Saturday, December 8, 2012

Mohana Raagam

మోహన రాగం
మోహన రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు 1. లాహిరి లాహిరి లాహిరిలో… (మాయాబజార్‌) 2. చెంగు చెంగునా గంతులు వేయండి… (నమ్మిన బంటు) 3. ఎచటనుండి వీచెనో… (అప్పుచేసి పప్పుకూడు) 4. మనసు పరిమళించెను… (శ్రీ కృష్ణార్జున యుద్ధం) 5. అయినదేమో అయినది ప్రియ… (జగదేకవీరుని కధ) 6. మోహన రాగమహా మూర్తిమంత మాయే… (మహా మంత్రి తిమ్మరసు) 7. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే… (సాగర సంగమం) 8. పాడవేల రాధికా… (ఇద్దరు మిత్రులు) 9. వినిపించని రాగాలే కనిపించని… (ఆరాధన) 10. నను పాలింపగ నడచి వచ్చితివా… (బుద్ధిమంతుడు) 11. ఘనా ఘన సుందరా… (చక్రధారి) 12. సిరిమల్లే నీవె విరిజల్లు కావే… (పంతులమ్మ) 13. మదిలో వీణలు మ్రోగె… (ఆత్మీయులు) 14. నిన్ను కోరి వర్ణం… (ఘర్షణ) 15. మధుర మధురమీ చల్లని రేయీ… (విప్రనారాయణ) 16. మదిలోని మధుర భావం… (జయసింహ) 17. ఈనాటి ఈహాయి కలకాదోయి… (జయసింహ) 18. నల్లవాడే వ్రేపల్లె వాడే… (చిరంజీవులు) 19. తెల్ల వార వచ్చె తెలియక నా స్వామి… (చిరంజీవులు) 20. మౌనముగా నీ మనసు పాడినా… (గుండమ్మ కధ) 21. తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె… (మిస్సమ్మ) 22. చందన చర్చిత నీల కళేబర… (తెనాలి రామకృష్ణ) 23. ఆ మొగల్‌ రణధీరులు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం) 24. భారతీయుల కళా ప్రాభవమ్ము లిఖించి… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం) 25. కనులకు వెలుగువు నీవే కాదా… (భక్త ప్రహ్లాద) 26. శివ శివ శంకరా… (భక్త కన్నప్ప) 27. జ్యోతి కలశ… (భాభీ కీ చుడియా) 28. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో… (అమరశిల్పి జక్కన్న) 29. పులకించని మది పులకించు… ( పెళ్ళికానుక) 30. తిరుమల గిరి వాసా… (రహస్యం)           తెలుగు పాటల్లో మోహన రాగం వినిపించినంత విస్తృతంగా మరో రాగం వినపడదేమో! దీనికి ముఖ్య కారణం ఈ రాగంలో వినిపించే (వినిపించగలిగే) రకరకాలైన అనుభూతులు. స్వర పరంగా మోహన రాగం ఐదు స్వరాల (స, రి, గ, ప, ద) రాగమైనప్పటికీ, మోహనం ఇవ్వగలిగే abstractness వల్ల, సంగీతపరంగా చూపే లోతులలో ఉన్న వైవిధ్యాల వల్ల, శాస్త్రీయ సంగీతంలో ఈ రాగానికి ఒక విశిష్ట స్థానముంది. మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని మోహనం రాగానికి “దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో “భూప్‌”. స్వర పరంగా ఈ రెండు రాగాలు ఒకటే అయినప్పటికీ, శాస్త్రీయ సంగీతంలో పరిచయంఉన్న వారు ఈ రెంటినీ రెండు విభిన్న రాగాలుగా పేర్కొంటారు. మోహనం చాలా అవకాశం గల రాగం. (పైన మోహనం రాగంలో ఉన్న కొన్ని పాటల, పద్యాల లిస్టు చూస్తే, మోహనం ఎంత అవకాశం గల రాగమో అర్ధమవుతుంది. ) ఈ ప్రసిద్ధ రాగానికి నిర్దుష్టమైన రూపం, రసం, భావం ఉన్నాయి. (ప్రతి రాగానికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉన్నా, మోహనం వంటి నిర్దుష్టమైన రాగాలు మన సంగీతంలో కొన్ని మాత్రమే ఉన్నాయి.) అన్నివేళలా పాడటానికి అనువైన ఈ రాగం శృంగార, భక్తి, శాంత, వీర రస ప్రధానమైనది. తక్కువ స్వరాలే ఉన్నా ఎక్కువ రక్తి కలిగి శ్రోతలకు సులభంగా అర్ధమవుతుంది. మిగిలిన రాగాలతో పోలిస్తే, మోహనం విని ఆనందించటం సులభం. పాడటం సులభం. స్వరస్థానాలు పరిచయం ఏదైనా ఒక రాగం గురించి తెలుసుకొని, గుర్తు పెట్టుకోవాలంటే, స్వర జ్ఞానం అవసరం. సప్త స్వరాలైన ” స, రి, గ, మ, ప, ద, ని ” స్వరాలలో మూల స్వరాలైన “స, ప” లను మినహాయిస్తే, మిగిలిన ఐదు స్వరాలకి ఒక్కొక్క స్వరానికి రెండు స్వర స్థానాలున్నాయి.అందువల్ల, సప్త స్వరాలకి 12 స్వర స్థానాలున్నాయి. అవి వరుసగా, స్వరము కర్ణాటక పద్ధతి హిందూస్తానీపద్ధతి సంకేతము స షడ్జమం షడ్జ స రి శుద్ధ రిషభం కోమల్‌ రిషభ రి 1 రి చతుశ్రుతి రిషభం తీవ్ర రిషభ రి 2 గ సాధారణ గాంధారం కోమల్‌ గాంధార గ1 గ అంతర గాంధారం తీవ్ర గాంధార గ2 మ శుద్ధ మధ్యమం కోమల్‌ మధ్యమ మ1 మ ప్రతి మధ్యమం తీవ్ర మధ్యమ మ2 ప పంచమం పంచమ ప ద శుద్ధ ధైవతం కోమల్‌ ధైవత ద 1 ద చతుశ్రుతి ధైవతం తీవ్ర ధైవత ద 2 ని కైశిక నిషాధం కోమల్‌ నిషాద ని 1 ని కాకలి నిషాధం తీవ్ర నిషాద ని 2 మొత్తం పన్నెండు స్వరాలని వరుసగా ” స, రి 1, రి 2, గ 1, గ 2, మ 1, మ 2, ప, ద 1, ద 2, ని 1, ని 2 ” గా వ్రాసినట్టయితే, మోహనం ఉపయోగించే స్వరాలు ” స, రి 2, గ 2, ప, ద 2, “. ఇది ఔడవ (ఐదు స్వరాల) రాగం. అంటే, ఆరోహణలోనూ, అవరోహణలోనూ కూడా ఐదు స్వరాలు ” స రి గ ప ద స స ద ప గ రి స ” లాగా ఉపయోగించే రాగం. కానీ, రాగంలో స్వరాలు ఇదే పద్ధతిన ఒకదాని వెంట మరొకటి రానవసరంలేదు. ఉదాహరణకు, “రి” తరువాత “గ”, “గ” తరువాత “ప” అదే వరుస క్రమంలో రానక్కరలేదు. అంతే కాకుండా, స్వరాలు పలికించినంత మాత్రాన సంగీతం రాదు! ఒక ప్రసిద్ధ సంగీతకారుడు చెప్పినట్టు, రెండు పక్క