Pages

Tuesday, January 29, 2013

కాకి లెక్కలు

ఒకరోజు ఉదయం బీర్బల్ రాజదర్బారుకు వెళ్లేసరికి అందరి ముఖాలూ దిగాలుగా కనిపించాయి. అక్బరు చక్రవర్తి వాళ్లని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడనీ, దానికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయి ఉంటారనీ అర్థమయ్యింది బీర్బల్‌కి.

అతను నెమ్మదిగా చక్రవర్తి దగ్గరకు వెళ్లి, ‘‘విషయం ఏమిటి జహాపనా?’’ అని అడిగాడు.

‘‘మన రాజ్యంలో విషయాలేవీ మన మంత్రులకి పట్టడం లేదు. ఇలా అయితే మన రాజ్యం నడపలేం’’ అన్నాడు కోపంగా.

‘‘అసలు సంగతేంటి జహాపనా?’’ అని అడిగాడు బీర్బల్.

‘‘మన రాజ్యంలో మొత్తం కాకులెన్ని ఉన్నాయో అని వీళ్లని అడిగితే ముఖాలు వేళ్లాడేసుకుని తెలియదు అంటున్నారు’’ అన్నాడు చక్రవర్తి.

‘‘ఓస్ అంతేనా!’’ అన్నాడు బీర్బల్.

‘‘నీకు తెలుసా?’’ అడిగాడు చక్రవర్తి.

‘‘ఓ! మన రాజ్యంలో మొత్తం నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు కాకులున్నాయి. కావాలంటే లెక్క పెట్టించండి’’ చెప్పాడు బీర్బల్.

‘‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు? ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే?’’ అడిగాడు చక్రవర్తి.
మన రాజ్యంలో ఉన్న చుట్టాలని చూడటానికి పక్క రాజ్యాల నుంచి కొన్ని కాకులు వచ్చి ఉంటాయి ప్రభూ!’’

‘‘అలాగా! మరి తక్కువ ఉంటే?’’

‘‘ఉండొచ్చు ప్రభూ! మన కాకులు వాళ్ల చుట్టాలని చూడటానికి పక్క రాజ్యాలకు వెళ్లి ఉండొచ్చు కదా?’’ అన్నాడు బీర్బల్.

ఈ కాకి లెక్కలకు అక్బరు హాయిగా నవ్వుకున్నాడు.

No comments:

Post a Comment