పొద్దున్నే లేచి ముఖం కడుక్కుంటాం. కానీ శరీరంలోని అంతర్గత అవయవాలను
నేరుగా కడగలేం. అయితే ఒక్క ముఖం కడగడం అంటేనే... పరోక్షంగా శరీరంలోని ఎన్నో
అవయవాలనూ శుభ్రం చేయడమన్నమాట. దంతాల సంరక్షణకూ... గుండెజబ్బులు,
ఊపిరితిత్తుల వ్యాధుల నివారణకూ సంబంధం ఉంది. మహిళల నోటి ఆరోగ్యంపైనే వారి
కడుపులోని బిడ్డ ఆరోగ్యం ముడిపడి ఉంది. నోటికీ... మన లోని గుండె,
మూత్రపిండాలు, కళ్లు, కాలేయం, థైరాయిడ్, మెదడు, ఊపిరితిత్తులు... ఇలా అనేక
అవయవాల ఆరోగ్యానికీ సంబంధం ఉంది.
నోటి సంరక్షణ చక్కగా జరుగుతోందంటే క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్
నివారణ కూడా సాధ్యమవుతోందని అర్థం అంటున్నారు దంత వైద్యనిపుణులు. అంటే...
నోరు మంచిదైతే హెల్త్ కూడా మంచిదవుతుందన్నమాట. నోటి ఆరోగ్యానికీ... మనలో
అంతర్గతంగా ఉండే అవయవాలకూ, హైబీపీ, చక్కెర లాంటి వ్యాధులకు ఉన్న దగ్గరి
సంబంధాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేదే... ఇవాళ్టి ఈ ప్రత్యేక
కథనం.
మన నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే అది శరీరంలోని అంతర్గత
అవయవాలన్నింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. నోటి పరిశుభ్రతకూ మన శరీరంలోని వివిధ
అవయవాలకు మధ్య ఉన్న సంబంధం ఇలా...
చిగుర్ల ఆరోగ్యమే గుండెకు రక్ష: మనం
రోజూ చక్కగా బ్రష్ చేసుకుని చిగుర్ల ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటే
గుండెజబ్బులను, గుండెపోటును నివారించినట్లే. నోటి శుభ్రత సరిగా పాటించని
వారిలో గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజెస్) వచ్చిన దాఖలాలు ఉన్నట్లుగా
అనేక అధ్యయన ఫలితాలున్నాయి. దీనికి సంబంధించి రెండు థియరీలను
చెప్పుకోవచ్చు. మొదటిది... నోటిలో జబ్బులకు, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే
బ్యాక్టీరియా కొన్ని రకాల విషాలను వెలువరిస్తుంటాయి. ఇవి రక్తప్రవాహంలోకి
ప్రవేశించి రక్తం సాఫీగా ప్రవహించడానికి అడ్డుపడేలా కొన్ని రక్తపు గడ్డలు
(క్లాట్స్), కొవ్వుముక్కల వంటి పదార్థాలను (ప్లాక్స్) తయారు చేస్తాయి. అవి
రక్తప్రవాహానికి అడ్డుపడటంతో గుండెపోటు రావచ్చు. రెండో థియరీ ప్రకారం...
నోటిలోని హానికారక బ్యాక్టీరియా కారణంగా కాలేయంలో కొన్ని ప్రోటీన్లు
తయారవుతాయి. అవి రక్తనాళాల్లోకి ప్రవేశించి అడ్డుపడటం వల్ల గుండెపోటుకు
ఒక్కోసారి పక్షవాతానికీ కారణమవుతాయి. ఒక్కోసారి నోటిలో ఉండే బ్యాక్టీరియా
వల్ల ‘ఎండోకార్డయిటిస్’ వంటి గుండెలోపలి పొరల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం
ఉంది. అందుకే మీరు రోజూ సరిగా బ్రష్ చేసుకుంటున్నారంటే, మీరు నోటి
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే కాదు... గుండెపోటునూ నివారిస్తున్నారన్నమాట.
