మనదేశంతో సహా చాలా దేశాల్లో బాగా ప్రచారంలో ఉన్న నమ్మకాల్లో ‘నిమ్మరసం
తాగితే జలుబు చేస్తుంది’ అన్నది కూడా ఒకటి. వానలో తడిస్తే లేదా తడి
జుత్తుతో బయట తిరిగితే లేదా ఐస్‌క్రీమ్‌లు తింటే జలుబు చేస్తుంది... అనేవి
ఎలా ప్రచారంలోకి వచ్చాయో ఇది కూడా అలాగే ప్రచారంలోకి వచ్చింది. ఇక అసలు
విషయంలోకి వస్తే...సాధారణంగా కొన్నిరకాల వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశించి
మనపై తమ ప్రతాపాన్ని చూపించినప్పుడు మనకు జలుబు చేస్తుంది.
అందుకని నిమ్మరసం తాగడం వల్ల జలుబు చేస్తుంది అన్నది సరైనది కాదు. అంతేకాదు, జలుబు చేసినవాళ్ళు నిమ్మరసం తాగకూడదు అన్నది కూడా సరైనది కాదు. ఎందుకంటే నిమ్మరసం తాగడం వలన జలుబు రాదు సరికదా, వచ్చిన జలుబు తగ్గుముఖం పడుతుంది.
నిమ్మరసంలో ‘విటమిన్-సి’ అనేది పుష్కలంగా ఉంటుందన్న సంగతి మీకు తెలుసు కదా! అది మన శరీరపు రోగనిరోధకశక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే నిమ్మరసం తీసుకోవడం వలన జలుబు వైరస్‌లతో పోరాడే శక్తి మన శరీరానికి మరింతగా పెరుగుతుందన్నమాట.
అరటి, ఆపిల్స్, బత్తాయిలు వంటి పళ్ళతో సహా అన్నిరకాల పళ్ళను పుష్కలంగా తినమని డాక్టర్లు మరీమరీ చెప్పేది ఎందుకో తెలుసా? అవి మనకు మంచి పోషకాలను అందించడమేగాక మన వ్యాధినిరోధకశక్తి (వ్యాధులతో పోరాడి వాటిని అడ్డుకునే శక్తి)ని పెంచుతాయి.
అందుకని కేవలం నిమ్మపళ్ళ విషయంలోనేగాక ఏ పళ్ళ విషయంలోనూ అనవసరమైన ఆలోచనలను పెట్టుకోకండి.
0 comments:
Post a Comment