Tuesday, February 26, 2013

కల్యాణి రాగం

కల్యాణి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు
1. జగమే మారినది మధురముగా ఈ వేళ… (దేశద్రోహులు)
2. తలనిండ పూదండ దాల్చిన రాణి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్‌)
3. మనసున మల్లెల మాలలూగెనే… (మల్లీశ్వరి)
4. మది శారదాదేవి మందిరమే… (జయభేరి)
5. పెనుచీకటాయే లోకం… (మాంగల్య బలం)
6.జోరుమీదున్నావు తుమ్మెదా … (శివరంజని)
7. పాడనావాణి కల్యాణిగా… (మేఘ సందేశం)
8. చల్లని వెన్నెలలో… (సంతానం)
9. మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమికా… (భీష్మ)
10. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు… (ఏకవీర)
11. శ్రీరామ నామాలు శతకోటి… (మీనా)
12. పలుకరాదటే చిలుకా… (షావుకారు)
13. మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి… (రామదాసు కీర్తన)
14. జయ జయ జయ ప్రియభారత జనయిత్రి… (దేవులపల్లి దేశభక్తి గీతం)
15. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా… (చెంచులక్ష్మి)
16. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. (దేవదాసు)
17. కిలకిల నవ్వులు చిలికిన … (చదువుకున్న అమ్మాయిలు)
18. దొరకునా ఇటువంటి సేవ… (శంకరాభరణం)
19. సలలిత రాగ సుధారస సారం… (నర్తనశాల)
20. మనసు పాడింది సన్నాయి పాట… (పుణ్యవతి)
21. రారా నా సామి రారా… (విప్రనారాయణ)
22. పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకొని… (పెళ్ళిచేసి చూడు)
23. పూవైవిరిసిన పున్నమి వేళ… (తిరుపతమ్మ కధ)
24. రావే నా చెలియా… (మంచిమనసుకు మంచి రోజులు)
25. విరిసే చల్లని వెన్నెలా… (లవకుశ)
26. వెలుగు చూపవయ్యా మదిలో కలతా బాపవయ్యా… (వాగ్దానం)
27. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి… (వెలుగు నీడలు)
28. ఆకసమున చిరుమబ్బుల చాటున… (AIR Private Record)
29. సరసాల జవరాలను… ( సీతారామ కల్యాణం)
30. సా విరహే తవదీనా … (విప్రనారాయణ)
31. హిమాద్రి సుతే… (కన్నడ సినిమా “హంస గీతె”)
32. నల్లని వాడా నే గొల్లకన్నెనోయ్‌.. (రావు బాలసరస్వతి ప్రైవేట్‌పాట)
33. సఖియా వివరింపవే … (నర్తన శాల)


              కర్ణాటక సంగీతంలో మరొక ముఖ్యమైన రాగం కల్యాణి. కల్యాణి రాగం శుభప్రదమైనది. కల్యాణ ప్రదమైనది. ఎంతమంది విద్వాంసులు ఈ రాగాన్ని పాడినా, పాడినవారికి, విన్నవారికి ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా ఉంటుంది. ఈ రాగం ఆధారంగా జనించిన జన్యరాగాలు అనేకం ఉన్నాయి. హమీర్‌కల్యాణి, బేహాగ్‌, అమృతవర్షిణి, హంసనాదం మొదలైనవి ముఖ్యమైనవి. కర్ణాటక సంగీతంలోని ఐదు ముఖ్యమైన రాగాలైన కల్యాణి, తోడి, శంకరాభరణం, భైరవి, కాంభోజి రాగాల్లో కనీసం ఒక్క రాగమైనా లేకుండా ఒక చిన్న కచేరీ కూడా ఉండదు. అలాంటి ఈ ఐదు రాగాల్లో కూడా ముఖ్యమైన రాగం కల్యాణి.

