వెదురుతో
చేసిన వేణువుకైతే ఆరేడు రంధ్రాలుంటాయి, కానీ ఈల పాడేవారికి మాత్రం ఒకే ఒక
రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి సప్తస్వరాలనూ, 72 మేళకర్త రాగాలలో
పలికించాలి. ఎవరైనా ఈల వేయగానే టక్కున గుర్తు వచ్చే పేరు ఈలపాట రఘురామయ్య.
శివప్రసాద్ కూడా ఈల కుటుంబానికి చెందినవారే. ఉచ్ఛ్వాసనిశ్వాసలలో కూడా
రాగాలు పలికించడం వీరి ప్రత్యేకత. నేడు ఆయన బాలమురళితో రాగప్రవాహం
చేస్తున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూ.
మలుపు తిప్పిన ఘటన...
1980లో ఒకసారి బాలమురళీకృష్ణ హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆయనకు ఎంతో ఇష్టమైన
చక్రవాక రాగంలోని ‘పిబరే రామరసం’ ఆలపించాను. అది ఆయన మెచ్చి, నన్ను ఆయన
శిష్యుడిగా స్వీకరించి, గొప్పవాడిని చేస్తానన్నారు. పెద్దవాళ్లంతా ఇలాగే
చెప్తారులే అని మనసులో అనుకుని ఊరుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే... పదిరోజులు
గడవకుండానే నన్ను వెంటనే బయలుదేరి రమ్మని ఆయన స్వహస్తాలతో రాసిన ఉత్తరం
రావడంతో. నేను వెంటనే మద్రాసు వెళ్లాను. గురువుగారే నన్ను స్వయంగా వారి
ఇంటికి తీసుకువెళ్లారు. అంతకు ముందు మాజీ మంత్రి కోనప్రభాకరరావు నన్ను
ఎందరెందరికో పరిచయం చే యడం నాకెంతో మేలు చేసింది.
జీవితంలో మరచిపోలేను!
ఒకరోజు గురువుగారు వారి ఇంటికి వచ్చిన అతిథుల ముందు నన్ను ఒక కీర్తన
పాడమన్నారు. నేను ‘‘తెలిసి రామచింతనతో’’ కీర్తన ఈల మీద ఆలపించాను. అది
విన్న వెంటనే నా కీర్తనలను సీడీ రూపంలో తీసుకు వస్తామని, నన్ను
రికార్డింగ్‌కి తీసుకెళ్లారు. అందులో బాలమురళిగారు ‘కంజీర’ మీద వాద్యసహకారం
అందించటం నా జీవితంలో మధుర ఘట్టం.
ఆశీర్వచనంలా భావిస్తున్నాను
గురువుగారితో ఎన్నో కచేరీలు చేశాను. అందరిలో ఒకడిగా పక్కవాద్యాల వారితో
కూర్చున్నాను. ఆయనతో విడిగా పాడటం మాత్రం ఇదే ప్రథమం. ఇంతకు ముందు
బిస్మిల్లాఖాన్‌తో జుగల్‌బందీ చేశాను. అప్పుడు నాకు ‘‘శహనాయ్’’లో వచ్చే
ప్రత్యేకమైన అంశాలను గురువుగారు గురువుగారే నేర్పారు. అయితే ఇది నేను
గురువుగారితో పాడుతున్నాను కనుక దీనిని జుగల్‌బందీ అనను. ఆయనతో పాడే
అవకాశాన్ని ఇచ్చినందుకు దానిని ఆశీర్వచనంలా భావిస్తున్నాను.
విని నేర్చుకున్నాను
సైగల్, సురయ్యా పాడినవి, పన్నాలాల్ ఘోష్, ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు..
వీరందరి కచ్చేరీలను బాగా వినేవాడిని. ఏ పని చేస్తున్నా ఈలతో పాటలు
పాడుతూనే ఉండేవాడిని. రఘురామయ్యగారు కేవలం గాలిలోపలకు మాత్రమే పీల్చుతూ
ఈలపాట పాడేవారు. నేను ఉచ్ఛ్వాస, నిశ్వాసలు రెండింటిలోనూ పాడగలను. నా పాటలకు
ఆయన సంతోషంతో 1000 బహూకరించటం అపురూపమైన బహుమతి అయితే నాకు ఇందిరాగాంధీ
ప్రశంసలు లభించటం నా జీవితంలో మరపురాని మధురానుభూతి.
గురువుల ఆశీర్వాదమే...
గురుముఖంలో నేర్చుకున్న దానికంటె, గురువుల దగ్గర చూసి నేర్చుకున్నదే
ఎక్కువ. ఆలాపన ఎలా చేస్తారన్నది వారి దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఈల పాట
పాడేటప్పుడు మాధుర్యమైన శబ్దం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అందుకే
జనరంజకంగా ఉండే... నయనకాంతి, హంసానందిని, హిందోళ వంటి రాగాలను
ఎన్నుకొంటాను.
పుష్కరకాలంగా జరుగుతున్న కార్యక్రమం!
2000 సంవత్సరం జనవరి 1 నుంచి నూతన సంవత్సరం నాడు ఏదో ఒక కాన్సెప్ట్
ఆధారంగా కచ్చేరీ జరుగుతోంది. ఈ సంవత్సరం గురువుగారితో ‘రాగప్రవాహం’
కార్యక్రమం చేస్తున్నాను. సంగీతమే స్వరసుఖదాయి(యమన్, కల్యాణి) తో
ప్రారంభిద్దామనుకుంటున్నాను. ముందర ఎవరికి వారు ఒక్కొక్క కీర్తన పాడతాం.
తరవాత వారన్నది నేను, నేనన్నది వారు అంటుంటాం. అలా కార్యక్రమం జరుగుతుంది.
ఆయనే సర్వస్వం...
బాలమురళిగారిని తండ్రిగా, గురువుగా, దైవంగా భావిస్తాను. నాకు
విద్యాబుద్ధులు నేర్పి, నన్ను ఒక స్థితికి తీసుకువచ్చింది ఆయనే.
సందర్భాన్ని బట్టి కీర్తనలను ఎంపిక చేసుకోవడమే బాలమురళి గారి విజయానికి
కారణం. అలా చేస్తేనే రాణిస్తుంది విద్య. ఆయన దగ్గర మెలకువలు నేర్చుకోవడం
వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానన్న విషయాన్ని నేనెన్నటికీ మరువను!
- డా. పురాణపండ వైజయంతి
శివప్రసాద్ ఇప్పటివరకు 25 దేశాలలో పర్యటించారు. సుమారు 8000 కచ్చేరీలు చేశారు.
1991లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివప్రసాద్ పేరు నమోదు అయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా విజిల్ మీద శాస్త్రీయ సంగీతం పాడుతున్నది వీరొక్కరే.
లాహిరి లాహిరి పేరుతో, నాగేశ్వరరావుగారు నటించిన చిత్రాలలోని పాటలు,
సుహానాసఫర్ టైటిల్‌తో హిందీపాటలు, సాయిబాబా భజనల సీడీలు కలిపి ఇప్పటివరకు
మొత్తం 10 సీడీలు విడుదలయ్యాయి.
అమెరికాలో 35 కేంద్రాలలో, రష్యాలో ప్రదర్శనలిచ్చారు.
0 comments:
Post a Comment