Thursday, March 28, 2013

స్మార్ట్‌గా చూసుకుంటున్నారా?!

0 comments
ఐఫోన్‌లూ, అధునాతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లూ... అందరి చేతిలోనూ ఉన్నాయి! అయితే వీటి అప్స్‌కు తగ్గట్టుగా అప్‌డేట్ అవకపోతే మాత్రం తిప్పలు తప్పవు. ముఖ్యంగా ఇంటర్నెట్‌తో అనుసంధానమైన స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇబ్బందులే! ఈ ఇబ్బందులు కూడా స్మార్ట్‌ఫోన్‌లు వాడే స్మార్ట్‌పర్సనాలిటీలకు తెలిసినవే. ఈ చిక్కుల నుంచి బయటపడే చిట్కాలివిగో...


మొబైల్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ అప్‌డేట్ అయినప్పుడు డిస్‌ప్లే అయ్యే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ వైపు చిరాగ్గా చూడటం ...ఆనక ఆ సాఫ్ట్‌వేర్‌ను స్కిప్ చేసేయడం! ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ యూజర్లు చేసే పని! ఒక్క స్మార్ట్‌ఫోన్ విషయంలోనే కాదు, పీసీ విషయంలో కూడా అప్‌డేట్స్ అడిగే సాఫ్ట్‌వేర్ అంటే చిరాకే! అయితే ఈ చిరాకుతో చిక్కులేనంటున్నారు నిపుణులు. కేవలం యాంటీవైరస్ మాత్రమే కాదు, యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం అవసరం అంటున్నారు. అమెరికాలో ప్రతి 3.5 సెకన్లకూ ఒక స్మార్ట్ ఫోన్ ఓనర్ చేతులు దాటిపోతోంది! వీటిలో చాలా వాటికి డాటాకు సంబంధించిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోకపోవడంతో సదరు స్మార్ట్‌ఫోన్ యజమానులకు తిప్పలు తప్పట్లేదు.

ఆప్స్‌పై శ్రద్ధ ఉండాలి... స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ లను ఆడేసుకుంటూ ఆనందించడమే కాదు... వాటికి, ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా పట్టించుకోవాలి. మీరు వాడుతున్న డివైజ్ తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, అప్లికేషన్ డెవలపర్లు... సరికొత్త డెవలప్‌మెంట్స్‌ను తమ యూజర్లందరికీ ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేస్తుంటారు. వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కొంచెం శ్రద్ధ వహించాలి. ఇక్కడ ఆండ్రాయిడ్ యూజర్లకు ఒక సౌలభ్యం ఉంది. సెట్టింగ్స్‌లో ‘అప్‌డేట్ ఆటోమేటికల్లీ’ని సెట్ చేస్తే ఇక నిశ్చితంగా ఉండొచ్చు.

పాస్‌వర్డ్ టైమ్డ్ సెట్టింగ్స్‌తో జాగ్రత్త... టెక్ట్స్ లేదా నంబర్ రూపంలో పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం లేదా స్వైపింగ్ పాస్‌వర్డ్‌తో స్మార్ట్‌ఫోన్‌లు ఆపరేట్ చేసుకోవడంలోనూ జాగ్రత్త వహించాలి. ప్రత్యేకించి ఫోన్ తిరిగి లాక్ అవ్వడానికి వీలైనంత తక్కువ టైమ్ సెట్ చేసుకుంటే మంచిది.

జైల్ బ్రేకింగ్‌తో తిప్పలే!.. ఒక కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో దానిలో ఇన్‌స్టలేషన్ చేసుకోదగ్గ అప్లికేషన్స్ గురించి కచ్చితమైన పరిమితులు ఉంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌ను మరో నెట్‌వర్క్‌కు మార్చుకునే సమయాల్లో ‘జైల్‌బ్రేకింగ్’ అనివార్యమయితే మాల్ వేర్ ప్రమాదాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను జైల్‌బ్రేకింగ్ చేయించుకోవడం తప్పు అనలేం కానీ ఫోన్‌ను కొత్తనెట్‌వర్క్‌కు అనుసంధానించుకునే యత్నంలో సేఫ్‌గార్డ్స్ కూడా పోతాయి. దీంతో తర్వాత కొత్త యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొనే సమయంలో మాల్ వేర్ ప్రమాదాలు ఎక్కువ.