              కల్యాణి రాగం 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుంచి జనించిన రాగం. మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలో ప్రసిద్ధమైన 72 మేళకర్తలు ఏర్పడటానికి ముందే కల్యాణి రాగం ఉందని పండితుల అభిప్రాయం! 72 మేళకర్తల పద్ధతి ఏర్పడిన తరువాత, ఈ పధకం ప్రకారం కల్యాణి రాగం, 65వ మేళకర్త అయిన “మేచకల్యాణి” జన్యం అయింది.పూర్వ వాగ్గేయకారుల ప్రసిద్ధ రచనలు కల్యాణి రాగంలో చాలా ఉన్నాయి. “నిధి చాలా సుఖమా..”, “ఏతావునరా…”, “నమ్మి వచ్చిన…”, అమ్మ రావమ్మ…”, “వాసుదేవయని…”, “సుందరి నీ దివ్య రూపము…” వంటి త్యాగరాజ రచనలే కాక, “బిరాన వరాలిచ్చి…”, “హిమాద్రిసుతే…” వంటి శ్యామ శాస్త్రి రచనలు కూడా ప్రసిద్ధమైనవే!
 
                     మనోధర్మ సంగీతంలో కల్యాణి రాగానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. అవకాశం వచ్చింది కాబట్టి మనోధర్మ సంగీతం గురించి రెండు మాటలు చెప్పుకోవాలి.శాస్త్రీయ సంగీతం అభ్యాస సంగీతమనీ, మనోధర్మ సంగీతమనీ రెండు విధాలు. ఇందులో మొదటిది గురుముఖంగా నేర్చుకొనే అలంకారాలూ, గీతాలూ, వర్ణాలూ, కృతులు మొదలైనవి ఉంటే, రెండవ విధానమైన మనోధర్మ సంగీతంలో స్వరకల్పన, రాగం, పల్లవి మొదలైనవి ఉదాహరణలుగా చెప్పవచ్చు.ఈ రెండు విధానాలైన సంగీతాలలో కూడా పాండిత్యం సంపాదించినప్పుడే, సంగీతంలో సంపూర్ణతని సాధించగలుగుతారని విద్వాంసుల అభిప్రాయం. మనలో చాలామందికి శాస్త్రీయ సంగీతంలో పరిచయం, ప్రవేశం లేకపోయినా అంతో, ఇంతో సంగీతం మనకి తెలియటానికి కారణం, మనకి తెలియకుండానే మనం మనోధర్మ సంగీతం అభ్యసించడమే! తేలిక మాటల్లో చెప్పాలంటే, సంవత్సరాల తరబడి సంగీతాన్ని విని, విని వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వాళ్ళు మనోధర్మ సంగీత పద్ధతిని పాటిస్తున్నారన్నమాట. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పద్మభూషన్‌డా. శ్రీపాద పినాకపాణి గారు మనోధర్మ సంగీతం గురించి చెప్పిన ఈ క్రింది మాటలు ఈసందర్భంలో గుర్తుకు తెచ్చుకోవడం అవసరం.

                        ” తమిళనాడులో, గురువు వద్ద సంగీతం అభ్యసించకపోయినా, సంవత్సరాలపాటు రాగాలాపన విని, వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆంధ్రదేశంలో శాస్త్రీయ సంగీతం అంత ధారాళంగా వినబడడానికి మనం నోచుకోలేదు. అందుచేతనే సంగీతం యధావిధిగా నేర్చిన విద్యార్ధులకు కూడా రాగం పాడే శక్తి రావడంలేదు. గురువే రాగం పాడుతూ విద్యార్ధిచేత పాడిస్తూ నేర్పాలి. నొటేషను వ్రాసి, చదువనేర్చిన విద్యార్ధికి ప్రసిద్ధరాగాలలో తరచూ వినబడే సంగతులను స్వరపరచి వ్రాసిచ్చి, వాటిని కంఠోపాఠంగా వచ్చేవరకూ చెప్పి, పాడించాలి. విద్వాంసులు పాడే రాగాలాపనలను నిరంతరం వింటూ ఉండడం అన్నిటికంటే ఎక్కువ అవసరం. స్వరకల్పన పాడుతూ పాడించినట్లే, రాగం కూడా గురువు నేర్పాలి.

