పక్షవాతం
రోగులకు రెక్కాడదు. రెక్కాడకపోతే రోజువారీ చేయాల్సిన పనిలో ఏదీ జరగదు. ఒక
కాలు, ఒక చేయి పనిచేయని మామూలు పక్షవాతం రోగుల పరిస్థితే ఇలా ఉంటే... ఇక
రెండు చేతులతో పాటు రెండు కాళ్లూ పడిపోయిన క్వాడ్రీప్లీజిక్ రోగుల స్థితి
ఎంత కష్టతరంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇలాంటి వారికి ఇప్పుడు కొత్తగా ‘రోబో
రెక్కలు’ తోడు వస్తున్నాయి. వాటి సహాయంతో క్వాడ్రిప్లీజియా రోగులకే ఎంతో
ప్రయోజనం. వాళ్లకే ఇన్ని ప్రయోజనాలుంటే మరి భవిష్యత్తులో మామూలు పక్షవాతం
రోగుల రోజులూ బాగుంటాయని చెప్పే శుభవార్తల సమాహారమే ఈ కథనం...
పక్షవాతం
అనగానే అందరి మనసుల్లో స్ఫురించే రూపం ఏమిటంటే... ఒక మనిషికి చేయీ, కాలూ
చచ్చుపడిపోయి ఉంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘హెమీప్లీజియా’ అంటారు. అదే
రెండు కాళ్లూ చచ్చుబడితే దాన్ని పారాప్లీజియా అంటారు. మరి మనిషికి ఉన్న
రెండు చేతులూ, రెండుకాళ్లూ చచ్చుబడితే...? అదే క్వాడ్రీప్లీజియా. కాలూ చేయి
చచ్చుబడ్డ హెమీప్లీజియా కండిషన్‌లోనే మనిషి ఒకరిపై ఆధారపడి జీవించాల్సి
రావడంతో ఎంతో వేదన అనుభవిస్తాడు. ఎవరికైనా సరే, కాళ్లూ, చేతులు... అన్నీ
చచ్చుబడ్డ తర్వాత జీవితం ఎంతగా దుర్భరమవుతుందో ఊహించవచ్చు. అలాంటి వారి
విషయంలోనూ కొత్త ఆశలు చిగురించే రోజులు మున్ముందు ఉన్నాయన్న సమాచారం ఎంత
తియ్యగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. క్వాడ్రీప్లీజియా అంటే... కాళ్లూ,
చేతులు చచ్చుబడిపోయే పరిస్థితిని క్వాడ్రీప్లీజియా అంటారు.
క్వాడ్రీ
అంటే నాలుగు. ప్లీజియా అంటే చచ్చుబడటం అన్నమాట. అంటే రెండు కాళ్లూ, రెండు
చేతులు మొత్తం నాలుగూ చచ్చుబడిపోయే పరిస్థితి ఇది. మనిషి మెదడులో సరిగ్గా
రెండు అర్ధభాగాలుంటాయి. కుడివైపున ఉన్న శరీర భాగాలను మెదడు ఎడమ అర్ధగోళం
నియంత్రిస్తుంది. అలాగే శరీరంలోని ఎడమవైపు ఉన్న అవయవాలను మెదడు కుడి
అర్ధగోళం నియంత్రిస్తుంది. ఏదైనా కారణాల వల్ల మెదడు ఎడమ అర్ధగోళం
ప్రభావితమైతే కుడివైపు శరీర భాగాలపై నియంత్రణ కోల్పోతారు. అలాగే కుడి
అర్ధగోళం ప్రభావితమైతే ఎడమవైపు అవయవాలు కదలకుండా పోతాయి. దీన్నే పక్షవాతం
అంటారు. ఏవైనా ఇతర కారణాల వల్ల రెండు అర్ధభాగాలూ ప్రభావితమైతే...? అదే
‘క్వాడ్రీప్లీజియా’.
కారణాలు...