పక్క స్వరాల మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని సూచించేదే సంగీతం. మామూలు పరిభాషలో చెప్పాలంటే, discrete స్వరాలు పలికిస్తే సంగీతం రాదు. దీనికి కారణం, పైపై కనిపించే స్వరాలకన్న లోతుగా నిర్ణయమయ్యేదే రాగం! ఇంతకుముందు చెప్పినట్టు, మొత్తం 12 స్వరస్థాయిలని దృష్టిలో పెట్టుకొని చూస్తే, హార్మోనియం పై మోహనం రాగాన్ని ఈ క్రింది విధంగా పలికించ వచ్చు. స X రి2 X గ2 XX ప X ద2 XX స ఉత్తినే స్వరాలు పలికిస్తే సంగీతం రాదు కాబట్టి, కొత్తగా నేర్చుకొనే వారు ఏదైనా పాట గాని, స్వరాలు తెలిసిన గీతం, వర్ణం గాని సాధన చేస్తే మోహనం రాగం అలవాటవుతుంది. ” X ” వాడినచోట స్వరాలు నిషిద్ధం ఈ రాగంలో! అంటే, “రి1, గ1, మ1, మ2, ద1, ని1, ని2″ లు శుద్ధ మోహనంలో ఉపయోగించ కూడని స్వరాలన్నమాట. హిందూస్తానీ సంగీతంలో… హిందూస్తానీ సంగీతంలో మోహనం అన్న రాగం లేదు. కానీ, మోహనంకి దగ్గరగా ఉండే ” భూప్‌” రాగం (కర్ణాటక పద్ధతిలోని “భూపాలం” రాగానికి, ఇక్కడ చర్చించే హిందూస్తానీ పద్ధతిలోని “భూప్‌” రాగానికీ సంబంధం ఏమీ లేదు) స్వరాలు, అరోహణఅవరోహణ సరిగ్గా మోహనం రాగంలో ఉన్నట్టుగానే ఉంటాయి.హిందూస్తానీ పద్ధతిలో రాగలక్షణాన్ని సూచించటానికి ” పకడ్‌ ” ఉపయోగిస్తారు. తేలిక మాటల్లో చెప్పాలంటే పకడ్‌ (లేదా స్వరాల గుంపు), రాగంలోని ఒక స్వరం నుంచి ఉన్న మిగిలిన స్వరాలకు ఎలా వెళ్ళాలో చెప్పే దారి అన్నమాట! హిందూస్తానీ పద్ధతిలో ఈ పకడ్‌ చాలా ముఖ్యమైనది. ” భూప్‌” రాగం ఉపయోగించే స్వరాల గుంపు లేక పకడ్‌ ఈ విధంగా ఉంటుంది. గ రి స ద స రి ప గ ద ప గ రి స పైన చెప్పిన పకడ్‌లో “స రి ప గ ” అన్న స్వరాలగుంపులో “స” నుంచి “రి” మీదుగా ( “గ” ని వాడకుండా) “ప” ను చేరి “గ” మీద ఆగటం గమనించండి. రాగ లక్షణాన్ని తీసుకు వచ్చేవి ఇలాంటి అతి ముఖ్యమైన వివరాలే! అలాగే, ఈ పకడ్‌లో మధ్య ఇచ్చిన “” గుర్తు, స్వరాల గుంపు మధ్య pause ని సూచిస్తుంది. ఈ విధంగా స్వరాల మధ్య ఆపటం కూడా మరొక ముఖ్యమైన విషయం. హిందూస్తానీ సంగీతంలో రాగం లక్షణం సూచించే మరొక ముఖ్యమైన ఉపకరణం ” వాది సంవాది”. అంటే, రాగంలోని రెండు ముఖ్యమైన స్వరాలను తీసుకొని, అందులో అతి ముఖ్యమైన స్వరాన్ని ” వాది” అని, రెండవ స్వరాన్ని ” సంవాది” అని పిలుస్తారు. ఈ రకంగా చేసే వర్గీకరణం వల్ల, రాగలక్షణం సులభంగా అర్ధమయ్యే వీలు ఉంది. సంగీతాన్ని మొదటిసారిగా వాయిద్యాలపై పలికించటానికి ప్రయత్నించే వారికి