చిన్నపేగు పేరుకు మాత్రమే చిన్న. కానీ దాని బాధ్యతలు మాత్రం చాలా కీలకం.
మనకు కావలసిన ఆహారం అంతా అదే జీర్ణం చేయడమే కాదు... ఒంటికి పట్టేలా
చేస్తుంది. పేరుకు అది చిన్న పేగే అయినా దాని పొడవు 20 అడుగులకు పైమాటే!
పైగా జీర్ణవ్యవస్థ మొత్తానికి అదే పొడవైన భాగం. ఇటీవల ఢిల్లీలో రేప్‌కు
గురైన మహిళకు అంతర్గత అవయవాల్లో దెబ్బతిన్న మిగతా భాగాలన్నింటినీ ఎలాగోలా
పనిచేయించగలిగినా పేగులు తొలగించాల్సి రావడం వల్ల ఎంతో నష్టం జరిగింది.
అలాంటి చిన్నపేగుల పనితీరును, వాటి ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం.
చిన్నపేగులో ముఖ్యంగా మూడు ప్రధాన భాగాలుంటాయి. అవి... డియోడినమ్, జిజినమ్, ఇలియమ్.
పూర్తిగా పెరిగిన వ్యక్తి తాలూకు చిన్నపేగుల సరాసరి పొడవు 6.9 మీటర్లు (22
అడుగుల 6 అంగుళాలు) ఉంటుంది. అదే మహిళల్లో అయితే దీని సగటు పొడవు 7.1
మీటర్లు ఉంటుంది. (ఉజ్జాయింపుగా 23 అడుగుల 4 అంగుళాలు). మనుషుల ఒడ్డూ
పొడవుల్లోలాగే దీని పొడవుల్లోనూ తేడాలుంటాయి. అంటే వీటి పొడవు రేంజ్... 4.6
మీటర్ల (15 అడుగుల) నుంచి 9.8 మీటర్ల (32 అడుగుల) వరకు ఉండవచ్చు.
చిన్నపేగు బాధ్యతలు... మనలో జీర్ణం అయిన ఆహారం తాలూకు పోషకాలను ఒంటికి
పట్టేలా చేసే ప్రధాన బాధ్యత చిన్నపేగులదే. జీర్ణవ్యవస్థలో చిన్నచిన్న
ముక్కలుగా జీర్ణమైన ఆహారం కాస్తా చిన్నపేగుల్లోకి వచ్చేసరికి దాదాపు
ద్రవపదార్థంలా మారి వాటిలోనుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ద్రవం చిన్నపేగుల
లోపలి ఉపరితలంలో ఉండే సన్నటి రక్తనాళాల ద్వారా ఆహారంలోని పోషకాలన్నీ
శరీరంలోకి శోషితం కావడం (ఇంకిపోవడం) జరుగుతుంది.
ఈ శోషితమయ్యే
భాగాన్ని పెంచడం కోసం చిన్నపేగుల లోపలి భాగాలు నున్నగా కాకుండా... ఎన్నో
ముడుతలు పడ్డట్లుగా ఉంటుంది. చిన్నపేగుల నుంచి జీర్ణమైన ఆహారం, నీరు,
విటమిన్లు, లవణాలు, కొవ్వులు, మనం తిన్న మందులు... ఇవన్నీ శరీరంలోకి మనం
ఆహారం తీసుకున్న మూడు నుంచి ఆరుగంటల వ్యవధిలో కలుస్తాయన్నమాట. మనం తాగిన
నీటిని కూడా చిన్నపేగులు శరీరానికి అందజేస్తాయి.
