Pages

Friday, February 1, 2013

ఏనుగు బొమ్మ - కథ

ఒక ఊరిలో అమృత అనే అమ్మాయి ఉండేది. ఆమె బడికి వెళ్ళే మార్గంలో ఒక చింతచెట్టు ఉంది. దాని కింద కొయ్య బొమ్మలు చేసే ఒక తాత ఉండేవాడు. ఆయన ప్రొద్దున నుండి సాయంత్రం చీకటి పడే వరకు ఎంతో దీక్షగా కొయ్యను చెక్కుతూ రకరకాల జంతువుల బొమ్మలను తయారు చేసేవాడు. అమృత వస్తూ పోతూ కాసేపు అక్కడ ఆగేది. ఆయన చేతిలో రూపు దిద్దుకుంటున్న బొమ్మను ఆసక్తిగా చూసేది.

ఒకరోజు అమృత ఆయనతో ‘‘తాతా నాకో బొమ్మ కావాలి?’’ అని అడిగింది.
‘‘ఏ బొమ్మ కావాలి తల్లీ’’ అని ఆయన అడిగాడు.
తాత దగ్గరున్న బొమ్మల్ని పరికించి చూసింది అమృత. అక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి. వాటిలో జిరాఫీ, కోతి, పులి, కుందేలు బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ‘‘నీ దగ్గర ఏనుగు బొమ్మ లేదు. ఒక ఏనుగు బొమ్మ తయారు చేసి పెట్టగలవా?’’ అని అడిగింది.
‘‘తప్పకుండా. మరి దాని ధర యాభై రూపాయలు అవుతుంది. నీ దగ్గర అంత డబ్బు ఉందా?’’ ఆన్నాడాయన.

‘‘కొంత ఉంది తాతయ్యా. మిగిలిన డబ్బును నువ్వు బొమ్మ చేసేలోపుగా కూడబెడతాను’’ అని చెప్పింది అమృత. ఇక ఆరోజు నుండి తండ్రి తన అవసరం కోసం ఇచ్చిన రూపాయి, రెండు రూపాయలను దాచసాగింది. ప్రతిరోజూ బొమ్మలు చేసే తాత దగ్గరకు వెళ్ళి తన బొమ్మ గురించి ఆరా తీసేది. తాత ‘అయిపోవచ్చింది’ అంటూ సమాధానం చెప్పేవాడు. కొన్ని రోజుల తరువాత అమృత దగ్గర యాభై రూపాయలు పోగయ్యాయి. ఆ రోజు అమృత స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో తాత ఒక ఏనుగు బొమ్మ పట్టుకుని ఆమె కోసం ఎదురుచూడసాగాడు. అమృత దగ్గరకు రాగానే ‘‘ఇదుగో పాపా, నువ్వు అడిగిన ఏనుగు బొమ్మ’’ అని చూపించాడు.

అమృతకు ఎంతో సంబరం కలిగింది. ఆ ఏనుగును ఆప్యాయంగా చేత్తో తడిమి చూసింది. ‘‘డబ్బు తెచ్చి రేపు తీసుకెళ్తాను తాతా’’ అని చెప్పి ఇంటికి వచ్చేసింది అమృత.
ఆ మరునాడు తాత దగ్గరక వెళ్ళిన అమృత. ‘‘తాతా ఆ బొమ్మను నేను తీసుకోలేను. ఇంకెవరికైనా అమ్మేసుకోగలవా?’’ అని అడిగింది.

‘‘ఏమైంది డబ్బులున్నాయన్నావుగా?’’ అని అడిగాడు తాత.
‘‘అవును తాతా కూడబెట్టాను. కానీ నా స్నేహితురాలు పంకజ స్కూల్ ఫీజు కట్టలేదట. వాళ్ళు చాలా బీదవాళ్లు. ఫీజు కట్టడం లేదని మాస్టార్లు స్కూల్‌కి రావద్దన్నారట. రాత్రి మా ఇంటికి వచ్చి ఏడ్చింది. నేను ఆ డబ్బును పంకజకు ఇవ్వాలనుకుంటున్నా’’ అంది అమృత.
తాత ఆ చిన్నమ్మాయిలో ఉన్న పెద్ద మనసుకు ఆశ్చర్యపోయాడు. ‘‘మరి నీకు ఏనుగు బొమ్మ వద్దా?’’ అన్నాడు తాత.

‘‘వద్దులే తాతా. మళ్లీ ఇంకెప్పుడైనా కొనుక్కుంటాను’’ అని వెళ్ళబోయింది అమృత.
‘‘మీ తాతయ్య నీకు ఈ బొమ్మను బహుమతిగా ఇస్తున్నాడు. తీసుకో తల్లీ’’ అంటూ మొహమాట పడ్తున్న అమృత చేతిలో బలవంతగా ఏనుగు బొమ్మను ఉంచాడు తాత.

No comments:

Post a Comment