- క్వాడ్రీప్లీజియాకు మూడు ప్రధానమైన కారణాలున్నాయి. అవి...
- పక్షవాతం చాలా తీవ్రంగా వచ్చి మెదడులోని రెండు అర్ధగోళాలూ ప్రభావితం కావడం.
- ఏదైనా ప్రమాదం (యాక్సిడెంట్) కారణంగా మెదడు దెబ్బతిని రెండువైపుల అర్ధగోళాలూ దెబ్బతినడం.
- వెన్నెముక (స్పైనల్‌కార్డ్) దెబ్బతిని కాళ్లూ, చేతులకు వెళ్లే నరాలు దెబ్బతినడం వల్ల అవి చచ్చుబడటం.
భవిష్యత్ ఆశాకిరణాలు
సాధారణంగా కాలూ లేదా చేయి చచ్చుబడ్డ కేసుల్లో మనకు స్ఫురించే ఆప్షన్
ఫిజియోథెరపీ లేదా కొన్ని మందులు. అదే ఒక కాలూ లేదా చేతిని తొలగించిన వారిలో
మనకు స్ఫురించే ప్రత్యామ్నాయం కృత్రిమ అవయవాలు.
కానీ ప్రస్తుతం
క్వాడ్రీప్లీజియా రోగులకే ఎంతో ఆశ కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంజనీరింగ్ రంగంలోని పురోగతి, రోబోటిక్స్‌లో
వచ్చిన ప్రగతి హెమీప్లీజియా రోగుల్లోనూ, క్వాడ్రీప్లీజియా బాధితుల్లోనూ
కొత్త ఆశలు నింపుతున్నాయి. ఇటీవలి కాలం వరకు కేవలం ఒక కాలు, ఒక చేయి
దెబ్బతిన్న పక్షవాతం (హెమీప్లీజియా) కేసుల్లోనే రీ-హ్యాబిలిటేషన్‌తో
కొంతవరకు మాత్రమే కనిపించే ఫలితాల విషయంలో మెరుగుదల సాధించేందుకు మరెంతగా
అవకాశం ఉందో ఆలోచించుకుంటే ఆ రోగుల్లో నిరాశలు తక్షణం తొలగిపోతాయి.
పక్షవాతం (స్ట్రోక్), తలకు లేదా వెన్నెముకకు అయిన గాయం కారణంగా అవయవాలు
చచ్చుబడినవారిలో అవి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధిలో చాలావరకు మామూలు
స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో చాలా మంది రోగులు తమ రోజువారీ
పనులను తమంతట తామే నిర్వహించుకోగలరు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం
రోగులు తాము రోజూ చేసే పనులైన కాలకృత్యాలు, స్నానం, తినడం, నడవడం కూడా
చేయలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటివారికి రోబోటిక్స్ సహాయంతో నిర్మించిన
కృత్రిమ పరికరాలు త్వరలోనే వారి పనులు వాళ్లంతట వాళ్లే చేసుకునే అవకాశాలను
మెరుగుపరచనున్నాయి.
రీహ్యాబిలేటేషన్ కార్యకలాపాలకు ఒక వరం
పక్షవాతం రోగులు తమ పనులు తామే చేసుకునేలా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను
రీ-హ్యాబిలిటేషన్ అంటారు. ఈ రోగుల్లో ఇదెంతో కీలకం. ఇటీవలే 1990 నాటి నుంచి
వైద్యరంగంలోకి రోటోటిక్స్ ప్రవేశించి, అంగవైకల్యం ఉన్నవారికి
రీ-హ్యాబిలిటేషన్ కల్పించేందుకు దోహదం చేయడం మొదలుపెట్టాయి. ఈ రంగంలో ఎంతో
పరిశోధన జరుగుతోంది. మనిషి చేసే అనేక పనులు రోబోతో (అంటే పూర్తి రోబో
కాకపోయినా రోబో చేయి, రోబో కాలు వంటివాటితో) చేయించడం మొదలైంది.
