Tuesday, December 18, 2012

Sindhu Bhairavi Raagam

సింధుభైరవి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు

1. ముద్ద బంతి పూవులో… (మూగ మనసులు)
2. మెల్లగ వీచే చల్లగాలికి… (గుండమ్మ కధ)
3. చేసేది ఏమిటో చేసేయి సూటిగా… (తెనాలి రామకృష్ణ)
4. కాదు సుమా కల కాదు సుమా… (కీలు గుఱ్ఱం)
5. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన… (సప్తపది)
6.ఏమని పాడెదనో ఈవేళ … (భార్యాభర్తలు)
7. సంసారం సంసారం ప్రేమ సుధా పూరం… (సంసారం)
8. జగములా దయనేలే జనని… (తెనాలి రామకృష్ణ)
9. తెలియగలేరే నీలీలలు… (చెంచులక్ష్మి)
10. ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు… (ఉయ్యాల జంపాల)
11. నందుని చరితము వినుమా… (జయభేరి)
12. ఏమిటో ఈమాయా ఓ చల్లని రాజా… (మిస్సమ్మ)
13. వాడిన పూలే వికసించెనే… (మాంగల్య బలం)
14. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం… (ఎం. ఎల్‌. ఎ)
15. వ్రేపల్లియ ఎదఝల్లున… (సప్తపది)
16. అనురాగాలు దూరములాయనా… (విప్రనారాయణ)
17. కరుణాలవాల ఇది నీదు లీల… (చెంచులక్ష్మి)
18. నడిరేయి ఏఝాములో… (రంగులరాట్నం)
19. ఇంతేరా ఈజీవితం తిరిగే రంగులరాట్నము… (రంగులరాట్నం)
20. భలేభలే అందాలు సృష్టించావు… (భక్త తుకారం)
21. బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా… (పెళ్ళిచేసి చూడు)
22. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా… (శభాష్‌రాముడు)
23. చాలదా ఈపూజా దేవి… (శ్రీ కృష్ణార్జున యుద్ధం)
24. సింహాచలము మహా పుణ్యక్షేత్రము… (సింహాచల క్షేత్ర మహిమ)
25. మ్రోగింది గుడిలోని గంట… (శ్రీమతి)
26. వెన్నెల పందిరిలోన… (బంగారు పాప)
27. ఓహో యాత్రికుడా… (సాలూరి రాజేశ్వర రావు)
28. రామ రామయనరాదా… (ప్రయాగ రామదాసు కీర్తన)
29. సంజవెలుంగులో పసిడి ఛాయల… ( కరుణశ్రీ పద్యం ఘంటసాల)
30. మన ప్రేమ… (AIR రికార్డ్‌, మంగళంపల్లి శ్రీరంగం గోపాలరత్నం)
31. భయమేలా ఓ మనసా… (భలే రాముడు)
32. సంగీతమేలనే… (రావు బాలసరస్వతి)
33. పయనమయే ప్రియతమ నను మరచిపోకుమా … (లైలా మజ్ను)

మన సంగీతంలో మరొక ముఖ్యమైన రాగం సింధుభైరవి. ఆర్తి కలిగిన ఈ రాగం, కరుణరస ప్రధానమైనది. గొప్ప సంగీతానందం (Aesthetic Bliss) ఇచ్చే రాగం సింధుభైరవి. ప్రయోగ ప్రధానమైన ఈ రాగం, ఎంతమంది ఎన్ని సార్లు పాడినా తరగని అవకాశం, తరగని స్వర బృందాలు కలిగిన రాగం. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. సింధుభైరవి రాగంలో సినిమాపాటలు (పైన ఇచ్చిన లిస్ట్‌చూడండి), వాద్య బృంద రచనలు, జానపదాలు, భజనలు, దేశ భక్తి పాటలు, లలిత గీతాలు వేలకు వేలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ రాగంలో కొత్తకొత్త పాటలు వస్తూనే ఉన్నాయి.
సింధుభైరవి రాగాన్ని దేశీయ రాగం అంటారు. అంటే, అన్య (హిందూస్తానీ) పద్ధతికి చెందిన ఈ రాగాన్ని మన కర్ణాటక సంగీత సాంప్రదాయకులు సింధునదీ ప్రాంత భైరవిగా గుర్తించి పెట్టుకున్న పేరు “సింధుభైరవి”. సాధారణంగా మన కచ్చేరీలలో చివరగా పాడే రాగం సింధుభైరవి. హిందూస్తానీ సంగీత కచ్చేరీలలో కూడా భైరవి రాగాన్ని (హిందూస్తానీ సంగీతంలోని భైరవి రాగం మన కర్ణాటక సంగీతంలోని సింధుభైరవి కి సమానం) పాడిన తరవాత ఇంక ఏ రాగాన్ని పాడరు. ఇదే ఆఖరి రాగం. కానీ, కర్ణాటక సాంప్రదాయంలో అంత ఖచ్చితంగా ఈ పద్ధతి పాటించరు. సింధుభైరవి పాడిన తరవాత సురటి గాని మధ్యమావతి గాని పాడతారు.