గుండెజబ్బులు ఉన్నవారు దంత చికిత్స తీసుకోడానికి దంతవైద్యుడిని
కలిసేందుకు ముందుగా రక్తన్ని పలచబార్చేందుకు వారు వాడే ఆస్పిరిన్,
క్లోపిడోగ్రెల్ వంటి మందులను మూడు నుంచి ఐదు రోజుల ముందుగానే పూర్తిగా
నిలిపివేయాలి బైపాస్ సర్జరీ చేయించుకోదలచినవారు ముందుగా దంతవైద్యుడిని
కలిసి తమకు పళ్లు, చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవీలేవని నిర్ధారణ
చేసుకోవాలి. దంతసంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే బైపాస్ ద్వారా వచ్చే
పూర్తి ఫలితాలను పొందలేం.
దంతాలు... ఊపిరితిత్తులు :
నోటిలో బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది గొంతులోకి ప్రవేశించి
అక్కడ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిలో కలిసి లంగ్స్‌లోకి ప్రవేశించవచ్చు.
ఇది ఒక్కోసారి పల్మునరీ ఇన్ఫెక్షన్స్‌కు, నిమోనియాకు దారితీయవచ్చు. ఇది
వయసు పైబడ్డవారిలో జరిగితే వాళ్లలో సహజంగానే వ్యాధినిరోధక శక్తి తక్కువగా
ఉండటం వల్ల సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) వంటి
దీర్ఘకాలిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఒక్కోసారి చిగుర్లలో ఉండి
ఇన్‌ఫ్లమేషన్ కలిగించే ‘సైటోకైన్స్’ ఊపిరితిత్తుల్లోని కింది భాగానికి
చేరితే అవి మరింత ప్రమాదకరమైన శ్వాసకోశవ్యాధులకు ఆస్కారమివ్వవచ్చు.
నోటి ఆరోగ్యం... మూత్రపిండాలపై దాని ప్రభావం:
మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అంటే
కిడ్నీవ్యాధులు ఉన్నవారు ఇన్ఫెక్షన్లకు తేలిగ్గా లోనవుతారన్నమాట. అదీగాక
మూత్రపిండాల జబ్బులతో బాధపడేవారికి నోటి రుచి మారిపోతుంది. పైగా వాళ్ల నోటి
నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మన శరీరం నుంచి
మాలిన్యాలను తొలగించేవి మూత్రపిండాలే కదా! అవి పనిచేయడం మానేయడం వల్ల
మాలిన్యాలన్నీ అలాగే పోగుపడతాయి. దాంతో మన శరీరంలోని యూరియా అమోనియాగా మారి
నోటి ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే నోటి నుంచి అలా దుర్వాసన
వస్తుంటుందన్నమాట. దీనికి తోడు ఎముకలు కూడా క్యాల్షియమ్‌ను సక్రమంగా
గ్రహించలేవు. ఫలితంగా దవడ ఎముకలు బలహీనం కావడం, పళ్లు ఊడిపోవడం వంటివి
జరగవచ్చు. నోరు పొడిగా మారిపోవచ్చు. ఈ కండిషన్‌ను గ్జీరోస్టోమియా అంటారు.
మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో పళ్లు ఊడిపోవడం లాలాజలగ్రంథుల
ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు రావచ్చు.
కొన్ని జాగ్రత్తలు అవసరం:
కిడ్నీ జబ్బు ఉండి డయాలసిస్ చికిత్స తీసుకునేవారు తప్పనిసరిగా
దంతవైద్యుడితో సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. ఈతరహా రోగులు డెంటల్ చికిత్స
తీసుకోవాల్సి వస్తే... అది తప్పకుండా డయాలసిస్ అయిన మర్నాడు ప్లాన్
చేసుకోవడం మంచిది. అలాగే షంట్ చికిత్స ఇచ్చిన రోగులకు రక్తాన్ని పలచబార్చే
మందులు ఇస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో దంత చికిత్స చేస్తే రక్తస్రావం
జరిగి ప్రమాదానికి దారితీయవచ్చు. అలాంటప్పుడు దంతచికిత్స చేస్తే
తప్పనిసరిగా మంచి యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుందన్నమాట. చాలావరకు మనం
దంతవైద్య చికిత్సలో వాడే నొప్పి నివారణ మందులు కిడ్నీపై ప్రభావం చూపి
అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ (కిడ్నీ ఫెయిల్యూర్)కు దారితీస్తాయి. కాబట్టి ఏ
మందులనైనా డాక్టర్ సూచించిన మోతాదులోనే వాడాలి.