                    ప్రతివిద్యార్ధికీ, “మనోధర్మ సంగీతం”, అభ్యాస సంగీతం లాగే పాఠం చెప్పి నేర్పించాలి. అలా చెప్పగా విద్యార్ధులకు మనోధర్మ సంగీతజ్ఞానం తప్పక లభిస్తుంది. ఇది వట్టి మాట కాదు! అనుభవంతో చెప్పిన సలహా.”
స్వరస్థానాలు పరిచయం

                  కల్యాణి సంపూర్ణ రాగం. అంటే ఆరోహణలోనూ, అవరోహణలోనూ కూడా ఏడు స్వరాలూ ఉపయోగించే రాగం. మూలస్వరాలైన “స”, “ప” లు కాక ఉపయోగించే స్వర స్థానాలు చతిశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. కల్యాణి రాగం ప్రయోగ ప్రసిద్ధి రాగం. ముఖ్యంగా పంచమం (స్వరం “ప”) వాడకుండా ఎక్కువ ప్రయోగాలు చెయ్యవచ్చు. అలాగే మూల స్వరాలైన “స”, “ప” లను రెంటినీ విడిచి, “రి గ మ ద ని” స్వరాలతో ప్రయోగాలు చేయ్యవచ్చు. ఆలాపనకి చాలా అవకాశం ఉన్న కల్యాణి రాగం, చాలా elaborateగా పాడి రాగం యొక్క depths చూపించటానికి అవకాశం ఉన్న రాగం ఇది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. అన్ని రాగాలలో creativity చూపించుకోటానికి అవకాశం ఒకే విధంగా ఉండదు! కొన్ని రాగాలు elaborateగా పాడటానికి వీలుండదు (గాయకురాలు/గాయకుడు ఎంత సమర్ధురాలైనా/సమర్ధుడైనా). కీబోర్డ్‌మీద కాని, మరే వాయిద్యం పైన కాని కల్యాణి రాగం వాయించ ప్రయత్నిస్తే, స్వరస్థానాలు ఈ విధంగా ఉంటాయి.
 
స X రి2 X గ2 X మ2 ప X ద2 X ని2 స
ఆరోహణ           సరిగమపదనిసా
అవరోహణ        సానిదపమగరిస

                  కల్యాణి రాగాన్ని “తీవ్ర” రాగం అంటారు. రాగలక్షణంలో తీవ్రమైన అనుభూతుల్ని చూపించకపోయినా, స్వరస్థానాల దృష్య్టా, అన్ని స్వరాలూ “తీవ్ర” స్వరాలే కాబట్టి, కల్యాణి రాగాన్ని “తీవ్ర రాగం” అంటారేమో!
హిందూస్తానీ సంగీతంలో…
హిందూస్తానీ సంగీతంలోని “యమన్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని కల్యాణి రాగానికి సమానం. స్వరస్థానాల్లో కల్యాణికి, యమన్‌కి తేడాలు ఏమీ లేవు. మనసుకు చాలా ఆహ్లాదం కలిగించే ఈ రాగం రాత్రి మొదటి వేళల్లో పాడుకొనే రాగం. పైన చెప్పినట్టు, హిందూస్తానీ సంగీతంలో కూడా మూలస్వరాలైన “స”, “ప”లను విడిచి ప్రయోగాలు చేస్తారు. హిందూస్తానీ పద్ధతిలోని యమన్‌ పకడ్‌ ఈ రకంగా ఉంటుంది.
నిరిగరి స పమగ రి పరిస
ఆరోహణ స్వర సంచారాల్లో “నిరిగ”, “మదని” ఎక్కువగా వాడతారు. అవరోహణ స్వరాల్లో “గ” స్వరాన్ని వదిలేసి, “పరిస” అన్న ప్రయోగం ఎక్కువగా ఉపయోగిస్తారు.
 
సినిమా పాటలు
సినిమా పాటల్లో కల్యాణి రాగాన్ని చాలా ఎక్కువగా వాడారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ సంగీత సారధ్యంలో భైరవి నరసయ్య అనే సంగీత విద్వాంసుడి కధను “హంస గీతె” అన్న కన్నడ సినిమాగా తీసారు. సినిమా మొత్తం భైరవి రాగం మీద focus చేసినా, కల్యాణి రాగంలో ఈ సినిమాలో పాడిన “హిమాద్రి సుతే” అన్న శ్యామ శాస్త్రి రచన చెప్పుకోతగ్గది. ఇందులో విశేషం ఏమిటంటే, శ్యామశాస్త్రి రచనని రెండు విభిన్న తాళాలలో ఇద్దరు గాయకులు పాడడం (గాయకులు బాలమురళీకృష్ణ, ఎం. వి. రమణమూర్తి గార్లు) ప్రయోగాత్మకంగా ఉంది. ఈ రెండు పాటలు “కల్యాణి” రాగంలోనే పాడినా, తాళాలు వేరుగా ఉండటం వల్ల కొంత వింతగానూ, కొత్తగానూ ఉంటాయి.
 
                     హిందీ సినిమాల్లో కూడా “యమన్‌” రాగాన్ని విపరీతంగా వాడుకున్నారు. “బర్సాత్‌కి రాత్‌” అన్న సినిమాలో మహమ్మద్‌రఫీ పాడిన “జిందగీభర్‌నహీ భూలేంగే” అన్నపాట, “చిత్‌చోర్‌” సినిమాలో ఏసుదాసు, హేమలతా పాడిన “జబ్‌దీప్‌జలే ఆనా..” అన్న పాట యమన్‌రాగంలో compose చేసినవే! కల్యాణి, యమన్‌రాగాల పోలికలు, తేడాలు తెలియాలంటే తెలుగులోనూ, హిందీలోనూ ఒకేపేరుతో తీసిన “సువర్ణ సుందరి” అన్న సినిమాలో ని “హాయి హాయిగా ఆమనిసాగే..” అన్న తెలుగుపాట, ” కుహూ కుహూ బోలే కోయలియా..” అన్న హిందీ పాట నాల్గవ (ఆఖరి) చరణం జాగ్రత్తగా వినండి. ఈ పాటలు ముందు తెలుగులోనూ, తరవాత హిందీలోను వచ్చాయి. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు శ్రీ ఆది నారాయణ రావు సంగీత దర్శకత్వంలో స్వరం కట్టబడ్డ ఈ పాటలు రాగమాలికలు. ఈ పాటల్లోని నాలగవ చరణం ముందు వచ్చే ఆలాపన, తరవాత చరణం పాడుతున్నపుడు ఘంటసాల & జిక్కీ కల్యాణి రాగాన్ని పాడితే, రఫీ & లత యమన్‌రాగాన్ని పాడతారు. సినిమాపాటల ద్వారా ఈ రెండు రాగాలకి పోలికలు, తేడాలు తెలియాలంటే ఈ పాటలు ఒక మంచి ఉదాహరణలు.

          తెలుగు సినిమాపాటల్లో కల్యాణి రాగంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు శ్రీ సాలూరు రాజేశ్వర రావు తీసుకువచ్చినంత variety ఇంకే సంగీత దర్శకుడు తీసుకురాలేదంటే అతిశయోక్తి కాదు. ఈయన పాటల్లో మామూలుగా కనపడే richness కల్యాణి రాగంలో మరీ కొట్టచ్చిన్నట్టు తెలుస్తుంది. దేశద్రోహులు సినిమా కోసం స్వరం చేయబడ్డ “జగమే మారినదీ మధురముగా ఈ వేళ” అన్న పాట కల్యాణి రాగంలో స్వరపరచబడ్డ ఒక గొప్ప తెలుగు సినిమా పాట. పాట మొదలవుతూనే వినిపించే piano ద్వారా set చెయ్యబడ్డ తాళం, ఘంటసాల కంచు కంఠంతో, రెండవ చరణంలో “విరజాజుల సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుకా” తరవాత వచ్చే ఆలాపన అతి మధురంగానూ, లలితం గానూ ఉంటుంది. ఇదే చరణంలో “కమ్మని భావమే కన్నీరై చిందెనూ” తరవాత ఒక చక్కటి violin bit వేస్తాడు రాజేశ్వర రావు. ఇంత గొప్పగా ఇలా compose చేసిన ఈ పాటను, మల్లీశ్వరి సినిమాలోని all time great song “మనసున మల్లెల మాలలూగెనే..” తో పోల్చండి. రెండూ కల్యాణి రాగంలో ట్యూన్‌ చెయ్యబడ్డవే. పి. బి. శ్రీనివాస్‌చే సాలూరి వారు పాడించిన “మనసులోని కోరిక..”అనేపాట కల్యాణి రాగంలో బాణీ కట్టబడ్డ మరొక గొప్ప పాట.చెంచులక్ష్మి సినిమాలోని “పాలకడలిపై శేషతల్పమున …” అన్న గొప్ప భక్తి పాట కూడా కల్యాణి రాగంలో రాజేశ్వర రావు స్వరం ఇచ్చిందే! ఇలా ప్రతి పాటలోనూ మిగిలిన పాటలకన్న తేడాగా ట్యూన్‌ఇస్తూనే, కల్యాణి రాగాన్ని exhaust చేసినట్టనిపిస్తుంది.
 