అనుచిత మెసేజ్‌లకు స్పందించొద్దు!.. అపరిచితులు, మనకు తెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే టెక్ట్స్‌మెసేజ్‌లకు తిరిగి మెసేజ్ రూపంలో స్పందించకపోవడమే మంచిదని నిపుణులు అంటారు. స్పామ్‌మెసేజ్‌ల ద్వారా హ్యాకర్లు స్మార్ట్‌ఫోన్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుందనేది హెచ్చరిక. అలాగే మెసేజ్‌ల రూపంలో వచ్చే ఇ-లింక్స్ మీద క్లిక్ చేయడంలో కూడా తొందర వద్దు.

వైఫై విషయంలో కక్కుర్తి వద్దు!... మరీ విశ్వసనీయమైన ప్రదేశాల్లో తప్ప ఎక్కడబడితే అక్కడ అందుబాటులో ఉన్న వైఫైని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించకూడదని నిపుణులంటున్నారు. పబ్లిక్‌ప్లేస్‌లలో వైఫై అందుబాటులో ఉందని చెప్పి అక్కడే కూర్చుని స్మార్ట్‌ఫోన్‌తో నెట్ సర్ఫ్ చేసుకోవడం అంత మంచిది కాదు. బహిరంగ ప్రదేశాల్లోని వైఫై నెట్‌వర్క్‌తో మీ ఇంటర్నెట్ కార్యకలాపాలకు ప్రైవసీ ఉండకపోవచ్చు. ఇంటర్నెట్ నరకులు తలచుకుంటే తాము ఏర్పాటు చేసిన వైఫై పరిధిలో ఏ ఫోన్ నుంచి ఎవరేం చేస్తున్నారు అనే విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోగలరు!

అడ్డమైన అప్లికేషన్ డౌన్‌లోడ్‌లొద్దు! ...సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘ట్రెండ్‌మైక్రో’ అంచనా ప్రకారం గత ఏడాది ఏకంగా పదిక్షలకు పైగా నకిలీ అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి! ఇలాంటి వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ఇబ్బందుల పాలయిన స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్యనయితే లెక్కపెట్టలేమేమో! ఇంతకీ విషయం ఏమిటంటే...యాపిల్స్ యాప్‌స్టోర్ లేదా గూగుల్ ప్లే వంటి అధికారిక సైట్ల నుంచి మాత్రమే అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన.

పీసీకి కనెక్ట్ చేయడంలో జాగ్రత్త!... ఎటు తిరిగీ మళ్లీ యాంటీవైరస్ దగ్గరకే వస్తుంది వ్యవహారం. ఇంట్లో లేదా ఆఫీసులో ఉండే పీసీకి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నెట్‌వర్క్‌లో ఉన్న కంప్యూటర్లకు వైరస్ ప్రమాదం ఎక్కువ. ఇలాంటి వాటికి ఫోన్‌ను కనెక్ట్ చేయడం ద్వారా మాల్ వేర్ చాలా సులభంగా అల్లుకుపోయే అవకాశం ఉంది. వైరస్ డిటెక్షన్ ఇక్కడ మంచిమార్గం. చక్కటి యాంటీవైరస్‌ను కొనసాగిస్తుండటం, స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్త గా వ్యవహరించడం ద్వారా వైరస్ సంబంధ ప్రమాదాల నుంచి స్మార్ట్‌ఫోన్‌ను రక్షించుకోవచ్చు.

ఈ సువిశాల ఇంటర్నెట్ ప్రపంచంలో నన్నూ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్‌చేయాల్సిన అవసరం ఎవరికీ లేదనే భావన, ఎవరూ నా మొబైల్‌లో డాటాను దొంగిలించలేరనే అతివిశ్వాసం పనికిరావని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. తీరా జరగాల్సిన నష్టం జరిగాక ఇబ్బంది పడే బదులు ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్ గా వ్యవహరించమని సూచిస్తున్నారు. - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59887&Categoryid=5&subcatid=14#sthash.kxpP3Mxy.dpuf

0 comments:

Post a Comment