సాధారణంగా
ప్రతిరోజూ తొమ్మిది లీటర్ల నీరు చిన్నపేగు ద్వారా బయటకు వెళ్తుంటుంది. మనం
నోటినుంచి తీసుకున్న నీటితో పాటు... మనలోని అంతర్గత భాగాలైన పాంక్రియాస్,
బైల్‌జూస్ వంటి భాగాల్లో జీవక్రియల కోసం ఉపయోగపడ్డ నీరు కూడా
చిన్నపేగుల్లోకి వచ్చి చేరుతుంది. అక్కడ ఒక్క లీటర్ మినహాయించి మిగతాదంతా
శరీరంలోకి ఇంకుతుంది. అక్కడ మినహాయించిన ఒక లీటర్ నీరు చిన్న పేగుల నుంచి
పెద్దపేగుల్లోకి వెళ్తుంది. పెద్దపేగుల్లోకి వచ్చిన లీటర్ నీటిలో 150
మి.లీ. తప్ప మిగతాదంతా మళ్లీ పెద్దపేగుల ద్వారా శరీరంలోకి ఇంకుతుంది.
ప్రకృతి గొప్పదనం ఇది...
మనశరీరంలో సుమారు 6 మీటర్ల పొడవుండే చిన్నపేగులో చాలా భాగాన్ని
తొలగించినా మనిషి మామూలుగానే బతుకుతాడు. ఒకవేళ దీని పొడవు 200 సెం.మీ. కంటే
తగ్గినప్పుడు మాత్రమే మనిషి ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు. మూడింట
రెండువంతుల భాగాన్ని తొలగించినప్పుడు మనిషికి అందాల్సిన పోషకాలు అందకపోవడం,
విరేచనాలు కావడం (పొడవు తగ్గడంతో ఆహారం ఉండాల్సిన ప్రదేశం తగ్గిపోయిన
కారణం చేత) వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని అరుదైన జబ్బుల్లో లేదా
ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు... ఒకవేళ చిన్నపేగుల నిడివిలో 90 శాతం
తొలగించాల్సి వస్తే అప్పుడు జీవనం కొనసాగించడం కష్టమే. తప్పనిసరిగా
చిన్నపేగు మార్పిడి చికిత్స చేయాల్సి ఉంటుంది.
చిన్నపేగుల జబ్బుల వల్ల కనిపించే లక్షణాలు
చిన్నపేగులకు వచ్చే వివిధ రుగ్మతల వల్ల కనిపించే లక్షణాల్లో ముఖ్యమైనవి
విరేచనాలు, దాని వల్ల కలిగే డీ-హైడ్రేషన్. ఈ కారణంగా శరీరానికి పోషకాలు
అందవు. అప్పుడు కిందినుంచి గాలి పోవడం, వాంతులు, తినడం కష్టం కావడం వంటివి
కనిపిస్తాయి.
ఇంటస్టినల్ ఫెయిల్యూర్ అంటే...
చిన్నపేగుల్లో
ఆహారాన్ని ఇంకింపజేసుకునే శక్తి క్షీణించడాన్ని ఇంటస్టినల్ ఫెయిల్యూర్
అంటారు. ఇది పిల్లల్లో సాధారణంగా కనిపించే గట్ సిండ్రోమ్ అనే పుట్టుకతో
వచ్చే జబ్బుల్లో కనిపిస్తుంది. ఈ రుగ్మత వల్ల ఆహారం జీర్ణం కాదు. కొందరు
పెద్దల్లో సర్జరీ తర్వాత చిన్నపేగులకు ఆహారాన్ని శోషింపజేసుకునే శక్తి
క్షిణించే అవకాశాలున్నాయి.
చిన్నపేగు మార్పిడి, దాని ఉపయోగాలు
కొన్నిసార్లు చిన్నపేగు పూర్తిగా తన విధులను నిర్వహించడంలో విఫలం అయితే
రోగికి ఆహారాన్ని సెలైన్ ద్వారానే అందించాల్సి ఉంటుంది. అలా సెలైన్ ద్వారా
కూడా రోగికి ఆహారాన్ని అందించలేని పరిస్థితుల్లో రోగి తనంతట తానే ఆహారాన్ని
తీసుకుని అరిగించుకునేందుకు చిన్నపేగు మార్పిడి శస్త్రచికిత్స
నిర్వహించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment