Sunday, February 10, 2013

క్యాన్సర్‌కు ఆయుర్వేద చికిత్స...

ఆయుర్వేదంలో ప్రాచీనవైద్యుడు చరకమహర్షి నిరూపించిన విషయం: శరీరంలోని ఏ అవయవానికైనా, ఏ భాగానికైనా మూలం కంటికి కనబడని సూక్ష్మాతిసూక్ష్మమైన, అసంఖ్యాకమైన పరమాణు సముదాయమే. (శరీరావయాస్తు పరమాణు భేదానం ఆపరిసంఖ్యేయా భవంతి, అతిబహుత్వాత్, అతి సౌక్ష్మాత్, అతీంద్రియ త్వాత్ చ). ఇలాంటి పరమాణువుల స్వభావ క్రియ భేదాల వల్ల సప్త ధాతువులైన... రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రాలు’, వాటి తో పాటు వివిధ స్రోతస్సులు ఉత్పత్తి కాబడ్డాయి.

క్యాన్సర్ అనే పదానికి అర్థం ‘ఎండ్రకాయ’ (కర్కాటకం). నిశ్శబ్దంగా దొలిచి దొలిచి ధ్వంసం చేయడానికి ఇది పెట్టింది పేరు. వ్యాధి స్వభావాన్ని బట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇలాంటి స్వభావం గల వ్యాధులు ఆయుర్వేదంలో చాలా వాటిని వర్ణించారు. ఈ వ్యాధి సోకిన ధాతువును బట్టి, స్రోతస్సును బట్టి, అవయవాన్ని బట్టి, భాగాన్ని బట్టి పేరు మారుతుంటుంది. పైన చెప్పిన వాటిలో దేనికి సంబంధించినవైనా కొన్ని అణువులు ‘నివారింపశక్యంకాకుండా, అవాంఛితంగా పరిమాణంలో పెరిగిపోతుండటమే’ ఈ వ్యాధిలో జరిగే ప్రక్రియ. అణువిభజనకు వాతం (న్యూక్లియస్ కర్మలు), పచింపబడటానికి పిత్తం (మైటోకాండ్రియా కర్మలు), పోషణకు కఫం (ప్రోటోప్లాజం కర్మలు) కారణంగా నిలుస్తాయి.

కొన్ని వ్యాధుల పేర్లు
తీవ్రస్థాయికి చేరిన అర్బుద, గ్రంథి, అపచి, గండమాల మొదలైనవి. అర్బుదాలు (కణుతులు), తాలువు, నాలుక, ముక్కు, చెవి, రొమ్ముల్లో కూడా పుడతాయని వాగ్భటాచార్యులు ప్రత్యేకంగా చెప్పారు. అదేవిధంగా ఉపద్రవస్థాయికి చేరిన రస మరియు రక్తవహస్రోతో దుష్టి లక్షణాలే ఈ నాటి బ్లడ్‌క్యాన్సర్లు.

వ్యాధికి కారణాలు
అసలు కారణం స్పష్టంగా తెలియదు. వాతపిత్తకఫాల ప్రాకృత కర్మలను చెడగొట్టే ఆహార విహారాలు, ధూమ, మద్యపానాలు, ఇతర మాదకద్రవ్యాలు, విపరీతమైన మానసిక ఒత్తిడి కారణాల్లో కొన్ని. ప్రస్తుతం సమాజంలో 90 శాతం ఆహారపదార్థాలు, పాలు, తినుబండారాలు, నూనెలు, పండ్లు సమస్తం కల్తీయే. ఇది కూడా ఈ ‘కర్కశకర్కాటకాని’కి కారణమే.

చికిత్స
వ్యాధి తీవ్రతను బట్టి ‘ప్రవర, మధ్యమ, అవర’ అని విభజించబడింది. ప్రవరావస్థలో ఫలితాలు బాగుంటాయి. ఆయుర్వేదం కేవలం రోగవ్యతిరేక చికిత్స మాత్రమే కాకుండా రోగికి బలవర్థకమైన ‘రసాయన’ చికిత్స, అవసరాన్ని బట్టి శోధన (పంచకర్మ) చికిత్స, శస్త్రచికిత్సతో పాటు రోగం సోకిన భాగాన్ని బట్టి ఎన్నో ఔషధాలను విశదీకరించింది.

కొన్ని ముఖ్య ఔషధాలు
ఏకద్రవ్యాలు:
భల్లాతకీ (నల్లజీడిగింజ)
అమృతా/గుడూచీ (తిప్పతీగె)
చిత్రక (చిత్రమూలం)
హరిద్రా (పసుపు)
అశ్వగంధ (పెన్నేరుగడ్డ) ప్రధానమైనవి.

ఇతర ఏకమూలికలలో: శిరీశ్రీ (దిరిసెన), సీతాఫల, తులసి, మారేడు, తమలపాకు, లశున (వెల్లుల్లి), నేల ఉసిరిక (భూమ్యామలకి), కటుకరోహిణి, బ్రాహ్మీ, శతావరీ (పిల్లిపీచర), అశోక, మంజిష్ఠ, దుగ్ధిక, త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసిరి), పాషాణభేది (కొండపిండి) మొదలైనవి చాలా చెప్పబడ్డాయి.

మిశ్రమ ఔషధాలు:
భల్లాతకీ లేహ్యం
అమృత భల్లాతకీ లేహ్యం
అగస్త్యరసాయనం
అశ్వగంధాది లేహ్యం
చిత్రకహరీతకీ రసాయనం
ఆమలకీ రసాయనం
గుడూచీసత్వం మొదలైనవి.

గమనిక: రోగి బలాన్ని, వ్యాధి సోకిక భాగాన్ని, అవయవాన్ని బట్టి ఏ ఔషధం, ఏ రూపంలో, ఎంతకాలం వాడాలో ఆయుర్వేద నిపుణులు నిర్ణయించి, పర్యవేక్షించాలేగాని, బైరాగి చిట్కాలు, సాధువుల వైద్యాలు క్యాన్సరును పోగొట్టలేవు. అలాంటి ప్రకటనలకు మోసపోవద్దు.

ఆయుర్వేద మార్గంలో నివారణ
బాల్యం నుంచి శాస్త్రబద్ధంగా కల్తీలు లేని, బలవర్ధకమైన సాత్వికాహార సేవన ఆవునెయ్యి, నువ్వుల నూనె రోజూ రెండేసి చెంచాలు సేవించాలి

పాలు, పెరుగు, వెన్నలు ఆవువైతేనే శ్రేష్ఠం. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి

పరిమిత వ్యాయామం, జీవితాంత ప్రక్రియగా భావించి, ప్రతిదినం చేయాలి

దూమ, మద్యపానాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి

రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రించి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి

మానసికారోగ్యం కాపాడుకోవడం ప్రధానం. కాబట్టి సంతోషం, శాంతం, ఉత్సాహం, కారుణ్యం వంటి లక్షణాలను అనుసరించాలి. (తనకోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష). వీటిని ఆయుర్వేదంలో ‘ఆచార రసాయనా’లంటారు

ఉసిరికాయరసం రోజూ రెండు చెంచాలు తాగాలి లేదా త్రిఫలా చూర్ణం రోజూ ఒక చెంచా తేనెతో

పది తులసి ఆకులు, ఐదు మారేడు ఆకులు నమిలి తినాలి

ఏదో ఒక తాజా ఫలం ప్రతిరోజూ తినాలి. 
Source : Sakshi

0 comments:

Post a Comment