మోహన రాగం కొంత సులువుగా ఉంటుంది. మోహన రాగం హార్మోనియం లేదా కీబోర్డ్‌ మీద వాయించటం తేలిక. అలాగే వేణువు లాంటి వాయిద్యాల పై కూడా తేలికగా ఉంటుంది. కొన్ని కొన్ని రాగాలకు కొన్ని కొన్ని వాయిద్యాలు అతికినట్టు సరిపోతాయి. మోహన రాగానికి వేణువుకు ఉన్న సంబంధం అలాంటిదే. కర్ణాటక శాస్త్రీయ సంగీతం కొత్తగా నేర్చుకుంటున్న వారు తప్పకుండా నేర్చుకొనే ” వర వీణా మృదుపాణీ..” అన్న మోహన రాగం గీతం కూడా ఉత్సాహం ఉన్నవారు ప్రయత్నించవచ్చు. లలిత సంగీతంలో కూడా (సినీ గీతాలతో కలసి) మొహన రాగంలో స్వర బద్ధం చేసిన పాటలు అనేకం కనపడతాయి. చాలా మంది శ్రోత పాఠకులకు సినిమా పాటలతో ఎక్కువ పరిచయం ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి, వీటిలోని అనేక వైవిధ్యాలున్న పాటలను మోహన రాగం పరిచయం చేయ్యటానికి ఎన్నుకున్నాను. సినిమా పాటల్లోకి దూకేముందు, ప్రఖ్యాత గాయకుడు శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ పాడిన ” నను పాలింపగ నడచి వచ్చితివో…” అన్న త్యాగరాజ కృతి ఒక్క సారి గుర్తు చేసుకుందాం! మోహనరాగం లక్షణం ఏమిటో తెలియాలంటే, మీకు విసుగు వచ్చేదాకా ఇదే కృతి వినండి. సంగీతానికి ” బాగా వినడం” చాలా అవసరం.చాలా ఓపికగా, vocal music మాత్రమే కాకుండా instrumental music కూడా వినటం చెయ్యాలి. ఇలా వినగా వినగా రాగ లక్షణం వంట పట్టించుకొనే అవకాశం ఉంది. సినిమా పాటలు
ఇప్పుడు కొన్ని సినిమా పాటలు గురించి తెలుసుకుందాం. కొన్ని పాటలు పదే పదే వినటం వల్ల వాటిలోని మాధుర్యం మర్చిపోయే ప్రమాదముంది. అలాంటి పాటల్లో మాయాబజార్‌ సినిమాలోని ” లాహిరి లాహిరి లాహిరిలో…” పాట ఒకటి.శుద్ధ మోహన రాగంలోని స్వరాలు తప్ప మరే స్వరాలు ఉపయోగించకుండా, పడవ మీద షికారు పోతూ ప్రేమికులు పాడే పాట ఇది. మెల్లగా, వెన్నెల రాత్రి, చల్లగాలిలో ప్రయాణిస్తూ, మంద గమనంతో సాగే ఈ పాటలోని సంగీతాన్ని వినండి. పాటలోని సాహిత్యానికి తగ్గ రాగం. సాహిత్యానుభూతికి దీటైన సంగీతానుభూతి. ఈ పాటలోని స్వరాలను కొంచెం తేలికగా ఒక వాయిద్యంపై ప్రయత్నించి పలికించవచ్చు. ఉత్సాహం ఉన్నవారికి వీలుగా ఈ పాటలోని స్వరాలను, ఈ వ్యాసం చివర ఇచ్చాను. ఇద్దరు మిత్రులు సినిమాలోని ” పాడవేల రాధికా ..” మరొక ఉదాహరణ. శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత పరంగా బాణీ కట్టి, వీణతో పలికించిన ఈ పాట, ఉత్సాహవంతులు వీణ మీద పలికించ ప్రయత్నిస్తే బాగుంటుంది.