స్వరస్థానాలు పరిచయం
             కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో, పూర్వ వాగ్గేయకారులు సింధుభైరవి రాగంలో కృతులు కాని మరే రచనలు చెయ్యలేదు. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్తలలో 8వ మేళకర్త అయిన హనుమత్తోడి నుంచి జనించిన రాగం సింధుభైరవి. స్వరపరంగా సింధుభైరవిలో ఆరోహణలోనూ, అవరోహణలోనూ సప్తస్వరాలున్నాయి. కీబోర్డ్‌మీద కాని, మరే వాయిద్యం పైన కాని సింధుభైరవి వాయించ ప్రయత్నిస్తే, స్వరస్థానాలు ఈ విధంగా ఉంటాయి.
స రి1 X గ1 X మ1 X ప ద1 X ని1 X స
ఆరోహణ సరిగమపదనిసా
అవరోహణ సానినీదపామాగరిగారిసా లేక సనిదపమగరిస
కర్ణాటక సాంప్రదాయం ప్రకారం సింధుభైరవిలో ఉన్న స్వరాలు షడ్జమం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం, కైశిక నిషాధం. కాని అన్య స్వరాలైన (రి2, గ2, మ2, ద2, ని2) అన్నిస్వరాలు ఈ ప్రయోగ ప్రధాన రాగంలో ఉన్నాయి. అంటే, మొత్తం 12 స్వరస్థానాలూ ఈ రాగంలో వాడవచ్చు. అయితే, సింధుభైరవి రాగంలోని అన్య స్వరాలు ఏ సందర్భాలలో పాడాలో, ఎలా పాడితే అందంగా ఉంటుందో తెలిసిన విద్వాంసుల ద్వారా తెలుసుకొని పాడాలి!

హిందూస్తానీ సంగీతంలో…
హిందూస్తానీ సంగీతంలో సింధుభైరవి అన్న రాగం ఉన్నా, మన సాంప్రదాయం లోని సింధుభైరవికి అతి దగ్గరగా ఉండే హిందూస్తానీ రాగం “భైరవి”. హిందూస్తానీ పద్ధతిలోని ఈ “భైరవి” రాగం చాలా పాప్యులర్‌రాగం. శాస్త్రీయ సంగీతం లోనే కాకుండా, భైరవి రాగం ఆధారంగా అనేక హిందీ పాటలు ట్యూన్‌చెయ్య బడ్డాయి. ముఖ్యంగా 1950, 60 దశాబ్దాలలో వచ్చిన హిందీ సినిమాల్లోని పాటల్లో “భైరవి” వాడకం ఎక్కువగా కనపడుతుంది.

ఈ వ్యాసం ముందు ఇచ్చిన లిస్ట్‌లో ఉన్న పాటలు మీకు పరిచయం ఉంటే, ఈ పాటల మధ్య ఉన్న పోలికలు మీకు తెలుస్తాయి. ఆంటే, అప్పుడప్పుడు మీకు తెలియకుండానే ఒక పాట నుంచి మరొక పాటలోకి దూకేస్తారు. దీనికి కారణం వీటన్నిటిలోనూ ఉన్న రాగలక్షణం ఒకటి కావటమే! ఈ మధ్య ప్రముఖ కధకుడు శ్రీ “భరాగో” (భమిడిపాటి రామగోపాలం) గారి వ్యాసం ఒకటి చదివాను. పాత సినిమా పాటల గొప్పతనాన్ని గురించి వ్రాస్తూ, 1949లో రిలీజ్‌అయిన “కీలుగుఱ్ఱం” సినిమా రిలీజ్‌అయిన రోజునే చూసిన భరాగో స్నేహితుడు ” మొత్తం మూడు గంటల సినిమాలోనూ మూడు నిమషాలు బాగుంది. ఆ మూడు నిమషాలైనా బాగుండటానికి కారణం కాదుసుమా కల కాదు సుమా అన్న పాట!” అన్నాట్ట. నిజంగా అలాంటి ఈ పాటకి సంగీత దర్శకుడు ఘంటసాల స్వరం ఇచ్చింది సింధుభైరవి రాగంలోనే! ఈ పాట చరణంలో వచ్చే “ప్రేమలు పూచే సీమల లోపల …” అన్న పదాల తరవాత సాగే ఆలాపన, పాట మొత్తంలో వినిపించే ఘంటసాల లేత గొంతు, ఆ స్వరకల్పన 50 ఏళ్ళ తరవాత కూడా ఇంకా మనకి గుర్తు ఉన్నాయంటే ఈ పాట ఎంత గొప్పదో తెలుస్తోంది. అలాగే 1949లో రిలీజ్‌అయిన మరొక సంగీత పరమైన గొప్ప చిత్రం ” లైలా మజ్ను” గురించి తప్పకుండా చెప్పుకోవాలి. శ్రీ సి. ఆర్‌. సుబ్బురామన్‌సంగీత దర్శకత్వంలో సింధుభైరవిలో ఘంటసాల పాడిన “పయనమయే ప్రియతమ నను మరచిపోకుమా …” అన్న పాట మనకున్న పాత సినిమా పాటల్లో మరొక గొప్ప పాట. సింధుభైరవి రాగంలో అన్యస్వరాలైన రి2, గ2, ని2 ( చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, కాకలి నిషాధం) స్వరాలను అందంగా వాడారు శ్రీ సుబ్బురామన్‌. ఈ పాటలోని రెండవచరణంలోని “విధి బలీయమని తెలుసూ తెలుసు నాకు నీమనసు” అన్న పదాల్లో “విధి” అన్నప్పుడు అంతర గాంధారం (గ2), “తెలుసు” అన్నప్పుడు చతుశ్రుతి రిషభం (రి2), కాకలి నిషాధం (ని2) వాడటం జరిగింది. మొత్తం మీద పాత సినిమా సంగీత దర్శకులు సింధుభైరవి రాగంలో ఎక్కువగానే స్వర రచనలు చేసారు. గుండమ్మ కధ, సంసారం, పెళ్ళిచేసి చూడు, లాంటి సినిమాల్లోనే కాకుండా ప్రైవేటు రికార్స్డ్‌లో చాలానే పాటలు, పద్యాలు సింధుభైరవి రాగంలో కట్టారు.

ఈ వ్యాసం ముందు ఇచ్చిన పాటల లిస్ట్‌చూస్తే, తెలుగు సినిమా పాటల స్వర కల్పనలో, వాసిలోనూ రాసిలోనూ కూడా మొదట చెప్పుకోవలసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు శ్రీ సాలూరు రాజేశ్వరరావు, సింధుభైరవి రాగంలో ఎంతటి వైవిధ్యంగా పాటల స్వరకల్పన చేసారో తెలుస్తుంది. “రంగుల రాట్నం” సినిమా కోసం “నడిరేయి ఏ ఝాములో…” , “ఇంతేరా ఈ జీవితం…” అన్న రెండు పాటలు సింధుభైరవి రాగంలో స్వరం కట్టినా, ఈ రాగం ప్రయోగంలో వాడుకొన్న తేడాలు తేలికగా కనపడతాయి. అలాగే, “ఓహో యాత్రికుడా …” అన్న ప్రైవేటు పాట సింధుభైరవి రాగంలో స్వర పరచి పాడినవారు సాలూరు వారే!

ప్రముఖ తెలుగు సినీ నేపధ్య గాయకుడు శ్రీ పి. బి. శ్రీనివాస్‌(ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు), సాలూరు వారి సంగీత దర్శకత్వంలో పాడాలని ఉబలాటపడుతున్న రోజుల్లో, శ్రీ పి. బి. శ్రీనివాస్‌గారికి మొదటి ఛాన్సు ఇచ్చి పాడించిన పాట సింధుభైరవి రాగంలో బాణీ కట్టినదే! ఆ పాట భలే రాముడు సినిమాలోని “భయమేలా ఓమనసా..” అన్న పాట. ఎవరన్నా ఈపాటను ఏదైనా instrument పై పలికించ ప్రయత్నిస్తే, సింధుభైరవిలో అన్య స్వరాలను అందంగా ఎలా ఉపయోగించారో తెలుస్తుంది. చరణం మధ్యలో వచ్చే, “శ్రీకృష్ణుని నమ్మేవా నీ కష్టాలన్నీ ..” అన్నప్పుడు సింధుభైరవిలోని అన్య స్వరమైన చతుశ్రుతి (తీవ్ర) రిషభం (రి2) “నీ కష్టాలన్నీ” లో వినపడుతుంది. శ్రీ సాలూరు రాజేశ్వర రావు + సింధుభైరవి అన్నప్పుడు, భార్యాభర్తలు సినిమాలో సింధుభైరవిలో స్వరం చేసిన “ఏమని పాడెదనో ఈవేళా …” అన్న శ్రీమతి సుశీల పాడిన పాటను గుర్తు చేసుకోకుండా ఉండలేం!

