కంప్యూటర్ కీబోర్డు మీద వావీవరస లేకుండా టైప్ చేసినట్టయితే మహాకావ్యం తయారవుతుందా? అవదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సంగీతం కీబోర్డు మీద అయితే ఏదైనా రాగం పలుకుతుందా? చాలామంది నమ్మకపోవచ్చుగాని పలుకుతుంది. నిజానికి అన్నీ తెల్లనివో, నల్లనివో వాయిస్తే రాగం పలకకపోవడమే అరుదు. అతి ప్రాథమిక స్థాయిలో సంగీతం వాయించదలుచుకున్నవాళ్ళ కోసమే ఈ వ్యాసం. చాలామందికి కీబోర్డు మీదున్న నలుపు తెలుపు మెట్లని చూడగానే కొంత కంగారు పుడుతుంది. ఇన్ని వాడే బదులుగా అన్నీ ఒకే రకమైనవి “ఏడవొచ్చుగా?” అన్నవాళ్ళున్నారు. వీటిని కలగా పులగంగా వాయించకుండా అన్నీ నల్లనివో, లేదా అన్నీ తెల్లనివో మాత్రమే వాయిస్తే ఏమవుతుంది? అలా వాయించినా కూడా కొన్ని రాగాలు పలుకుతాయి. ఏది నొక్కాలి అని తడుముకోకుండా ఒకే రంగు మెట్లని వరసగా వాయించి వాటిని వినిపించవచ్చు.

“పాడనా తెనుగుపాట”
”కుమరేశ్, గణేశ్ వాయించిన వయొలిన్ కీర్తన”
శుద్ధసావేరి రాగంలోని “పాడనా తెనుగుపాట” అనేది అందరికీ తెలిసినదే. (ఇది కూడా ఒకటిన్నర శ్రుతిలోనే ఉండడం కేవలం యాదృచ్ఛికం). ఇదే రాగంలో కుమరేశ్, గణేశ్ వాయించిన వయొలిన్ కీర్తన మరొక శ్రుతిలో ఉంది. కొంత సాధన చేస్తే కేవలం ఈ నల్లమెట్లనే ఉపయోగించి ఈ పాటను పూర్తిగా వాయించవచ్చని ఆచరణ ద్వారా తెలుస్తుంది. కొంత అల్పసంతోషం పరవాలేదనుకుంటే ఈ పద్ధతిలో ఎవరైనా శుద్ధసావేరి రాగం (కనీసం దాని స్వరాలు) పలికించెయ్యగలరు. అవి స రి2 మ1 ప ద2 స. వివరాలు రెండో పటంలో ఉన్నాయి. ఇటువంటి ఎక్సర్ సైజులు చేసేవారు శ్రుతిలో గొంతెత్తి పాడుకోగలిగితే మరీ మంచిది. అలా చెయ్యనివారు తాము వాయిస్తున్నదాన్ని మరింత శ్రద్ధగా వినాలి.

“ఏడు కొండలసామి”
”ఎంత నేర్చినా”
రెండున్నర శ్రుతి, లేక డి షార్ప్(D#) షడ్జమంగా అనుకుంటే మూడో పటంలో చూపినట్టుగా శుద్ధ ధన్యాసి స్వరాలు పలుకుతాయి. (దీన్నే ఉదయరవిచంద్రిక అని కూడా అంటారు) ఇందులో ఏడు కొండలసామి అనే పాట మనకు తెలిసినదే. అలాగే లాల్గుడి జయరామన్ వాయించిన ఎంత నేర్చిన అనే త్యాగరాజ కీర్తన కూడా ఉంది. స్వరాలు స గ1 మ1 ప ని1 స.

“తెల్లవారవచ్చె”
”నిన్ను కోరి (వర్ణం)”
తరవాతిది ఎఫ్ షార్ప్ (నాలుగున్నర) శ్రుతిలో మొదలవుతుంది (నాలుగో పటం). ఇందులో వరసగా నల్లమెట్లు వాయిస్తే మోహన రాగం మోగుతుంది. స రి2 గ2 ప ద2 స అనే స్వరాలున్న వరవీణా అనే గీతం అందరికీ తెలిసినదే. ఇందుకు ఉదాహరణలుగా “తెల్లవారవచ్చె” అనే సినీగీతం, రమణి వాయించిన “నిన్ను కోరి” అనే వర్ణం వినవచ్చు.