ఒక కాలు లేదా చేయి తెగిన వారిలో (యాంప్యుటీస్‌లో)
ఏదైనా కారణాల వల్ల ఒక కాలు లేదా ఒక చేయి వంటివి తొలగించడాన్ని
యాంప్యుటేషన్ అంటారు. ఇలాంటివారికి రోబోటిక్ కాలు లేదా రోబోటిక్ చేయిని
అమర్చడం మామూలే. సాధారణ కాలి కదలికల విషయానికి వస్తే మెదడు నుంచి
వెన్నుపాము ద్వారా అందే ఆదేశాలకు అనుగుణంగా దాని కదలికలుంటాయి. కండరాల
కదలికలన్నీ మెదడు ఆజ్ఞలకు అనుగుణంగా సాగుతాయి. ఇక అంగవైకల్యం ఉన్నవారి
విషయానికి వస్తే వారి మెదడులో ఉత్పన్నమయ్యే ఆజ్ఞల సంకేతాలు (సిగ్నల్స్)
రోబో కాలు లేదా రోబో చేయిలోని ఎలక్ట్రో మయో గ్రఫీ (ఈఎమ్‌జీ) సెన్సర్స్ అనే
వాటికి చేరుతాయి. (ఈ ఈఎమ్‌జీ సెన్సర్ పరికరాన్ని కృత్రిమ కాలు/చేయిలో
ఒకచోట అమర్చుతారు).
కృత్రిమ అవయవానికి సంబంధించి రోబో కాలు
నిర్దిష్టంగా ఇలా కదలాలంటూ ఏదైనా సిగ్నల్ అందగానే సదరు రోబో అవయవం అలాగే
స్పందిస్తుంది. ఉదాహరణకు ఏదైనా గ్లాసులాంటి దాన్ని పట్టుకోవడం, బిగించి
ఉంచడం వంటి ఆజ్ఞలకు ఎలా ఎలా స్పందించాలో ఆ కృత్రిమ రోబో అవయవానికి
నేర్పుతారు. ఈ శిక్షణలో ఏయే ఆజ్ఞకు ఎలా స్పందించాలో అన్న విషయాన్ని రోబో
అవయవం 3 నుంచి 6 నెలల్లో నేర్చుకుంటుంది. ఆ తర్వాత అవే ఆజ్ఞలకు అలాగే
స్పందిస్తుంటుంది.
ఇంకా ప్రయోగదశల్లోనే...
గ్లాసు పట్టుకోవడం లాంటి ప్రాథమికమైన కొన్ని పనులను రోబో అవయవంతో
చేయించగలిగినా సంక్లిష్టమైన కదలికలు నేర్పడం ఇంకా పూర్తిగా సాధ్యపడలేదు.
అంటే... అన్నం కలపడం, రాయడం వంటివి ఇంకా రోబో అవయవానికి నేర్పడం ఇంకా
పూర్తిగా జరగలేదు. ప్రస్తుతానికి కృత్రిమ రోబో కాలికి నిలబడటం, నడక వంటివి
నేర్పగలిగినా మెట్లెక్కడం, ఫుట్‌బాల్ వంటివి ఆడటం వంటివి నేర్పడం అన్న
విషయాలు ప్రయోగదశలోనే ఉన్నాయి.
రోబోల ఉపయోగం ఇలా...
-
ఏదైనా కారణాల వల్ల మెదడు లేదా వెన్నుపూస దెబ్బతిని మెదడు నుంచి సిగ్నల్
కొన్ని అవయవాలకు అందని వారిలో రోబో అవయవాల సహాయంతో కొన్ని సాధారణ పనులను
చేయడం రెండు రకాలుగా జరుగుతుంది.
- మొదటిది బలహీనంగా ఉన్న కండరాలకు ఎలక్ట్రో మయోగ్రఫీ (ఈఎమ్‌జీ) ఎలక్ట్రోడ్‌లను అమర్చి దాన్నే ప్రేరేపించి పనులు చేయించడం.