నోటి ఆరోగ్యం... క్యాన్సర్ల విషయంలో మరికొన్ని అంశాలు:
పొగతాగడం వంటి కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ప్రోస్టేట్, లంగ్ క్యాన్సర్లతో సహా అనేక రకాల క్యాన్సర్లను నివారించవచ్చు.
నోటి క్యాన్సర్‌లను గుర్తుపట్టడం ఎలా:
నోటిలో
చాలాకాలంగా మానని పుండు నోటిలో ఏదైనా గడ్డలా తగులుతుండటం చాలాకాలంగా
గొంతు బొంగురుగా ఉండటం నమలడం, మింగడంలో ఇబ్బంది నాలుక లేదా దవడలు కదలడంలో
ఇబ్బందులు గొంతులో ఎప్పుడూ ఏదో అడ్డుపడి ఉన్న ఫీలింగ్... ఈ లక్షణాలు ఉంటే
తప్పనిసరిగా వైద్యనిపుణులను కలిసి సలహా తీసుకోవాలి.
ఇక క్యాన్సర్‌కు
రేడియేషన్ చికిత్స తీసుకున్నవారిలో చాలామందికి నోటిలో లాలాజల స్రావం
తగ్గుతుంది. దాంతో వారికి పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వ్యాధులు రావడం వంటి
ప్రమాదాలు ఉంటాయి. ఇలాంటివారు లాలాజలానికి ప్రత్యామ్నాయ మందులు వాడాల్సి
ఉంటుంది.
పై అంశాలను దృష్టిలో ఉంచుకుని ఒక్క నోటిని శుభ్రంగా
ఉంచుకుంటే శరీరంలోని దాదాపు అన్ని అవయవాలనూ శుభ్రపరచుకున్నట్లేనని
గ్రహిస్తే శరీరమంతటికీ ఆరోగ్యమే.
నోటి ఆరోగ్యం... మెదడుపై ప్రభావం
నోటి
శుభ్రతకూ, మెదడుకూ దగ్గరి సంబంధం ఉందంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. కానీ ఆ
మాట అక్షరాలా నిజం. మన నోటిలో చిగుళ్లపై ఒక రకం గార ఏర్పడటం సాధారణం.
దీన్నే సూప్రా జింజివల్ ప్లాక్ లేదా సబ్ జింజివల్ ప్లాక్ అంటారు. ఈ గార మన
రక్తంలోని ప్లేట్‌లెట్‌లను ప్రభావితం చేసి... అవి గుంపులుగా చేరేలా
ప్రేరేపిస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన ‘థ్రాంబస్
ఫార్మేషన్’ జరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం
ఉంది. దీన్నే ‘థ్రాంబోఎంబాలిజమ్’ అంటారు. ఈ ప్రక్రియ మెదడుకు రక్తాన్ని
చేరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది పక్షవాతానికి దారి తీయవచ్చు. అంటే
మనం ముఖం సరిగా కడుక్కోకపోతే పక్షవాతం వచ్చే ప్రమాదమూ ఉందన్నమాట. మరో విషయం
ఏమిటంటే... మన మెదడులో చిన్న పగులు వంటిది ఏర్పడి అందులో చీము నిండటాన్ని
బ్రెయిన్ యాబ్సెస్ అంటారు. నోటిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి ఇలాంటి
యాబ్సెస్‌లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే దంతాలకు ఏదైనా చికిత్స
తీసుకున్నప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ మందులను డాక్టర్ల
సలహా మేరకు వాడాలి. ఒకవేళ అలా జరగకపోతే నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్‌లు...
క్రమంగా మన పుర్రెలోని రంధ్రాలైన కావెర్నస్ సైనస్‌ల ద్వారా మెదడుకు చేరి...
బ్రెయిన్ యాబ్సెస్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ముఖం శుభ్రంగా
కడుక్కోవడం అంటే మన మెదడునూ సురక్షితంగా ఉంచుకోవడం అని అర్థం.
నోటి సంరక్షణే... పిండ సంరక్షణ...
గర్భవతుల్లో
‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్’ అనే ఒక రకం చిగుర్ల వ్యాధి వస్తుంటుంది. ఇది
సాధారణంగా గర్భధారణ జరిగిన రెండో నెలలో కనిపిస్తుంటుంది. ఒకవేళ ఆ మహిళకు
అంతకు ముందే చిగుర్ల సమస్య ఉంటే అది గర్భధారణ తర్వాత మరింత తీవ్రతరం
అవుతుంది. ఇలాంటి సమయాల్లో నోటి శుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే వాచిన
చిగుర్లలో లేదా నోటిలో కణుతులు, మంటలేని-క్యాన్సర్‌కాని (నాన్
ఇన్‌ఫ్లమేటరీ, నాన్ క్యాన్సరస్) గడ్డలు పెరగవచ్చు. గర్భధారణ సమయంలో నోటి
ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే వాళ్లకు నిర్ణీత వ్యవధి కంటే ముందే
ప్రసవం కావడం (నెల తక్కువ బిడ్డలు పుట్టడం), పుట్టిన బిడ్డ బరువు చాలా
తక్కువగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా
రక్తప్రవాహంలో కలిసి గర్భసంచి (యుటెరస్)కి చేరి అక్కడ ప్రోస్టాగ్లాండిన్
వంటి రసాయనాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దాంతో అది గర్భధారణ వ్యవధి
ముగియక ముందే ప్రసవానికి (ప్రీ మెచ్యూర్ లేబర్‌కు) దారితీయవచ్చు. అందుకే
గర్భవతులు తమ నోటి ఆరోగ్యాన్ని చక్కగా సంరక్షించుకుంటే అది పుట్టబోయే
బిడ్డకూ మేలు చేస్తుందని మరవద్దు.
గర్భిణులు టెట్రాసైక్లిన్ వంటి
యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఆ ప్రభావం పిండం మీద పడి శిశువు పళ్ల రంగు
మారిపోతుంది. కాబట్టి గర్భిణులు యాంటీబయాటిక్స్‌ను ఫిజీషియన్ సలహా మేరకే
వాడాలి.
పన్ను... కన్ను... మంచి ఆరోగ్యం
మనలో
చాలామందికి... పన్ను పీకిస్తే అది కంటి నరాలను అదిరేలా చేసి చూపును
తగ్గిస్తుందని, కంటిచూపుపై ప్రభావం పడేలా చూస్తుందన్నదే ఆ అపోహ. ఇది నిజం
కాదు. అయితే పైన మెదడు విషయంలో జరిగినదే కంటి విషయంలోనూ జరగవచ్చు.
పలువరసకుగాని, నోటిలోగాని వచ్చే ఇన్ఫెక్షన్లు మెదడుకు చేరే మార్గంలోనే
కంటికి చేరి ‘కార్నియల్ ఇన్ఫెక్షన్’గా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో పైవరస
పంటికి పైభాగంలో ఉండే ఎముకల్లో చీము పట్టడం జరిగితే... అది కంటికి చాలా
దగ్గరగా ఉన్న కారణంగా ఆ ఇన్ఫెక్షన్ కంటినీ ప్రభావితం చేయవచ్చు. ఇక కంటికి
క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోదలచినవారు ముందుగా నోటిలో ఎలాంటి
ఇన్ఫెక్షన్‌లూ లేకుండా చూసుకుని ఆ తర్వాతే ఆపరేషన్ చేయించుకుంటే మంచిది.
