Pages

Saturday, May 18, 2013

చిన్నజీవులకు దెబ్బలు తగలవా?

ఆకారంలో చిన్నగా ఉండే జీవుల తాలూకు శరీర ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికారణంగా భూమి యెక్క గురుత్వాకర్షణశక్తి వాటిపై చూపించే ప్రభావంకన్నా గాలిలాంటివి వాటి ఉపరితలంపై చూపించే ప్రభావం సాపేక్షికంగా కొంచెం ఎక్కువగా వుంటుంది. దాంతో ఏదైనా ఒక ఎత్తై ప్రదేశం నుండి కిందకు పడిపోయినప్పుడు పెద్ద జీవులకన్నా చిన్నజీవులకు తక్కువ దెబ్బలు తగులుతాయి.

పడే విధానాన్ని బట్టి, ఎత్తుని బట్టి ఒక్కోసారి ఎలాంటి దెబ్బలూ తగలకపోవచ్చు. అంతేగాని అసలు మొత్తానికే దెబ్బలు తగలవు అనుకోవడం సరైనది కాదు. చిన్నజీవుల శరీరం తాలూకు బరువు, ఘనపరిమాణం తక్కువగానూ, అదే సమయంలో వాటి ఉపరితల వైశాల్యం ఎక్కువగాను ఉండే కారణంగా అలాంటి జీవులు పైనుంచి కిందికి పడుతున్నప్పుడు కేవలం పడిపోతున్నట్లుగా కాక ఎగురుతున్నట్లు లేదా ఎగరడానికి ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తాయి.

ఒక్కోసారి జోరుగా వీచే గాలికి అవి గాలితోపాటు కొంత దూరం కొట్టుకొనిపోతాయి కూడా! వివిధరకాల కీటకాలు, పురుగులకే గాక ఆకులు, విత్తనాలు, కాగితం ముక్కలు వంటి వాటికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏదేమైనా పైనుంచి కిందికి పడిపోయేటప్పుడు మామూలు దెబ్బలు గాని, తీవ్రమైన దెబ్బలు గాని తగిలే అవకాశం పెద్దజీవులకే ఎక్కువ!

No comments:

Post a Comment