ఘంటసాల వెంకటేశ్వర రావు, సాలూరు రాజేస్వర రావు వంటి గొప్ప సంగీత దర్శకుల్లాగే శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు కూడా చాలా ఎక్కువగా సింధుభైరవి రాగాన్ని సినిమా పాటల్లో వాడారు. ప్రఖ్యాత గాయకుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన “ఏటిలోని కెరటాలు ఏరువిడిచి పోవు ..” అన్న సింధుభైరవి రాగంలో కట్టిన పాట ఈనాటికి కూడా పాప్యులర్‌పాటే! సినిమా పాటల గురించి చాలా విషయాలు చెప్పటానికి ఉన్నా, రేడియో ద్వారా లలిత సంగీతాన్ని ప్రజలకు అందించిన సంగీత దర్శకులు, గాయకులు కూడా సింధుభైరవి రాగాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించుకొన్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకప్పటి విజయవాడ రేడియో ఆర్టిష్టులైన శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు, శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు, శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ, శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం వంటి వారు చాలా లలిత గీతాలు సింధుభైరవి రాగంలో పాడారు.

పైన చెప్పిన సంగీత దర్శకుల తరవాత తరంలో గుర్తుపెట్టుకోతగిన సంగీత దర్శకుడు శ్రీ కె. వి. మహాదేవన్‌. “సప్తపది” సినిమాలో ఆయన స్వరం ఇచ్చిన రెండు సింధుభైరవి పాటలూ హిట్సే! (ముందు ఇచ్చిన పాటల లిస్టు చూడండి) ఈ పాటలకన్న ముందు గుర్తు పెట్టుకోవలసిన పాట మూగమనసులు సినిమాకోసం సింధుభైరవి రాగంలో స్వరం ఇచ్చిన “ముద్దబంతి పూవులో …” అన్న పాట. ఈ పాట వచ్చిన కొత్తల్లో ఎంత ప్రజాదరణ పొందిందో, ఇప్పటికీ తెలుగువాళ్లల్లో అంత పాప్యులర్‌అయిన పాట ఇది.  ఏదైనా ఒక instrument మీద వాయించడానికి ఇష్టపడే వారికి వీలుగా ఈపాట స్వరాలు ఇక్కడ ఇచ్చాను.

“ముద్దబంతి పూవులో …” స్వరాలు

Opening
ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో
Notes of Chord సమదస గమపా మగరిస
ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలూ ఎందరికీ తెలుసులే …. ముద్దబంతి..
1st Interlude నిని సస సారిగా రిరి రిగ రీరీస
String సగ సపగ సస నిదని ససాని ససాని దపదా
Flute గమప మమ మపద పప
String గమదని సరి మగరిగసా
మొదటి చరణం
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏదీ దాగుందో తెలుసునా
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాలా ఏముందో తెలుసునా … ముద్దబంతి..
2nd Interlude
Flute పదప మామ మమమ గా గా మమమమ మామగ
పద పపప పద పదని ససని నిసాని నినిని నిని దపమగ
పదప మమ మాగరి సనిగా రిసనిదరీ
String సస గగమా
రెండవ చరణం
మనసు మూగదేగాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో … ముద్దబంతి ..
3rd Interlude
మపదా మపదా మపదా మపా గమా
గమపా మగమా రిసరి మగరిస దని దగా రిగాస
మూడవ చరణం
ముక్కోటి దేవుళ్ళూ మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడి ఏసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు
మూగమనసు బాసలు మీ కిద్దరికి సేసలు … ముద్దబంతి ..
---------------------------------------------------------------------------------------------------------------------
Source : www.eemaata.com

0 comments:

Post a Comment