నోటి ఆరోగ్యం... క్యాన్సర్లు
నోటి
ఆరోగ్యాన్ని చక్కగా చూసుకునే క్రమంలో పొగతాగడమనే ఒక్క దురలవాటును
మానుకుంటే ఎన్నో క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. పొగతాగే అలవాటు
ఉన్నవారిలో తెల్లరక్తకణాల్లో ఉండే న్యూట్రోఫిల్స్ పనితీరు లోపభూయిష్టంగా
ఉంటుంది. పొగతాగేవారిలో ఎముకలు పలచబారుతాయి. ఇదీ నోటి నుంచే జరుగుతుంది.
సిగరెట్‌లో ఉండే నికోటిన్ కారణంగా మన చిగుర్ల చుట్టూ ఏర్పడే గారను
స్వాభావికంగానే తొలగించుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా సిగరెట్ వల్ల
పంటికి, చిగుర్లకు చేసే చికిత్స పూర్తి ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. పైగా మన
దేశంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు చాలా ఎక్కువ. పొగ తాగే అలవాటు మానివేయడం
వల్ల ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు లంగ్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన
పరిస్థితులనూ నివారించుకోవచ్చు. ఇక పొగాకు నమలడం వల్ల ల్యూకోప్లేకియా,
పెరియోడాంటల్ డిసీజ్ వంటివీ ఎక్కువే. కాబట్టి ఈ దురలవాటు మానేయడం వల్ల పై
జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ఇక నోటిలో ఏవైనా పుండ్లు, చీలికలు (లీజన్స్)
ఉంటే పొగాకు నమిలే అలవాటుకు దూరంగా ఉండితీరాలి. గుట్కా తినేవారికి
కొన్నాళ్ల తర్వాత నోరు తెరవలేని స్థితి వస్తుంది. కారం ఏమాత్రం తగిలినా
భరించలేకపోవడం, బుగ్గ గట్టిపడిపోవడం (ఫైబ్రోసిస్) వంటివి జరుగుతాయి. ఈ
లక్షణాలు కనిపిస్తున్నాయంటే అది క్యాన్సర్‌కు తొలి దశ అని గుర్తించాలి,
జాగ్రత్త పడాలి.
నోరు - థైరాయిడ్ సంబంధాలిలా...
మన
శరీరంలో ఉన్న గ్రంథులన్నింటిలోనూ కీలకమైనది థైరాయిడ్. సాధారణంగా థైరాయిడ్
విషయంలో రెండు రుగ్మతలు ఉంటాయి. మొదటిది థైరాయిడ్ పూర్తిస్థాయిలో పనిచేయని
హైపోథైరాయిడిజమ్. రెండోది థైరాయిడ్ మరీ అతి చురుకుగా వ్యవహరించే
హైపర్‌థైరాయిడిజమ్. హైపర్ థైరాయిడిజమ్ ఉన్న రోగుల్లో పంటిలో రంధ్రాలు
(క్యావిటీస్), చిగుర్ల సమస్యలు రావడం, థైరాయిడ్ పెద్దది కావడం, నోటిలో మంట
రావడం (బర్నింగ్ మౌత్ సిండ్రోమ్), నోటిలో ఉండే ఎముకలైన మాగ్జిల్లరీ,
మాండిబుల్‌కు ఆస్టియోపోరోసిస్ రావడం వంటి సమస్యలు చూడవచ్చు. అలాగే
హైపోథైరాయిడిజమ్ ఉన్న రోగుల్లో లాలాజల గ్రంథుల వాపు, లాలాజల స్రావం మరీ
ఎక్కువ కావడం, నాలుక మందం పెరగడం, నాలుక మంటపుట్టడం (ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్
టంగ్), నోటికి రుచి ఎంతమాత్రమూ తెలియకుండా పోవడం (డిస్‌గెసియా),
నోటిద్వారానే గాలి పీల్చుకోవాల్సి రావడం వంటి కండిషన్స్ కనిపిస్తాయి.