“సీతారాముల కల్యాణము”
”అలకలల్ల”
ఇక కుడివేపుగా మరొక నల్లమెట్టుకు జరిగి అయిదున్నర శ్రుతిగా జి షార్ప్ షడ్జమంగా ఉపయోగించి అన్నీ నల్లమెట్లే వాయిస్తే అయిదో పటంలో చూపినట్టుగా మధ్యమావతి వినవచ్చు. స రి2 మ1 ప ని1 స అనే స్వరాలు కలిగిన ఈ రాగంలో “సీతారాముల కల్యాణము” అనే పాటనూ, ఎ.ఎస్. గణేశన్ జలతరంగం మీద వినిపించిన “అలకలల్ల” అనే కీర్తననూ వినవచ్చు.

“పగలే వెన్నెలా”
”సామజవరగమనా”
నల్లమెట్లలో ఇక మిగిలినది ఆరున్నర లేక ఏ షార్ప్ ఒక్కటే. దీని నుంచి మొదలుపెట్టి వాయిస్తే స గ1 మ1 ద1 ని1 అనే స్వరాలతో హిందోళం పలుకుతుంది (ఆరో పటం). “పగలే వెన్నెలా” అనే పాటనూ, రాజరత్నం పిళ్ళై వాయించిన “సామజవరగమనా” అనే కీర్తననూ ఉదాహరణలుగా చెప్పవచ్చు.

“శంకరాభరణము”
”స్వరరాగసుధా”
ముందుగా సి, లేక ఒకటో శ్రుతి ఆధారంగా అన్నీ తెల్లమెట్లే వాయిస్తే శంకరాభరణం రాగం వస్తుంది. ఏడో పటంలో చూపినట్టుగా స రి2 గ2 మ1 ప ద2 ని2 స్వరాలతో వినబడే “శంకరాభరణము” అనే సినీగీతం, సూర్యనారాయణ వాయించిన “స్వరరాగసుధా” అనే కీర్తనా ఇందుకు ఉదాహరణలు.

“బాలనురా మదనా”
”గణపతియే”
ఇప్పుడు రెండు లేక డి మెట్టును శ్రుతిగా ఉపయోగిస్తే ఖరహరప్రియ స్వరాలు స రి2 గ1 మ1 ప ద2 ని1 అనేవి వినవచ్చు. “బాలనురా మదనా” అనే పాటా, యు. శ్రీనివాస్ వాయించిన “గణపతియే” అనే కీర్తనా దీనికి ఉదాహరణలు.

“హనుమతోడి” గురించి డా. నూకల
”సంసారం”
మూడో శ్రుతి ఇ నుంచి మొదలుపెడితే హనుమతోడి వినిపిస్తుంది (తొమ్మిదో పటం). స రి1 గ1 మ 1 ప ద1 ని1 స్వరాలతో ఈ రాగలక్షణాలని డా. నూకల వివరించారు. ఈ స్వరాలు ప్రధానంగా సింధుభైరవి రాగంలో వినిపిస్తాయి కనక అందుకు ఉదాహరణగా “సంసారం” సినిమా పాట తీసుకోవచ్చు.

“విప్రనారాయణ” సినిమా పాట
ద్వారంవారి కల్యాణి ఆలాపన
ఇక పదో పటంలో చూపినట్టుగా ఎఫ్ మెట్టును శ్రుతిగా ఉపయోగిస్తే కల్యాణి స్వరాలు స రి2 గ2 మ2 ప ద2 ని2 అనేవి వస్తాయి. ఉదాహరణలుగా ఈ రాగంలో విప్రనారాయణ సినిమా పాటనూ, ద్వారంవారి కల్యాణి ఆలాపననూ వినవచ్చు.

“రాగాలాపన”
”కుంతీకుమారి”
అయిదు శ్రుతిలో వాయిస్తే పదకొండో పటంలోని స రి2 గ2 మ1 ప ద2 ని1 స్వరాలు వినిపిస్తాయి. ఇవి హరికాంభోజి స్వరాలు. ఘంటసాల “కుంతీకుమారి” మొదటి పద్యంలో ఇవే స్వరాలు వినిపిస్తాయి. ఇదే రాగంలో మణి కృష్ణస్వామి “రాగాలాపన” వినవచ్చు.

“మధురమైన జీవితాల”
అష్టపది “యామిహే”
చివరగా ఆరు శ్రుతిని ఉపయోగిస్తే (పన్నెండో పటం) నఠభైరవి రాగం వినిపిస్తుంది. స రి2 గ1 మ1 ప ద1 ని1 ఈ స్వరాలు “మధురమైన జీవితాల” అనే సినీగీతంలోనూ, బాలమురళి అష్టపది “యామిహే” లోనూ వినిపిస్తాయి.

Source : eemaata.com
0 comments:
Post a Comment