రెండోది...
సిగ్నల్స్ పంపే ఎలక్ట్రోడ్‌లను మెదడులోనే అమర్చి... ఆ సిగ్నల్స్ వైకల్యం
ఉన్న చోట అమర్చిన రోబో అవయవానికి అందేలా చేసి ఆ సంకేతాలకు అనుగుణంగా
కదిలేలా చేసి అనుకున్న పనులు చేయించడం. అయితే ఈ రెండో రకమైన పనులు ఇంకా
పూర్తి సునిశితత్వంతో... మొత్తం సాధారణ అవయవంలాగే చేయించడం అంతగా సాధ్యపడటం
లేదు. కానీ రోజు రోజుకూ నిన్నటి మీద మెరుగుదల మాత్రం ఉంటోంది. దాంతో
కొద్దిరోజుల్లోనే కృత్రిమరోబో అవయవం సైతం స్వాభావిక అవయవం లాగే పనిచేసే
(చేయించే) రోజు వస్తుందన్నది అటు ఇంజనీరింగ్ నిపుణులు, ఇటు వైద్య
నిపుణుల్లో ఉన్న అభిప్రాయం. ఇదే రోగుల పాలిట శుభవార్త!
మరో పరిశోధన ఫలితం...
ఇటీవలే జేన్ షెర్మన్ అనే 52 ఏళ్ల మహిళకు కృత్రిమ రోబోచేతిని అమర్చారు. ఆమె
పదమూడేళ్ల క్రితం క్వాడ్రీప్లీజియాకు లోనై చక్రాల కుర్చీకే పరిమితమైంది.
ప్రతి విషయంలోనూ ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే యూనివర్సిటీ ఆఫ్
పిట్‌బర్గ్ మెడికల్ సెంటర్‌కు చెందిన నిపుణుల సహాయంతో ఆమెకు ఇటీవలే 7-డి
(సెవన్ డైమన్షన్) రోబోటిక్ చేతిని అమర్చారు. ఆ చేతికి ఇచ్చిన శిక్షణ
సహాయంతో ఆమె తనంతట తానే ఒక చాక్లెట్‌ను తీసుకుని నోటికి అందించి తినడం
సాధ్యమైంది. ఈ పరిశోధన ఫలితాల్లోని పురోగతి ఇలాగే కొనసాగితే పక్షవాతం
రోగులు, క్వాడ్రీప్లీజియా రోగులు తమంతట తామే చాలా పనులు చేసుకునే రోజు ఎంతో
దూరంలో లేదు.
ఇరాక్ యుద్ధంలో కుడికాలు కోల్పోయిన ఒక సైనికుడి కాలి స్థానంలో ఒక రోబో కాలిని (రోబోటిక్ లెగ్‌ను) అమర్చారు. దాని
సహాయంతో మామూలుగా నడవడం నేర్పడానికి ఆర్నెల్ల వ్యవధి పట్టింది. ఇప్పుడు
అతడు పూర్తిగా మామూలుగా నిలబడటం, నడవగలగడం చేస్తున్నాడు. అతడికి ఫుట్‌బాల్
అంటే ఎంతో ఆసక్తి ఉండటంతో ప్రస్తుతం బంతిని తన్నడం వంటి కదలికలకు తగిన
శిక్షణ ఇస్తున్నారు. కొంతమేరకు ఇది సాధ్యపడింది కూడా. దాంతో అతడిలోని
ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అయ్యా యి. పైగా అతడు తన రోబో కాలి సహాయంతో
కదల గలగడం వల్ల ఎప్పుడూ ఒకే చోట కదలకుండా ఉన్నవారిలో కనిపించే
ఆస్టియోపోరోసిస్, స్థూలకాయం, హార్ట్‌ఎటాక్ వంటి రిస్క్‌లనుంచి
తప్పించినట్లయ్యింది.
Source : Sakshi News paper
0 comments:
Post a Comment