అందుకే థైరాయిడ్ సమస్యలు వచ్చినప్పుడు ఫిజీషియన్‌తో పాటు ఒకసారి
దంతవైద్యనిపుణులూ పరీక్షించడం అవసరం. హైపర్ లేదా హైపో థైరాయిడిజమ్‌లలో
దేనితో బాధపడుతూన్నా, ఆ రోగులకు ఎపీనెఫ్రిన్, వాసోప్రెస్సార్స్ వంటి మందులు
వాడాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మత్తు కలిగించే మందులు
వాడాల్సి వచ్చినప్పుడు మరింత శ్రద్ధతో చికిత్స చేయాల్సి ఉంటుంది.
హైబీపీకీ - నోటి ఆరోగ్యానికీ గల సంబంధం
అధిక
రక్తపోటుకూ (హైబీపీ), నోటి ఆరోగ్యానికీ నేరుగా సంబంధం లేకపోయినా పరోక్షంగా
ఎంతో దగ్గరి సంబంధం ఉన్నట్లే. అధిక రక్తపోటుకు వాడే మందులు నోటిని
ఎండిపోయినట్లుగా అనిపించేలా చేస్తాయి. ఆ మందులు వాడేవారిలో చాలామందికి రుచి
కూడా సక్రమంగా తెలియదు. ఈ కండిషన్‌ను ‘డిస్‌జెసియా’ అంటారు. కొన్ని హైబీపీ
మందులతో (ముఖ్యంగా క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్స్‌తో) చిగుర్లు పరిమితికి
మించి పెరగవచ్చు. కొందరిలో ఈ చిగుర్ల పెరుగుదల, వాళ్లు ఆహారం నమలడానికి
కూడా అడ్డుపడేంతగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ అదనపు చిగురును సర్జరీ
ద్వారా తొలగించాల్సి రావచ్చు. అంటే... హైబీపీ మందులు వాడుతున్నప్పుడు
నోరంతా ఎండిపోకుండా, రుచి తెలుస్తూ ఉందంటే మన ఆరోగ్యం బాగున్నట్లేనని
భావించవచ్చు.
నోటి పరిశుభ్రత- డయాబెటిస్...
డయాబెటిస్ ఉన్నవారు తమ చక్కెరపాళ్లను అదుపులో పెట్టుకోకపోతే నోటికి సంబంధించిన అనేక సమస్యలు రావచ్చు. అవి...
లాలాజలం ఉత్పత్తిని దెబ్బతినవచ్చు. అందుకే చక్కెర వ్యాధి ఉన్న చాలామందిలో
నోరు పొడిబారిపోతుంటుంది. అది క్రమంగా నోటిలో పుండ్లకు, దంతక్షయానికి
దారితీయవచ్చు.
చిగుర్ల వ్యాధులు: చక్కెర నియంత్రణలో లేకపోతే
జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వంటి చిగుర్ల ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు రావచ్చు.
డయాబెటిస్ ఉన్నప్పుడు అది రక్తనాళాలను మందంగా చేయడం వల్ల రక్తప్రవాహం సరిగా
జరగక, శరీరంలోని అనేక భాగాలకు పోషకాలు సరిగా అందకపోవచ్చు. ఫలితంగా ఈ రెండో
పరిణామంతో మన అన్ని శరీర భాగాలకు అందాల్సిన పోషకాలు అందక శరీరానికి
రోగనిరోధకశక్తి తగ్గవచ్చు. ఫలితంగా నోటి సమస్యలు, చిగుర్ల వ్యాధులు
ఉన్నవారిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి వాటికి గురయ్యే అవకాశాలు
పెరుగుతాయి.
పళ్లు వదులై కదులుతున్నప్పుడు లేదా చిగుళ్ల నుంచి
రక్తస్రావం అవుతున్నప్పుడు లేదా నోటిలో ఏదైనా పుండై అది మానకుండా ఉంటే
దంతవైద్యుడిని కలిసి డయాబెటిస్ ఉందేమోనని నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం
తప్పనిసరి.
----------------------------------------------------
Source : Sakshi News Paper
No comments:
Post a Comment