               మోహన రాగంలో ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయ రాజా చేసిన అనేక ప్రయోగాల్లో, రెండు ఇక్కడ చెప్పుకోవాలి.మొదటిది “నిన్ను కోరి వర్ణం..” అన్న ఘర్షణ సినిమాలోని పాట. నిజానికి శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో “నిన్ను కోరి వర్ణం..” అన్న మోహనం రాగం వర్ణం ఉన్నా, ఈ సినిమా పాట కొంచెం శాస్త్రీయ సంగీతాన్ని వెక్కిరించినట్లు కనపడుతుంది. కానీ, పూర్తిగా మోహన రాగం, ఆది తాళంలో స్వరపరచబడ్డ ఈ పాట వింటే, తెలిసిన మోహన రాగంలో ఎంతటి విలక్షణత తీసుకు రావచ్చో ఇళయ రాజా నిరూపించాడు. ఇలాంటి ప్రయోగాలు మన శాస్త్రీయ సంగీతం మీద మాత్రమే కాకుండా, వెస్టర్న్‌ మ్యూజిక్‌ మీద కూడా మంచి అధికారం ఉన్న ఇళయ రాజా లాంటి వారు మాత్రమే చెయ్యగలరు. రెండవ ఉదాహరణ ” వే వేలా గోపెమ్మలా…” అన్న సాగర సంగమం సినిమాలోని పాట. ఈ పాటకు మోహనం రాగాన్ని మూలంగా తీసుకున్నా, అన్య స్వరాలు అక్కడక్కడ ఉపయోగించటం వల్ల పాటకు ఒక కొత్త అందాన్ని తెచ్చాయి. “మోహనాల వేణువూదే..” అన్న చోట శుద్ధ ( హిందూస్తానీలో కోమల) ధైవతం వాడటం, పాటలో ఉన్న రెండు చరణాలకి మధ్య ఉన్నఇంటర్‌లూడ్స్‌లో వేణువుతో మొదలైన సంగీతంలో మోహనంలో వర్య్జమైన “కోమల్‌ గాంధారం”, “కోమల్‌ మధ్యమ” , “తీవ్ర నిషాధం” స్వరాలు ఉపయోగించటం లాంటి ప్రయోగాలు చెప్పుకోతగ్గవి.
             ఇంతకు ముందు చెప్పినట్టు, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని “మోహనం” రాగానికి ” దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలోని “భూప్‌” రాగం. “దగ్గరగా” అనటానికి కారణం ఉంది. స్వరాల దృష్య్టా ఈ రెండు రాగాలూ ఒకే రకంగా కనిపించినా, ఒకే రకంగా వినిపించవు! ఈ రెండు రాగాలూ తీసుకు వచ్చే అనుభూతులు వేరు వేరు. సాధన, అనుభవం ఉన్న వ్యక్తులకు ఈ రెండు రాగాల మధ్య ఉన్న పోలికలు, తేడాలు తెలుస్తాయి.అది మరీ అంత కష్టమైన పని కాదు. శ్రద్ధగా ఈ రెండు రాగాలలో కొన్ని పాటల్ని వింటే ఆ తేడాలను కనిపెట్టవచ్చు. “భూప్‌” రాగంలో స్వరపరచి, హిందీ సినిమా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పాడిన ” జ్యోతి కలశ.. కలశ చలకే” అన్న పాట, ఘంటసాల చక్రధారి సినిమా కోసం పాడిన ” ఘనా ఘన సుందరా..” అన్న పాట విని, ఇక్కడ ఉదహరించిన మోహనం లోని పాటలతో పోలిస్తే, ఈ “తేడా” ఏమిటో అర్ధమవుతుంది. గమ్మత్తుగా మోహనం రాగం స్వరాలు మాత్రమే ఉపయోగించే ఇంకొక హిందూస్తానీ రాగం “దేశ్‌కార్‌”. చిరంజీవులు సినిమా కోసం ఘంటసాల స్వరం ఇచ్చిన “తెల్ల వార వచ్చే తెలియక నా స్వామి..” అన్న పాట “దేశ్‌కార్‌” రాగం లోనిదే! మోహనం రాగానికి దగ్గరగా ఉండే ఈ “దేశ్‌కార్‌” రాగం సూర్యోదయ కాలంలో పాడుకొనే రాగం. షాహిద్‌ పర్వేజ్‌ సితార్‌పై పలికించిన ఈ దేశ్‌కార్‌ రాగం వినండి. చాలా చోట్ల మోహనం రాగం లాగా అనిపించే ఈ దేశ్‌కార్‌ రాగానికి వాది “ద” సంవాది ” గ”. ఇందుకు పూర్తిగా వ్యతిరేకమైన వాదిసంవాదులు “భూప్‌” రాగానికి ఉన్నాయి. “భూప్‌” రాగానికి వాది ” గ”, సంవాది “ద”.
