిస్తాయి.

ఇదే సినిమాలో ‘అజీమో షాన్ షెహెన్షా’ పాట ఆధునిక వాయిద్యాల లయతో మొఘల్ కాలం నాటి ఆవేశాన్ని, శౌర్య ప్రతాపాలను సజీవంగా వినిపిస్తుంది. ‘తాల్’ సినిమా పాటల లయలు బ్యూటీ క్వీన్ ఐశ్వర్యారాయ్ అందానికి నూతన మెరుగులు దిద్దాయి. ‘ఏ మాయ చేసావె’లో ఈ హృదయం, కుందనపు బొమ్మ వంటి పాటలు నవ యువ శృంగారానికి నూతన వన్నెలద్దాయి. ఇలా అత్యంత విభిన్నమైన, విశిష్టమైన సంగీతాన్ని రెహమాన్ సృజించే పద్ధతి అత్యంత ఆశ్చర్యకరంగా, ఆధునికంగా ఉంటుంది.

వేర్వేరు వాయిద్యకారులను పిలిచి ఓ అరగంటసేపు వారిని వారి ఇష్టం వచ్చిన బాణీలు వాయించమంటాడు. దాన్ని రికార్డు చేసుకుంటాడు. ఆ తరువాత సందర్భానికి తగ్గ పాట రాయించుకుంటాడు. ఓ బాణీ అనుకుంటాడు. ‘లయ’ ఆధారంగా గాయనీ గాయకులతో వారి ఇష్టం వచ్చినట్టు పాడిస్తాడు. ఆపై వీటన్నిటినీ ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో లయబద్ధంగా కూరుస్తాడు. అంటే, అనేక దృశ్యాలను చిత్రీకరించి వాటిని ‘ఎడిట్’ చేసినట్టు విభిన్నమైన స్వరాలను, ధ్వనులను ఒకచోట చేర్చి పేర్చి ఒక అందమైన ముత్యాల హారాన్ని ‘కూర్చి’ అందిస్తాడన్నమాట. అందుకే రెహమాన్ పాటలలో ఒక అనూహ్యత ఉంటుంది. కొన్ని వాయిద్యాలు హఠాత్తుగా అద్భుతమైన పోకడలు పోతాయి. ‘కుచ్చి కుచ్చి రక్కమ్మ (బొంబాయి)’, ‘కభి నీమ్ నీమ్ (యువ)’, ‘ముదినే పల్లి (జెంటిల్మెన్)’ వంటి పాటలు జానపద బాణీలుగా ధ్వనిస్తున్నా వాటికోసం వాడిన వాయిద్యాలు, అవి సృజించిన ధ్వనులు అత్యంత పాశ్చాత్యం. కానీ ఈ రెండు ఎలా మిళితమై పోతాయంటే మొత్తం జానపదంలా తోస్తుంది.

ఇలాంటి అనేక విభిన్నమైన ప్రయోగాలు స్వరాలతో చేయటం వల్లనే రెహమాన్ బాణీలు విలక్షణంగా, విభిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. అందుచేతే రెహమాన్ ప్రతి పాట ఓ సంగీత కచేరీలా, ఆర్కెస్ట్రా సింఫోనీ సృజనలా ఉంటుంది. ‘లాజిక్ ప్రో’ వాడుతూ రింగ్ షిఫ్టర్, మల్టి ప్రాసెసర్, ఈఎస్‌ఎస్‌టూఫోర్, ఈవీపీ88 వంటి ఆధునిక పరికరాల సహాయంతో ధ్వనులను కలిపి లయను సృజిస్తాడు. బంగారాన్ని కరిగించి తీగలుగా లాగి ఆకర్షణీయమైన రూపాలు ఏర్పాటు చేసినట్టు పాటలను రూపొందిస్తాడు. సింథసైజర్, గిటార్, హర్పెజ్, డ్రమ్స్, పియానో, ఆకార్డియన్, ఫ్లూట్ వంటి వాయిద్యాలతో పాటు మానవ స్వరాన్నీ ఓ వాయిద్యంలా వాడటంతో పాటకొక విభిన్నమైన శోభ ఏర్పడుతుంది. అందుకే రెహమాన్ తన పాటలలో విభిన్నమైన స్వరాలను వాడతాడు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీసంగీతానికి తన సృజనాత్మక అభినివేశంతో గౌరవాన్ని, ప్రామాణికతను ఆపాదిస్తున్నాడు రెహమాన్. దేశంలోని పలు భాషలలో సంగీతాన్ని అందిసున్నారాయన.. కానీ అతని పాటల గొప్పతనం స్పష్టంగా అర్థం కావాలంటే ‘తమిళ’ భాషలోని పాటలను వినాలి. ఇవే పాటలు హిందీలోకి వచ్చేసరికి కొద్దిగా మారతాయి. రెహమాన్ సృజనలోని గొప్పతనం, సినీ సందర్భాన్ని అర్థం చేసుకుని ఔచితీవంతమైన బాణీలను సృజించటం అర్థం కావాలంటే ‘ఎర్ట్ 1947’లో ‘రైత్ ఆగయి హై’ పాట బాణీ, వాయిద్యాల వాడకం గమనించాలి. ఈ పాట రెహమాన్ ప్రతిభ అనే కొండను చిన్న అద్దంలో చూపుతుంది. అందుకే రెహమాన్ కన్నా ముందు ఎందరో ప్రతిభావంతులు సరస్వతీదేవి కంఠాన మణిహారంలో మణులుగా వెలిగారు. రెహమాన్ మాత్రం సరస్వతీదేవి కంఠాన వెలిగే ప్రత్యేక రత్నాల హారంగా నిలుస్తాడు.
- కస్తూరి మురళీకృష్ణ