                        కల్యాణి రాగాన్ని చాలామంది సంగీత దర్శకులు, హుషారైన పాటలకు వాడుకున్నారు. సాధారణంగా విషాద గీతాలకు కల్యాణి వంటి రాగాలు వాడరు. ఇందుకు భిన్నంగా రెండు ఉదాహరణలు ఇస్తాను. ముందు దేవదాసు సినిమా కోసం శ్రీ సుబ్బురామన్‌ఘంటసాలచే పాడించిన “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.” అన్న పాట. ఈపాట విన్న మొదట్లో నేను ఇది కల్యాణి రాగం అని గమనించలేదు. Flute మీద వాయించిన తరవాత ఈ పాట కల్యాణి రాగంలో ఇంత గొప్పగా ఎలా ట్యూన్‌ ఇచ్చాడో తెలుసుకున్న తరవాత, శ్రీ సుబ్బురామన్‌గారి మీద గౌరవం పెరిగింది. మాంగల్య బలం (పాతది) సినిమా కోసం మాస్టర్‌వేణు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసాడు. “పెనుచీకటాయే లోకం…” అన్న విషాద గీతం కూడా కల్యాణి రాగం అధారంగా బాణీ కట్టిందే. ఈ పాటలో ప్రతి మధ్యమం, శుద్ధ మధ్యమం రెండూ వాడబడ్డాయి.
సినిమా పాట కాకపోయినా, ఘంటసాల పాడిన అనేక private recordsలో బాగా popular అయిన “తలనిండ పూదండ దాల్చిన రాణి …” అన్నపాట కల్యాణి రాగంలో బాణీ కట్టిందే. ఉత్సాహంగా ఏదైనా instrument మీద వాయించే వారికోసం స్వరాలు ఇక్కడ ఇస్తున్నాను.
 
“తలనిండ పూదండ దాల్చిన రాణి …” స్వరాలు
Opening
Notes of Chord స గా పా
ఆరజనీకర మోహన బింబము … మ ప మా
నీనగుమోమును బోలునటే
కొలనిలోని, నవకమల దళమ్ములు, నీ నయనమ్ముల బోలునటే …

ని రి స
ఎచట చూసినా, ఎచట వేచినా, నీరూపమదే, కనిపించినదే …

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలకా నవ్వులతోడ మురిపించబోకే

1st Interlude
సాసాసా దా నీపా దాగా
దాదాదా పా గారీ నీసా

వీణ
దానిరీ గామా దానీసా
మొదటి చరణం
పూల వానలు కురియు మొయిలువో …
మొగలి రేకులలోని సొగసువో … నా రాణి
“తలనిండ…”

2nd Interlude
సాసాసా నీదాపాగారీసా (వీణ) పాగాసరీ
రిగా నీనీనీ దాపాగా రీనీసా (వీణ) గారీనీసా

వీణ
దానీ రీ గా మా దానీ నిగరీ నిదమపా
రెండవ చరణం
నీ మాట బాటలో నిండే మందారాలు … మపమా గారీరి
నీ పాట తోటలో నిగిడే శృంగారాలు… నిసనీ దాపాప
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు …
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు….

గాగాగా రిసని దపగా మాదానిసా
“తలనిండ…”

0 comments:

Post a Comment