పైన చెప్పినట్లు, మోహన రాగంలో అన్యస్వరాలను అందంగా ఉపయోగించటం మన పాత సినిమా సంగీత దర్శకులు కూడా చేసారు. అప్పుచేసి పప్పు కూడు సినిమా కోసం సాలూరు రాజేస్వరరావు స్వర కల్పన చేసిన ” ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి..” అన్న పాటలో ” వీచెనో..” అన్న పదం తరువాత సాగే గమకంలో మోహన రాగంలో నిషిద్ధమైన “నిషాధం” పడుతుంది. అయినా, పాట వినసొంపుగా ఉంది. అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా కోసం పెండ్యాల వెంకటేశ్వరరావు స్వరం ఇచ్చిన “మనసు పరిమళించెనే..” అన్న పాట మొదలవుతూనే వినిపించే స్వరాల్లో తీవ్ర నిషాధం ఉపయోగించటం జరిగింది. ఇలాంటి ఇంకో ఉదాహరణ గుండమ్మ కధ సినిమాలోని “మౌనముగా నీ మనసు పాడినా..” అన్న మోహనం రాగంలోని పాటలో కూడా ” నీ మనసు నాదనుకొంటిలే..” అన్నప్పుడు “మనసు” లో నిషాధం పలికించాడు ఘంటసాల.
              “మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం..” అనే యుగళగీతం జయసింహ సినిమా కోసం టి. వి. రాజు స్వరకల్పన చెస్తే ఘంటసాల, బాల సరస్వతులు పాడారు. (ఏదైనా సినిమా పాటలోని సాహిత్యంలో ఒక రాగం పేరు కపడితే, ఆ పాట ఆ సాహిత్యంలో కనిపించే రాగంలో స్వరకల్పన చేయబడిందని చెప్పకండి! చిక్కుల్లో పడగలరు. ఉదాహరణకు, ” మోహనరూపా గోపాలా..” అన్న పాట చెంచులక్ష్మి సినిమాకోసం స్వరం చేయబడింది మోహనం రాగంలో కాదు, ” హిందోళం” రాగంలో!) ఈ పాటలో గమనించవలసిన అంశాలు రెండు. మొదటిది, అద్భుతంగా వీణపై పలికించిన శుద్ధ కర్ణాటక పరమైన మోహనం రాగస్వరాలు మనం విని ఆనందించేలోపే చక్కగా హవాయిన్‌ గిటార్‌ వినిపిస్తూ వీణ వినమరుగవుతుంది.చరణాల మధ్య ఉన్న సంగీతంలో కూడా మహాద్భుతంగా గిటార్‌ని ఉపయోగించుకోవడం గమనించతగ్గది. రెండవది, గాయని, గాయకుల్లోని శ్రుతులు. సహజంగా లలితంగా పాడే శ్రీమతి రావు బాలసరస్వతీ దేవి గొంతు,పై శ్రుతులకన్న క్రింది శ్రుతుల్లో ఎక్కువ మాధుర్యంగా ఉంటుంది. గాయకుడుగా ఘంటసాల ఇందుకు పూర్తిగా విరుద్ధం! దీనికి కొంత కారణం సహజంగా మగవారి శ్రుతి, ఆడవారి శ్రుతి కన్నా హెచ్చుగా ఉండటం.( ఈ నాటి ప్రముఖ గాయని “చిత్ర” శ్రుతి సహజంగా హెచ్చుగా ఉండటంవల్ల, ఈ నాటి సంగీతానికి తగ్గట్టు చాలా సునాయాసంగా ఎక్కువ యుగళ గీతాలు పాడగలుగు తున్నారు.) అందువల్ల ఈ యుగళ గీతానికి సరి అయిన శ్రుతికోసం,ఘంటసాల చేత తక్కువ శ్రుతిలో పాడించటం జరిగింది.ఈ రకంగా పాడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఇదే సినిమాలో టి.వి. రాజు, ఘంటసాల, లీలలతో పాడించిన “ఈనాటి ఈహాయి..” అన్న పాట మోహనం రాగంలో పాడించటం మరో గొప్ప విషయం. ఈ రెండు పాటల సంగీతంలోని వైవిధ్యాలను గమనించండి. అవటానికి మళ్ళీ ఈ రెండు పాటలూ ప్రణయ గీతాలే!
(Source : www.eemaata.com)

0 comments:

Post a Comment