ఎ.ఆర్. రెహమాన్ చిన్ని చిన్ని విషయాలు

జననం: జనవరి 6, 1966;

తల్లిదండ్రులు: కరీమా (అసలు పేరు కస్తూరి), ఆర్.కె.శేఖర్

అసలు పేరు: దిలీప్‌కుమార్. సోదరికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మసీదులో ప్రార్థించటం వల్ల ఆమె ఆరోగ్యవంతురాలైంది. దాంతో ఇస్లాం స్వీకరించారు. అయితే ఓ జ్యోతిష్కుడు దిలీప్‌కుమార్ నుంచి రెహమాన్‌గా పేరు మార్చుకోమని సూచించటంతో దిలీప్‌కుమార్ అల్లా రఖా రెహమాన్ అయ్యాడు.

ఇళయరాజాతో: చాలామంది రెహమాన్‌ను ఇళయరాజాతో పోల్చి వాద ప్రతివాదాలు చేస్తూంటారు. కానీ వారిద్దరి నడుమ చక్కని స్నేహం ఉంది. ఇళయరాజా, రెహమాన్ తండ్రి వద్ద పనిచేశాడు. రెహమాన్ తండ్రి మరణించిన తరువాత అతని వాయిద్యాలను ఇళయరాజా అద్దెకు ఇచ్చేవాడు. రెహమాన్, ఇళయరాజా వద్ద సహాయకుడిగా పనిచేశాడు.

గేయ రచయిత: రెహమాన్ అప్పుడప్పుడు పాటలు వినడమే కాదు రాస్తాడు కూడా. అధికంగా సూఫీయానా తరహా పాటలు పాడటానికి ఇష్టపడతాడు.

గాయకులు, వాయిద్యాలు: రెహమాన్ ప్రచారంలోకి తీసుకువచ్చినన్ని కొత్త స్వరాలు మరే సంగీత దర్శకుడు తేలేదు. అలాగే, తనకు వాయిద్య సహకారం అందించిన వారి పేర్లూ ఆల్బమ్‌పై ఇచ్చి వారికీ ప్రాచుర్యం కల్పించే సత్సంప్రదాయాల్ని రెహమాన్ ఆరంభించాడు. అందుకే ‘శివమణి’ లాంటి వాయిద్యకారులూ గుర్తింపు పొందుతున్నారు.

స్వయంగా పాడిన టాప్ టెన్ హిట్స్
1. ఊర్వశీ ఊర్వశీ (కాదలన్, 1994)

2. హమ్మ హమ్మ (బొంబాయి, 1995)

3. మాంగ్తా హై క్యా (రంగీలా, 1995)

4. ముస్తఫా ముస్తఫా (కాదల్ దేశం 1996)

5. కొలంబస్ కొలంబస్ (జీన్స్, 1998)

6. ఇష్క్‌బినా (తాల్, 1999)

7. పియ హాజి అలీ (ఫిజా, 2000)

8. యేజో దేశ హై తేరా (స్వదేశ్, 2004)

9. రూబరూ (రంగ్ దె బసంతి, 2006)

10. తెరెబినా (గురు, 2007)

ఇక రెహమాన్ పాడిన ప్రైవేటు పాట ‘వందేమాతరం’ యువతను ఉర్రూతలూపింది. ‘వందేమాతరం’ పాటను ఆధునికీకరణం చేసింది.

0 comments:

Post a Comment